Published : 04/08/2021 19:11 IST

అవును.. మేం భార్యా విధేయులమే!

నాలుగ్గోడల మధ్య ఎలా ఉన్నా.. నలుగురిలోకి వెళ్లినప్పుడు మాత్రం భార్యలకు ఏదైనా అవసరమైతే సహాయం చేయడానికి, సపర్యలు చేయడానికి కొంతమంది భర్తలు మొహమాటపడుతుంటారు. మరి, నలుగురి మధ్యలో ఉన్నప్పుడు కూడా తమ భార్యలతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ, ఎలాంటి మొహమాటం లేకుండా అన్ని పనుల్లోనూ వారికి సాయపడుతూ భార్యాభర్తలిద్దరూ సమానమేనని చాటే భర్తలూ లేకపోలేదు. ఆ లిస్టులో తన భర్త రితేశ్ కూడా ఉన్నాడంటోంది బాలీవుడ్ బ్యూటీ జెనీలియా.

రితేశ్ ఒక్కడే కాదు.. మరికొందరు సెలబ్రిటీ హబ్బీస్ కూడా పలు సందర్భాల్లో తమ భార్యలకు సపర్యలు చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. మరి, తాము భార్యా విధేయులమంటూ చాటిన ఆ క్యూటెస్ట్ కపుల్ లవ్లీ మూమెంట్స్‌పై మనమూ ఓ లుక్కేద్దాం రండి.

ఇటీవలే ఓ డ్యాన్స్‌ రియాలిటీ షోలో పాల్గొన్న ఈ ముద్దుల జంట తమ పెళ్లి నాటి తీపి గుర్తులను పంచుకుంది. ఈ సందర్భంగా జెనీలియా... ‘మా పెళ్లి రోజు రితేశ్ 8 సార్లు నా కాళ్లు పట్టుకున్నాడని చెప్పగా.. ‘పెళ్లి తర్వాత చేయాల్సింది పెళ్లి రోజే ప్రాక్టీస్‌ చేశాను’ అంటూ నవ్వులు పూయించాడు రితేశ్‌. తద్వారా భార్య కాళ్లు పట్టుకోవడానికి తాను ఏ మాత్రం సిగ్గుపడలేదని చెప్పకనే చెప్పాడీ హ్యాండ్‌సమ్‌ హబ్బీ.

పెళ్లి రోజే కాళ్లు పట్టించారు!

ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్‌ సెలబ్రిటీ జంటల్లో జెనీలియా-రితేశ్‌ జోడీ ఒకటి. తమ మొదటి సినిమా ‘తుఝే మేరీ కసమ్‌’ తో పరిచయమై, ఆ స్నేహబంధాన్ని ప్రేమగా మార్చుకుని 2012లో పెళ్లిపీటలెక్కారీ లవ్లీ కపుల్‌. సందర్భమొచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరు తమ ప్రేమను ఒలకపోసుకునే వీరు బుల్లితెరలో ప్రసారమయ్యే ఓ డ్యాన్స్‌ రియాల్టీ షోకు న్యాయనిర్ణేతలుగా హాజరయ్యారు.

‘షాదీ స్పెషల్‌ థీమ్‌’ తో నిర్వహించిన ఈ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల ప్రదర్శన చూసిన జెనీలియా ‘ఇదంతా చూస్తుంటే నాకు మా పెళ్లి రోజు గుర్తుకు వచ్చింది. ఆ రోజు రితేశ్ 8 సార్లు నా కాళ్లు పట్టుకున్నాడు’ అని నవ్వుతూ చెప్పింది. దీనికి ప్రతిస్పందనగా రితేశ్‌ .. ‘పెళ్లి తర్వాత ఏం చేయాలన్నది అక్కడి పురోహితులకు ముందే తెలిసి ఉంటుంది. అందుకే పెళ్లి రోజే వారు నాతో ప్రాక్టీస్‌ చేయించారు’ అని అనగానే అక్కడ ఉన్నవారందరూ నవ్వుల్లో మునిగిపోయారు. అయితే మహారాష్ట్ర వివాహ సంప్రదాయ ప్రకారం పెళ్లిలో వధువు కాళ్లకు వరుడు నమస్కరించడం ఆనవాయితీ. అందులో భాగంగానే రితేశ్‌ జెనీలియా కాళ్లు పట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

నీకెందుకు.. నేను కడతానుగా..!

బాలీవుడ్‌లో క్యూటెస్ట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు సోనమ్ కపూర్ - ఆనంద్ అహూజా దంపతులు. మూడేళ్ల క్రితం వివాహ బంధంలోకి అడుగిడిన ఈ జంట.. తమ వైవాహిక జీవితాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తోంది. ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ, సందర్భం వచ్చినప్పుడల్లా భార్యాభర్తలిద్దరూ సమానమేనని చాటుతోన్న ఈ లవ్లీ పెయిర్.. ఒకసారి దిల్లీలోని ఓ షూ స్టోర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఇద్దరూ మోడ్రన్ దుస్తుల్లో స్త్టెలిష్‌గా, మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా మెరిసిపోయారు. అంతేకాదు.. అక్కడ ఇద్దరూ ఒకే రకమైన షూస్ ధరించడంతో పాటు.. భర్త ఆనంద్ అందరి ముందూ మోకాలిపై కూర్చొని.. సోనమ్ షూ లేస్ కడుతూ కెమెరా కంటికి చిక్కాడు.

నేనుండగా అవి కింద పెట్టనివ్వను!

పెళ్లికి ముందు తమ బంధం గురించి ఎంత రహస్యంగా ఉంచారో, పెళ్లయ్యాక సందర్భం వచ్చినప్పుడల్లా అందరి ముందు తమ ప్రేమను అంతలా బయటపెట్టుకుంటున్నారు బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కపుల్ దీపికా పదుకొణె - రణ్‌వీర్ సింగ్ దంపతులు. పెళ్లయ్యాక దీపిక ప్రాధాన్యాలకే ప్రాముఖ్యమిస్తానంటూ, తాను ఎక్కడ కంఫర్టబుల్‌గా ఉంటుందో అదే నాకు భూలోక స్వర్గమంటూ.. ఇలా తాను భార్యా విధేయుడినని చెప్పుకోవడానికి ఏమాత్రం వెనకాడనంటూ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు రణ్‌వీర్.
ఈ క్రమంలో ఓసారి ముంబయిలో ఓ పెళ్లికి హాజరైంది దీప్‌వీర్ జంట. అయితే హై-హీల్స్ వేసుకొన్న దీప్స్.. పెళ్లి మండపం దగ్గరకు వెళ్లే క్రమంలో ఆ హీల్స్‌తో అసౌకర్యంగా ఫీలైంది. దీంతో ఆమె వాటిని విప్పేయడంతో.. ఆ హీల్స్‌ని పక్కన పెట్టకుండా వాటిని తను మోస్తూ దీప్స్ వెంట నడిచాడు రణ్‌వీర్. ఇలా తాను భార్యా విధేయుడినంటూ మరోసారి చాటుకున్నాడీ రొమాంటిక్ హబ్బీ. ఇలా ఈ కపుల్‌కు సంబంధించిన ఈ లవ్లీ మొమెంట్.. అటు ఫొటోలు, ఇటు వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన భార్యకు సపర్యలు చేస్తూ కనిపించిన రణ్‌వీర్‌ను చూసిన అమ్మాయిలంతా.. దీపిక అదృష్టాన్ని చూసి ఈర్ష్య పడిపోవడమే కాకుండా.. ‘తమకూ ఇలాంటి హజ్బెండ్ దొరికితే ఎంత బాగుంటుందో’ అంటూ వూహల్లోకి వెళ్లిపోయారు.

పైట కొంగు సవరిస్తూ!

