Updated : 02/10/2021 04:20 IST

అందాన్ని పెంచే ఐస్‌క్యూబ్స్‌

నిద్రలేచిన వెంటనే ముఖాన్ని ఐస్‌క్యూబ్‌తో చేసే మృదువైన మర్దన రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే మేకప్‌ వేసుకునే ముందు దీంతో చేసే మసాజ్‌ ఎక్కువ సమయం తాజాగా ఉండేలా చేస్తుంది. ఐస్‌క్యూబ్‌కు మరిన్ని సహజసిద్ధ పదార్థాలను కలిపి ఫ్రీజ్‌ చేేస్తే ముఖారవిందానికి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందుతాయి. వీటిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం...

* తులసి ఆకులతో...

గుప్పెడు తులసి ఆకులకు కప్పు నీటిని కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో రెండు చెంచాల కలబంద గుజ్జు వేసి బాగా కలిపి ఐస్‌ ట్రేలో నింపి ఫ్రీజ్‌ చేసుకోవాలి. ఈ ఐస్‌క్యూబ్‌తో చేసే మర్దనా యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి ముఖంపై మచ్చలను తొలగిస్తుంది.

* కాఫీపొడితో... మరుగుతున్న కప్పు నీళ్లలో రెండు చెంచాల కాఫీ పొడిని వేసి బాగా మరగనిచ్చి దింపేయాలి. చల్లార్చి ఐస్‌ ట్రేలో నింపి ఫ్రీజ్‌ చేస్తే కాఫీ క్యూబ్స్‌ సిద్ధం. ఇవి ముఖాన్ని మెరిసేలా చేస్తాయి.

* పాలతో

ముప్పావుకప్పు కాచిన పాలల్లో పావు కప్పు నీటిని కలిపి ఐస్‌ ట్రేలో నింపాలి. ఫ్రీజ్‌ అయిన ఈ క్యూబ్స్‌తో మర్దనా చేస్తే మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుంది. వెడల్పైన సీసాలో శుభ్రం చేసిన అరకప్పు బియ్యం వేసి రెండు కప్పుల నీటిని నింపాలి. దీన్ని నాలుగు గంటలు నాననివ్వాలి. తర్వాత వడకట్టిన ఆ నీటిని ఐస్‌క్యూబ్‌ ట్రేలో నింపి ఫ్రీజ్‌ చేయాలి. వీటితో రోజూ ఉదయాన్నే ముఖాన్ని మృదువుగా మసాజ్‌ చేసుకుంటే ముఖచర్మం ఆరోగ్యంగా మారుతుంది.

* రోజ్‌వాటర్‌తో

కప్పు నీటిలో కప్పు గులాబీ నీటిని కలిపి ఫ్రీజ్‌ చేస్తే చాలు. ఈ క్యూబ్స్‌తో మర్దనా చేస్తే ముఖం కాంతిమంతంగా మారుతుంది. అలాగే రెండు గ్రీన్‌టీ బ్యాగులను మరిగే కప్పు నీటిలో వేయాలి. చల్లారిన తర్వాత క్యూబ్స్‌గా చేసుకోవాలి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ ముఖంపై వృద్ధాప్య ఛాయలను, మొటిమలను, కంటిచుట్టూ నల్లని వలయాలను దూరం చేస్తాయి.

* దాల్చిన చెక్కతో

కప్పునీటిలో చెంచా మెత్తగా చేసి ఉంచుకున్న దాల్చిన చెక్క పొడిని కలిపి ఐస్‌ క్యూబ్స్‌లా చేసుకోవాలి. దీంతో ముఖంపై మసాజ్‌ చేసి గంట తర్వాత శుభ్రపరుచుకుంటే చాలు. చర్మం ఆరోగ్యంగా మారుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని