ఇంట్లోనే ఉన్నా శరీరానికి శ్రమ కల్పించండిలా..!

లాక్‌డౌన్ కారణంగా యోగా, జిమ్, ఏరోబిక్స్.. తదితర వర్కవుట్ సెంటర్లకు వెళ్లడానికి ఇంకొంచెం సమయం పట్టేలా ఉంది. పోనీ వాకింగ్, జాగింగ్ లాంటివి చేద్దామనుకున్నా ఎప్పటిలా బయటకు వెళ్లడానికి కొంతమంది జంకుతున్నారు. ఫలితంగా చాలామంది రోజంతా ఇంట్లో ఎలాంటి శారీరక శ్రమ లేకుండా గడుపుతున్నారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు..! దీనివల్ల తెలియకుండానే మన శరీరానికి బద్ధకం అలవాటవుతుంది. శరీరానికి వ్యాయామం లేక లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది

Published : 23 Jun 2021 13:23 IST

లాక్‌డౌన్ కారణంగా యోగా, జిమ్, ఏరోబిక్స్.. తదితర వర్కవుట్ సెంటర్లకు వెళ్లడానికి ఇంకొంచెం సమయం పట్టేలా ఉంది. పోనీ వాకింగ్, జాగింగ్ లాంటివి చేద్దామనుకున్నా ఎప్పటిలా బయటకు వెళ్లడానికి కొంతమంది జంకుతున్నారు. ఫలితంగా చాలామంది రోజంతా ఇంట్లో ఎలాంటి శారీరక శ్రమ లేకుండా గడుపుతున్నారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు..! దీనివల్ల తెలియకుండానే మన శరీరానికి బద్ధకం అలవాటవుతుంది. శరీరానికి వ్యాయామం లేక లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాదు, ఇది క్రమంగా మన మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో ఇంట్లో ఉంటూనే శరీరానికి ఎలా శ్రమ కల్పించాలో తెలుసుకుందాం..!

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం మనిషికి ఒక వారంలో 75 నిమిషాల తీవ్రమైన శారీరక శ్రమ / 150 నిమిషాల సాధారణ శారీరక శ్రమ లేదా ఈ రెండూ అవసరమవుతుంది. దీంతో మనం రోజంతా ఉత్సాహంగా ఉంటాం. ప్రస్తుతం మనమంతా స్వీయ నిర్బంధం పాటిస్తుండడంతో ఇంట్లోనే మన శరీరానికి పని కల్పించే మార్గాలు కొన్నున్నాయి. అవేంటో చూద్దాం..!

నడక తప్పనిసరి!

శరీర ఆరోగ్యానికి నడక ఎంతో అవసరం. ఈ క్రమంలో బయటకు వెళ్లలేకపోయిన పక్షంలో రోజులో వీలైనంత సేపు హాల్‌లో లేదంటే బాల్కనీలో అదీ కాదంటే ఇంటి వాకిట్లో నడవడానికి ప్రయత్నించండి. ఫోన్ మాట్లాడుతూ, ఛాటింగ్ చేస్తూ, భోజనం తర్వాత, నిద్ర లేవగానే, పడుకునే ముందు.. ఇలా మీకు సమయం దొరికినప్పుడల్లా నడవండి. ఇది సులభమే కాదు.. ఎంతో ఆరోగ్యకరం కూడా..!

నిలబడడం అలవాటు చేసుకోండి..

ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎక్కువ శాతం కూర్చొనే ఉంటాం. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చొనే ఉంటారు. కానీ, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే రోజులో వీలైనన్ని సార్లు కొద్దిసేపైనా నిలబడడానికి ప్రయత్నించండి. ఫోన్ మాట్లాడేటప్పుడు, ఛాట్ చేసేటప్పుడు, కాఫీ బ్రేక్స్ తీసుకున్నప్పుడు కూడా కూర్చొని ఉండకుండా నిలబడడానికి ప్రయత్నించండి.

ఆన్‌లైన్ ద్వారా వ్యాయామ శిక్షణ..

కరోనా నేపథ్యంలో ఎంతోమంది ఫిట్‌నెస్ ట్రైనర్లు ఆన్‌లైన్ ద్వారా ఫిట్‌నెస్ తరగతులను నిర్వహిస్తున్నారు. వీరిలో చాలామంది యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా.. వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో వీటిలో మీ శరీర తత్వానికి తగిన వ్యాయామాలేంటో తెలుసుకొని.. వాటిని క్రమం తప్పకుండా చేయడం ప్రారంభించండి.

బ్రేక్ అవసరమే..!

ఇంట్లోనే ఉంటూ మన శరీరానికి శ్రమ కలిగించాలంటే వ్యాయామాలతో పాటు ఇంకా చాలా మార్గాలున్నాయి. డ్యాన్స్ చేయడం, పిల్లలతో కలిసి శారీరక శ్రమ కలిగించే ఆటలు ఆడడం, ఇంటిని శుభ్రం చేయడం, గార్డెనింగ్.. ఇలా మీకు తోచిన పద్ధతిలో మీ శరీరానికి పని కల్పించండి.

రిలాక్స్ అవ్వండి..!

శరీరంతో పాటు మన మెదడుకు కూడా వ్యాయామం అవసరమనే విషయం మర్చిపోకండి. ఇందుకోసం రోజులో కొంతసేపు ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయండి. ధ్యానం చేసే సమయాన్ని క్రమంగా పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి వ్యాయామాల వల్ల మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది.

ఇవి కూడా చేయండి..!

ఈ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మనం తీసుకునే ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. వీటిలో కొన్ని మీకోసం..!

* రోజులో వీలైనన్ని సార్లు నీళ్లు తాగాలి.. అది కూడా గోరువెచ్చటి నీళ్లైతే మరీ మంచిది.

* కూల్‌డ్రింక్స్ జోలికి పోవద్దు.

* పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి.

* ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు తినడం తగ్గించాలి.

* ఉదయం, సాయంత్రం వేడివేడిగా, తాజాగా వండుకొని తింటే మరీ మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్