పండంటి కాపురానికి పాటించాలివి...
close
Published : 20/01/2022 00:54 IST

పండంటి కాపురానికి పాటించాలివి...

వివాహబంధంతో ఒకటైన జంట కలకాలం సంతోషంగా కలిసి ఉండాలంటే ఈ కింది సూత్రాలను పాటిస్తే ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. అవేంటంటే...

భార్యాభర్తల్లో ఏ ఒక్కరూ... ఎదుటివారి కన్నా తామే గొప్పవారమని, అధికులమని భావించకూడదు. వైవాహికబంధంలో ఇరువురూ సమానమే. ఇద్దరిలో ఎక్కువతక్కువలుంటే  ఆ బంధం బీటలువారుతుంది. భాగస్వామి తనను తక్కువగా చూస్తున్నారనే ఆలోచనే ఎదుటివారి మనసును కుంగదీస్తుంది. ఇది ఆత్మన్యూనతకు దారితీసేలా చేస్తుంది. క్రమేపీ ఎదుటివారిపై ప్రేమ గాఢత తగ్గడం మొదలవుతుంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, దాన్ని గుర్తించగలిగితే చాలు... అసమానత్వానికి తావుండదు.

అవమానం

మరొకరి ముందు సరదాకైనా భాగస్వామిని అవమానించకూడదు. ఏదైనా సమస్య ఉంటే ఏకాంతంలో చర్చించుకుని పరిష్కరించుకోవాలి. ఎదుటివారి  వద్ద అవహేళన చేస్తే వారి మనసు గాయపడుతుంది.. ఇరువురూ ఒకే మాటపై ఉంటూ...ఒకరినొకరు ప్రత్యేకం అనుకుంటేనే ఆ బంధం గట్టిపడుతుంది. 

పలకరింపుతో...

దాంపత్యంలో ఒకరిపై మరొకరికి శ్రద్ధ, ప్రేమ ఉండాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే నవ్వుతూ పలకరించడం, ప్రేమగా దగ్గరకు తీసుకోవడంవంటివి ఇరువురి మధ్య స్నేహాన్ని పెంచుతాయి. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న నేపథ్యంలో తిరిగి ఇంటికి చేరుకునేవరకు పలకరించుకోకుండా ఉండకూడదు. మధ్యలో కుశల ప్రశ్నలుండాలి. సాయంత్రం ఒకరికొకరు ఎదురుపడినప్పుడు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించుకోవాలి. ఆ రోజు విశేషాలను ఇరువురూ పంచుకోవాలి. సరదాగా జరిగే సంభాషణ ఇరువురికీ మానసిక ఉల్లాసాన్ని అందిస్తుంది.  

సమయానికి

ఇరువురూ కలిసి గడిపే సమయానికి ప్రాముఖ్యతనివ్వాలి. సెలవు రోజుల్లోనే కాదు... మిగతారోజుల్లోనూ పని ఒత్తిడెంత ఉన్నాకూడా కాసేపైనా ఇద్దరూ కబుర్లు చెప్పుకోవాలి. ఆ సంభాషణలో సానుకూలత నిండి ఉండాలి. సమయం దొరికినప్పుడు సరదాగా బయటకు వెళ్లి స్నేహితులను కలిసి రావాలి. ఇద్దరి అభిరుచులు, ఆసక్తి వంటివి ఒకరినొకరు అడిగి తెలుసుకోవాలి. ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ఇవెంతో ఉపయోగపడతాయి. ఎదుటివారిని అపార్థం చేసుకోవడం, లేదా నిరుత్సాహపరచడం వంటివి ఇరువురి మధ్య దూరాన్ని పెంచుతాయి. అలాకాకుండా అవతలివారికి గౌరవం ఇస్తూ ప్రేమించగలిగితే చాలు. ఆ బంధం కలకాలం నిలబడుతుంది.


Advertisement

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి