Published : 24/01/2022 00:24 IST

చదువే కాదు ఆటలూ ముఖ్యమే!

పిల్లల పెంపకం ఇల్లాలికి సవాలే. అనుక్షణం కనిపెట్టుకుని ఉంటూ ఎన్నెన్నో నేర్పించాలి. అప్పుడే వాళ్ల వ్యక్తిత్వం వికసిస్తుంది. ఇంటా బయటా మన్ననలందుకుంటారు. అందుకేం చేయాలంటే...

చిన్నారులు ప్రతిదానికీ మీ మీద ఆధారపడకుండా తమంతట తాము పనులు చేసుకునేలా అలవాటు చేయండి. ఏది మంచి, ఏది చెడు అనేది వివరించండి. ఏం చేయాలనేది మాత్రం వారికే వదిలేయండి. ఇలా చేస్తే స్వయంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అలవడుతుంది. మంచి చెడు ఏది జరిగినా తమదే బాధ్యత అని గ్రహిస్తారు. ఒకటి రెండుసార్లు ఫలితం సరిగా లేకున్నా జాగ్రత్తగా మెలగాలన్న పాఠం నేర్చుకుంటారు.

* ప్రణాళిక అవసరం: దేనికయినా నిర్దుష్ట ప్రణాళిక అవసరమని వివరించండి. అప్పుడు తినడం, హోంవర్క్‌ చేయడం, చదువుకోవడం, ఆటలు, దుస్తులు సిద్ధం చేసుకోవడం, పడుకోవటం లాంటివన్నీ సమయం ప్రకారం చేసేస్తారు.

* ఆటలూ అవసరమే: ఎప్పుడూ చదువే కాదు, ఆటపాటలూ, కళలూ ముఖ్యమే. కబడ్డీ, క్రికెట్‌, చదరంగం, బ్యాస్కెట్‌ బాల్‌..సంగీతం, సాహిత్యం.. ఇలా మీ చిన్నారికి ఎందులో ఆసక్తి ఉందో గమనించండి. ఆటలు కడుపు నింపవు లాంటి వ్యాఖ్యలకు స్వస్తి చెప్పండి. అవి మాటలకందని ఆనందాన్నిస్తాయని గుర్తించండి. మరీ ఇష్టమైతే కళలు, క్రీడల దిశగా ప్రోత్సహించండి.

* పనులు చేయించండి: పెంపుడు జంతువుకు తిండి పెట్టడం, తమ గది శుభ్రం చేసుకోవడం, పుస్తకాల ర్యాక్‌ సర్దడం లాంటి పనులు వారితోనే చేయించండి. పనుల్లో మెలకువలు తెలుస్తాయి, ఏ పని అయినా చేయగలమనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

* ఆశావాదం: చిన్నతనం నుంచీ ఆశావాదాన్ని నేర్పండి. ఎలాంటి పరిణామాల్లోనూ నిరాశకు లోనవ్వద్దని, ఆశను కోల్పోవద్దని మహనీయుల జీవితాలను ఉదహరిస్తూ చెప్పండి.

* ఎవరితోనూ పోల్చద్దు: అందరి తెలివీ సామర్థ్యాలూ ఒకలా ఉండవు. కనుక తోటి పిల్లలతో పోల్చి తక్కువ చేయొద్దు. ముందుగా మీ చిన్నారి సామర్థ్యాలేంటో గుర్తించి మెచ్చుకోండి. ఈ ప్రశంసలు వెనకబడిన అంశాల గురించి భయపడకుండా, కుంగిపోకుండా స్థైర్యాన్నిస్తాయి. అప్పుడు వాటిల్లో తర్ఫీద్విడం సులువవుతుంది.


Advertisement

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి