Updated : 01/01/2022 05:36 IST

ఓ మహిళా.. కాస్త చూడిలా..

నేటి ఆధునిక మహిళకు నిత్యం ఇంటి పని, వంటపనితో పాటు బయట ఆఫీసు పనితో హైరానా. ఇంటా బయటా నెగ్గుకురావాలంటే పనితోపాటు ఆరోగ్యంపైనా అంతే శ్రద్ధ పెట్టాలి.. పిల్లల విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కొద్దిపాటి జాగ్రత్తలు, చిన్నచిన్న చిట్కాలతో ఎన్నో సమస్యలను నివారించవచ్చు. కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ.. మహిళలు, వారి పిల్లల ఆరోగ్య సంరక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చూద్దాం... .

0-12 ఏళ్లు

ఈ వయసు బాలికల్లో ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, బీ 12 లోపం వల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని అధిగమించడం చాలా సులభం. ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, కాయగూరల్లో ఐరన్‌ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. పిల్లలకు వాటిని ఎక్కువగా ఇస్తే సరిపోతుంది.

13-20

ఈ వయసులో రక్తహీనత సమస్య ఉంటే ఐరన్‌, కాల్షియం, విటమిన్‌ డి మాత్రలివ్వాలి. పౌష్టికాహారాన్ని అందించాలి. అలాగే ఈ వయసులో స్థూలకాయం సమస్య ఎదురవకుండా జాగ్రత్తపడాలి. ఈ మధ్య కాలంలో పిల్లలు లేచిన దగ్గర్నించి ఆన్‌లైన్‌ తరగతుల్లోనే ఉంటున్నారు. ఎక్కువసేపు మొబైల్‌ ఫోన్లతోనే గడుపుతున్నారు. వ్యాయామం అసలే ఉండడం లేదు. ఆరోగ్యకరమైన ఆహారం గురించి శ్రద్ధపెట్టడంలేదు. చాలామంది ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా లేస్తున్నారు. ఎక్కువమంది ఇళ్లలో ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరు పిల్లలే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు పిల్లలపై అతిగా శ్రద్ధ చూపిస్తుంటారు. మరికొందరు తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తుండడంతో అసలు శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఈ రెండూ మంచివికావు. పిల్లలు సమయానికి నిద్రపోయేలా చూడాలి. సమయానుసారం ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. శారీరక శ్రమను ప్రోత్సహించాలి.

అవగాహన అవసరం

యుక్త వయసులో కొందరు పెళ్లికి ముందే లైంగిక స్వేచ్ఛను కోరుకుంటుంటే.. మరికొందరిలో అసలు లైంగిక విజ్ఞానమే ఉండడంలేదు. ఈ రెండూ ఇబ్బందికరమే. కొందరు అత్యవసర గర్భ నిరోధక మాత్రలను ఎక్కువగా వాడుతుంటారు. ఇది మంచిదికాదు.. దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదముంటుంది. చదువుకున్న వారిలోనూ కొందరికి కుటుంబ నియంత్రణపై అవగాహన ఉండడం లేదు. మరికొందరు కెరీర్‌ కోసమని పిల్లలను కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. 29 ఏళ్ల లోపు పిల్లల కోసం ప్రణాళిక వేసుకోవడం మంచిది. 35 ఏళ్లకు ఫరవాలేదు. ఆ తర్వాత గర్భం దాల్చితే కష్టమవుతుంది.

అప్రమత్తం

12 నెలల పాటు పిరియడ్స్‌ రాకపోతే మెనోపాజ్‌ అని తెలుసుకోవాలి. మన దగ్గర సగటు మెనోపాజ్‌ వయసు 46. ఈ వయసులో ఎక్కువ రక్తస్రావం అవుతుంటే వైద్యులను సంప్రదించాలి. 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఏడాదికోసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. మెనోపాజ్‌ దశలో పురుషులతో పోల్చితే ఆడవారిలో సమస్యలు కొంత ఎక్కువ కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

- డాక్టర్‌ బాలాంబ


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని