ఆ అభిరుచే ఇద్దరినీ ఒక్కటి చేసింది!

‘ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉన్నట్లు’ తన విజయం వెనుక తన భార్య వినీత ఉందంటున్నాడు కొత్తగా ట్విట్టర్‌ పగ్గాలు చేపట్టిన పరాగ్‌ అగర్వాల్‌. అంతేకాదు.. దంపతులంటే ప్రతి విషయంలోనూ ఒకరికొకరు సపోర్ట్‌ చేసుకోవాలంటూ ఈ తరం జంటలకు ప్రేమ పాఠాలు నేర్పుతున్నారీ క్యూట్‌ కపుల్‌.

Updated : 01 Dec 2021 19:11 IST

(Photo: Instagram)

‘ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉన్నట్లు’ తన విజయం వెనుక తన భార్య వినీత ఉందంటున్నాడు కొత్తగా ట్విట్టర్‌ పగ్గాలు చేపట్టిన పరాగ్‌ అగర్వాల్‌. అంతేకాదు.. దంపతులంటే ప్రతి విషయంలోనూ ఒకరికొకరు సపోర్ట్‌ చేసుకోవాలంటూ ఈ తరం జంటలకు ప్రేమ పాఠాలు నేర్పుతున్నారీ క్యూట్‌ కపుల్‌. వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచుతూనే.. తమ అనుబంధంలోని మధుర ఘట్టాల్ని అందరితో పంచుకోవడానికి ఏమాత్రం వెనకాడదీ ఎన్నారై జంట. పరాగ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే ఫొటోలు, వీడియోలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కెరీర్‌లో ఎంత ఎదిగినా అభిరుచులకు, అనుబంధాలకు తగిన సమయం కేటాయించాలని చెప్పకనే చెబుతోన్న ఈ మేడ్ ఫర్‌ ఈచ్‌ అదర్‌ ప్రేమ ముచ్చట్లేంటో తెలుసుకుందాం రండి..

కెరీర్‌లో ఉన్నత స్థానాల్లో ఉన్న వారు వృత్తినే జీవితంగా, దైవంగా భావిస్తారు. దీంతో ఏకీభవించినా.. కుటుంబానికి, తన ఆసక్తులకూ సమప్రాధాన్యమిస్తానంటున్నాడు పరాగ్‌ అగర్వాల్‌. అందుకే తన ఇన్‌స్టా బయోలో అటు వృత్తితో పాటు ఇటు తన అభిరుచులైన ట్రావెలింగ్‌-ఆహారం-టెన్నిస్‌-స్కీయింగ్‌నీ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మొన్నటిదాకా ట్విట్టర్‌ సంస్థలో సీటీఓ (ఛీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌)గా తెర వెనుకే ఉన్న ఆయన.. తాజాగా ట్విట్టర్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టి ఒక్కసారిగా తెరమీదకొచ్చారు. దీంతో ఆయన వృత్తి జీవితం గురించే కాదు.. వ్యక్తిగత జీవితం గురించీ ఇంటర్నెట్‌లో తెగ శోధించేస్తున్నారు చాలామంది.

జీవితకాల ‘ప్రయాణం’!

భారత్‌లో పుట్టి పెరిగిన పరాగ్‌.. ఐఐటీ బాంబేలో చదువు పూర్తి చేసుకొని అమెరికా వెళ్లిపోయారు. అక్కడి స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. ఈ క్రమంలోనే అదే విశ్వవిద్యాలయంలో చదువుతున్న వినీత అతనికి పరిచయమైంది. ముఖ్యంగా ఇద్దరికీ ప్రయాణాలంటే పిచ్చి. దీంతో వీలు చిక్కినప్పుడల్లా కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లేవారు. ఈ అలవాటే క్రమంగా ఇద్దరి మధ్య దూరాన్ని కరిగించింది. ప్రేమతో వాళ్లను దగ్గర చేసింది. ఇక జీవితాంతం కలిసి బతకాలని నిర్ణయించుకున్న ఈ జంట.. 2015లో నిశ్చితార్థం చేసుకుంది. ఆ మరుసటి ఏడాదే పెళ్లిపీటలెక్కింది. ఇక మొదటి వివాహ వార్షికోత్సవాన్నీ పచ్చటి ప్రకృతి మధ్య ఎంతో అందమైన ప్రదేశంలో జరుపుకొన్న ఈ క్యూట్‌ కపుల్‌.. ఆ ఫొటోల్నీ సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయారు. వీళ్ల ప్రేమ బంధానికి గుర్తుగా 2018లో అన్ష్‌ పుట్టాడు.

ఒకరికొకరు తోడుగా..!

ముంబయిలో పుట్టి పెరిగిన వినీత.. పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి శాన్‌ఫ్రాన్సిస్కోలో స్థిరపడ్డారు. ప్రస్తుతం అక్కడి ‘స్టాన్‌ఫోర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో క్లినికల్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు.. Andreessen Horowitz (a16z) అనే వెంచర్‌ క్యాపిటల్‌ కంపెనీకి భాగస్వామిగానూ వ్యవహరిస్తున్నారు. ఇలా ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నా.. కుటుంబానికి, తమ బాబుతో కలిసి గడపడానికి తగిన సమయం కేటాయిస్తుంటారీ క్యూట్‌ కపుల్‌. ఈ క్రమంలోనే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ జీవితంలోని ప్రత్యేక ఘట్టాల్ని ఫొటోల రూపంలో పంచుకుంటూ మురిసిపోతుంటారు. అంతేకాదు.. ప్రతి విషయంలోనూ ఒకరికొకరు తోడుగా ఉంటామంటూ, తద్వారా వరించిన విజయాన్ని కలిసే సెలబ్రేట్‌ చేసుకుంటామంటూ తమ ఫొటోలతోనే చెప్పకనే చెబుతుందీ అందాల జంట. అందుకేనేమో నెటిజన్లు కూడా వీళ్లను ‘క్యూట్‌ కపుల్‌’, ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అంటూ సంభోదిస్తున్నారు.

ప్రేమ పంచుకోవడం, అభిరుచుల్ని గౌరవించుకోవడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం.. ఇలా అన్యోన్య దాంపత్యానికి సోపానాలైన ఎన్నో విషయాలను ఈ జంట నుంచి మనం నేర్చుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్