పిల్లలున్నారు జాగ్రత్త!

చిన్నారులు తల్లిదండ్రులను అనుక్షణం పరిశీలిస్తూ ఉంటారు. వాళ్లు మిమ్మల్ని అనుకరిస్తారు... అనుసరిస్తారు. మీ మాదిరే ప్రవర్తిసారు. కాబట్టి చిన్నారుల ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. వారి

Published : 16 Aug 2021 01:11 IST

చిన్నారులు తల్లిదండ్రులను అనుక్షణం పరిశీలిస్తూ ఉంటారు. వాళ్లు మిమ్మల్ని అనుకరిస్తారు... అనుసరిస్తారు. మీ మాదిరే ప్రవర్తిసారు. కాబట్టి చిన్నారుల ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. వారి వయసు చిన్నదైనా  పరిశీలన గొప్పదన్న విషయం మరిచిపోవద్దు. పిల్లలు ముందు ఎలా ప్రవర్తించాలి? ఎలా ఉండకూడదు? చూడండి...

తేడాలు చూపొద్దు...

‘మేం పెద్దవాళ్లం.. మీరు చిన్నపిల్లలు... మేం మాట్లాడినట్లు మీరు మాట్లాడొద్దు’ అంటూ హెచ్చరించొద్దు. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే, దానికి వయసుతో సంబంధం ఉండదు.

అసభ్య పదజాలం వద్దు...!

కొందరు అమ్మానాన్నలు గొడవపడుతూ అసభ్యంగా తిట్టుకుంటారు. ఇంకొంత మందికి బూతులు అలవోకగా వస్తాయి. వాటిని పిల్లలు నేర్చుకుంటారు. ఎవరి మీదో ప్రయోగిస్తారు. కాబట్టి ఇలాంటి పదజాలాన్ని వాడకండి. అప్పుడే పిల్లల భాషా సంస్కారయుతంగా ఉంటుంది.

ఒకరినొకరు తక్కువ చేసుకోవద్దు...

కుటుంబం అన్నాక చిన్నవో, పెద్దవో గొడవలు సహజం. అంతమాత్రాన ఒకరిపై ఒకరు అరుచుకోవడం, తిట్టుకోవడం చేయొద్దు. ఇలా చేస్తే చిన్నారుల ముందు తేలికైపోతారు. మీకు గౌరవం ఇవ్వరు. సమస్య ఉంటే ఓ గదిలో కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోవాలే కానీ పోట్లాటకు దిగొద్దు. పెద్దలు పరస్పరం ఆప్యాయంగా ఉండాలి. అప్పుడే చిన్నారులూ కుటుంబ సభ్యుల పట్ల ప్రేమగా ఉంటారు.

తప్పుగా మాట్లాడొద్దు...

ఇంటికి వచ్చి వెళ్లిన అతిథి గురించి తక్కువగా మాట్లాడటమో, వెక్కిరించడమో, తిట్టడమో చేస్తుంటారు కొందరు. ఇదంతా గమనిస్తున్న చిన్నారి తను కూడా అలా ప్రవర్తించాలేమో అని ఆలోచిస్తుంటాడు. కాబట్టి ఇతరుల గురించి తప్పుగా, తక్కువ చేసి మాట్లాడొద్దు.

ప్రమాణాలు వద్దు..

చాలామంది ఏదైనా విషయాన్ని గట్టిగా, కచ్చితంగా చెప్పేందుకు ఒట్లు, ప్రమాణాలు చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. చిన్నారులూ దాన్నే ఉపయోగిస్తారు జాగ్రత్త.

లంచాలొద్దు..

హోమ్‌ వర్క్‌ చేస్తే చాక్లెట్‌ ఇస్తా. త్వరగా తయారైతే పెన్సిల్‌ కొని పెడతా. పాలు తాగితే బయటకు తీసుకువెళతా.... ఇలా ఆశలు చూపుతుంటారు. మొదట్లో బాగానే ఉన్నా.. పిల్లాడు పెద్దవుతున్న కొద్దీ... ఏదైనా లాభం ఉంటే తప్ప ఏదీ చేయననే స్థితికి చేరుకుంటాడు. కాబట్టి వారికి అలాంటి ఎరలేమీ వేయకండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్