ఇల్లు మారడం తేలికే!

నగరాల్లో ఇల్లు మారాల్సిన అవసరం ఎప్పుడైనా రావొచ్చు. అలాంటప్పుడు సామాన్లను ప్యాక్‌  చేయడంలో సులువు తెలియాలి. లేకపోతే ఇబ్బందులు రావొచ్చు. అలా కాకుండా ఉండాలంటే ఇల్లు

Updated : 03 Nov 2021 06:03 IST

నగరాల్లో ఇల్లు మారాల్సిన అవసరం ఎప్పుడైనా రావొచ్చు. అలాంటప్పుడు సామాన్లను ప్యాక్‌  చేయడంలో సులువు తెలియాలి. లేకపోతే ఇబ్బందులు రావొచ్చు. అలా కాకుండా ఉండాలంటే ఇల్లు మారేటప్పుడే ప్రణాళికాబద్ధంగా ప్యాక్‌ చేస్తే చాలు. సంతోషంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టొచ్చు.

* ముందుగానే... ఇల్లు మారాల్సినప్పుడు ముందుగానే ఓ ప్రణాళిక వేసుకోవాలి. సామాన్లను ప్యాక్‌ చేసేవి, విడిగా తరలించేవి అంటూ వేరుచేసి పెట్టుకోవాలి. అలాగే ప్యాక్‌ చేయాల్సిన సామాన్లకు సరిపోయే అట్టపెట్టెలను సిద్ధం చేసుకోవాలి. దీంతోపాటు తగిన సమయాన్ని కేటాయించుకోవాలి. లేదా సమయం ఉన్నప్పుడల్లా కొంచెంకొంచెంగా పని పూర్తి చేస్తుండాలి. మంచం, డైనింగ్‌, డ్రెస్సింగ్‌ టేబుల్స్‌, ఫ్యాన్లు వంటివాటిని ముందుగానే పార్ట్స్‌గా విడదీసి ప్యాక్‌ చేసుకోవాలి. చివర్లో వీటిని పూర్తిచేయలేక ఇబ్బందులెదురవుతాయి. దుస్తులను అట్టపెట్టెల్లో సర్ది, ఎందులో వేటిని ఉంచామో వివరాలను ఆ పెట్టెపై స్కెచ్‌పెన్‌తో రాసి ఉంచాలి. పట్టు, విలువైన వస్త్రాలకు మాత్రం సూట్‌కేసులను కేటాయించుకోవాలి. తర్వాత కొత్తింటికి వెళ్లినప్పుడు సామాన్లన్నింటినీ ఒకేసారి తీయాల్సిన అవసరం లేకుండా అవసరమైనవాటిని మాత్రం అట్టపెట్టెలపై రాసిన పేర్లను చూసి తీసుకోవచ్చు. 

* గదిగదికీ... ప్రతి గదిలో సామాన్లను విడివిడిగా ప్యాక్‌ చేస్తే, తిరిగి కొత్తచోటకు వెళ్లినప్పుడు ఆయా సామాన్ల పెట్టెలను ఆ గదుల్లోనే ఉంచి నెమ్మదిగా సర్దుకోవచ్చు. అలాగే పిల్లల పుస్తకాలు, వారి సామాన్లను ప్రత్యేకంగా సర్ది ఆ వివరాలను పట్టికగా ఆ అట్టపెట్టెలపై రాస్తే చాలు. కొత్త ఇంటికి వెళ్లిన తర్వాత చిన్నారులే తమ సామాన్లను గుర్తించి తీసి సర్దుకోగలుగుతారు. ఇల్లు ఖాళీ చేసేటప్పుడే వినియోగించని దుస్తులు, వస్తువులను విడిగా తీయాలి. వాటిని పేదలకు అందిస్తే వారికి ఉపయోగపడతాయి. ఇల్లు మారేటప్పుడు బరువూ తగ్గుతుంది. ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషిన్‌ వంటివాటిని ప్యాక్‌ చేసేటప్పుడు చాలా జాగ్రత్తవహించాలి. లేదంటే రవాణాలో దెబ్బతిని, పనిచేయకుండా మొరాయిస్తాయి.     

* వంటిల్లు ప్రత్యేకం... ఇల్లు మారేముందు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది. కొత్తింటికి వెళ్లిన తర్వాత తీసుకుంటే రవాణాలో బరువు తగ్గుతుంది. వస్తువులు పాడవకుండా ఉంటాయి. వంటింటి సామాన్లు, పింగాణీ, గాజు పాత్రలు, కప్పులు వంటివాటిని ప్యాకింగ్‌ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలి. ఆఫీస్‌కు సంబంధించిన ఫైల్స్‌, పుస్తకాలతోపాటు ఇంట్లో విలువైన వాటిని ప్రయాణంలో దగ్గర ఉంచుకోవడం మంచిది. ప్యాక్‌ చేసిన, చేయని సామాన్లంటినీ చివర్లో లెక్కించి, వాటి వివరాలను రాసి ఉంచుకోవాలి. కొత్తింటికి వెళ్లినప్పుడు పరిశీలించుకుంటే చాలు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పని పూర్తిచేయగలిగితే సంతోషంగా కొత్తప్రాంతానికి చేరుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్