పిల్లల్లో.. ఆ రెంటినీ పెంచండి!

పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడాలి, ఉన్నతంగా నిలవాలని కోరుకోని తల్లిదండ్రులెవరు? ఇవి  సాధ్యమవ్వాలంటే వాళ్లను ఆ దిశగా నడిపించాల్సింది మనమే. అందుకు చేయాల్సిందల్లా వాళ్లలో

Published : 19 Sep 2021 18:19 IST

పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడాలి, ఉన్నతంగా నిలవాలని కోరుకోని తల్లిదండ్రులెవరు? ఇవి  సాధ్యమవ్వాలంటే వాళ్లను ఆ దిశగా నడిపించాల్సింది మనమే. అందుకు చేయాల్సిందల్లా వాళ్లలో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపొందించడమే.

అదెలాగంటే..

పొగడండి.. చేసిన ప్రతిదాన్నీ మెచ్చుకోవాల్సిన పనిలేదు. కానీ నిజంగా మంచి పని ఏది చేసినా శెభాష్‌ చెప్పాల్సిందే. ఇచ్చిన పని సక్రమంగా పూర్తి చేయడం, వస్తువులను చక్కగా ఉంచుకోవడం.. ఇలాంటివి చూసినపుడు సంతోషిస్తారు కదా! దాన్నే వ్యక్తపరచండి. ‘అరె.. భలే ఉంచుకున్నావే’ ‘నువ్విలా ఉంచుకుంటే చూడటం నాకెంత ఇష్టమో’ చిన్న మాటలే! కానీ ఇవి ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు.. భవిష్యత్తులో కొనసాగేలానూ చేస్తాయి.

* ‘ఫలానా వాళ్లు చూడు ఎంత బాగా చేస్తున్నారో’, ‘నీకేదీ త్వరగా రాదు’.. కోపంగా అనే మాటలు కావని మనకూ తెలుసు. వాళ్లకు తెలియజెప్పే మార్గంగా ఈ పోలిక చేస్తుంటాం. కానీ ఇవి పిల్లలపై నెగెటివ్‌ ప్రభావాన్ని చూపుతాయంటున్నారు నిపుణులు. కాబట్టి.. ‘ప్రయత్నించావు కానీ.. ఇంకొంచెం టైమ్‌ కేటాయిస్తే బాగుండేది’, ‘నీకంటే వాళ్లు ఎక్కువ కష్టపడ్డారు. ఈసారి నువ్వూ ప్రయత్నించు’.. ఇలా చెప్పి చూడండి. వాళ్ల ప్రయత్నాన్ని గమనించినట్టు భావించడంతోపాటు ఇంకొంచెం శ్రమించడానికి ప్రయత్నిస్తారు. సానుకూల ఆలోచనా విధానమూ అభివృద్ధి చెందుతుంది.

* పిల్లలు లోకంలో అందరి కంటే అమ్మానాన్నల మెప్పును ఎక్కువ ఆస్వాదిస్తారు. కాబట్టి, ఇది చెయ్యి అని ఆజ్ఞలా కాకుండా.. ఫలానా చేస్తే నచ్చుతావు, నేను నీ నుంచి కోరుకునేదిదీ అని స్పష్టంగా చెప్పి చూడండి. వాళ్లు చేయకపోవడానికి కారణాన్ని తెలుసుకోండి. సబబుగా అనిపిస్తే సరే.. లేదంటే సర్దిచెప్పండి. విషయమేదైనా వాళ్లు మీతో చర్చించే అవకాశాన్నివ్వండి. తన అభిప్రాయానికి విలువనిస్తున్నట్టు భావిస్తారు. అంతేకాదు.. వారిలో నిర్ణయం తీసుకునే నైపుణ్యాన్నీ నేర్పినవారవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్