ఇక తమ పెళ్లిలోనే ఇలాంటి ఓ క్యూటెస్ట్ మొమెంట్‌తో తాను భార్యా విధేయుడినని నిరూపించుకున్నాడు రణ్‌వీర్‌. 2018 నవంబర్‌లో ఇటలీలో డ్రీమ్ వెడ్డింగ్‌తో ఒక్కటైన ఈ జంట.. ఆ తర్వాత బెంగళూరులో ఓ రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తన భార్య నుంచి చూపు తిప్పుకోలేకపోయిన ఈ గల్లీబాయ్.. వేదికపై దీపిక చీర కొంగును మోస్తూ, దాన్ని సవరిస్తూ కెమెరా కంటికి చిక్కాడు.

నువ్వే కొన్నావ్‌గా.. నువ్వే వెయ్యి!

క్రికెట్‌లో కూల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్‌ ధోనీ.. సందర్భం వచ్చినప్పుడల్లా భార్యపై ఉన్న అనురాగాన్ని బయటపెట్టుకుంటూనే ఉంటాడు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం సాక్షి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్త షూస్ వేసుకుంటోన్న తనకు.. తన భర్త మహీ సహాయం చేస్తోన్నప్పుడు క్లిక్‌మనిపించిన ఓ అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన సాక్షి.. ‘నువ్వు కొన్న ఈ చెప్పులను నువ్వే వెయ్యి..’ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. దీంతో క్షణాల్లో ఈ ఫొటో వైరల్‌గా మారింది.

పోనీటెయిల్ హెల్పింగ్!

2018లో పెళ్లి చేసుకున్న రాయల్ కపుల్ ప్రిన్స్ హ్యారీ - మేఘన్ మార్కల్‌లు కూడా నిత్యం ఒకరిపై మరొకరు ప్రేమను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తుంటారు. మేఘన్ మొదటిసారి గర్భం ధరించిన తర్వాత ఆస్ట్రేలియా, ఫిజీ.. వంటి దేశాల్లో పర్యటించిన ఈ అందాల జంట.. ఆ తర్వాత తమ రాయల్ టూర్‌లో భాగంగా మొరాకోలో కూడా కొన్నాళ్లు గడిపింది. ఈ క్రమంలోనే మొరాకో రాజధాని రబాట్‌లోని ఆండాలూసియన్ గార్డెన్స్‌లో చేతివృత్తి కళాకారుల్ని కలిసి.. వారు రూపొందించిన అందమైన ఉత్పత్తుల్ని తిలకించిందీ జంట. అందులో మేఘన్‌కు ఒక నెక్లెస్ నచ్చడంతో వారు దాన్ని ఆమెకు గిఫ్ట్‌గా అందించారు. అయితే దాన్ని తలపై నుంచి వేసుకునే క్రమంలో అది ఆమె పోనీటెయిల్‌కి పట్టుకోగా, ఆ పక్కనే ఉన్న ఆమె భర్త ప్రిన్స్ హ్యారీ పోనీటెయిల్‌ని పైకి లేపి.. ఆమె ఆ నెక్లెస్ వేసుకోవడానికి సహకరించాడు. ఇలా వారిని అనుక్షణం ఫాలో అవుతున్న ఫొటోగ్రాఫర్లు ఈ స్వీటెస్ట్ మొమెంట్‌ని క్లిక్‌మనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.

ఏంటీ.. ఈ సెలబ్రిటీల స్వీట్ మొమెంట్స్ గురించి చదువుతుంటే మీకూ మీ జీవితంలో జరిగిన ఇలాంటి తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా? నలుగురిలో ఉన్నామని తడుముకోకుండా మీవారు మీ చీర కొంగు సవరించిన మధురమైన జ్ఞాపకాలు, అందరిలో మిమ్మల్ని పొగుడుతూ మీపై ప్రేమ చూపిన క్షణాలు ఒకదాని తర్వాత మరొకటి గుర్తుకొచ్చేస్తున్నాయా? అయితే ఆలస్యమెందుకు.. వాటిని వసుంధర.నెట్ వేదికగా పంచుకోండి.. భార్యాభర్తల మధ్య ఇలాంటి తీపి జ్ఞాపకాలుంటేనే ఆ బంధం మరింత బలపడుతుందని మీ అనుబంధం ద్వారా అందరికీ చాటిచెప్పండి..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని