Updated : 28/02/2022 11:41 IST

తీరు మారితే.. మీరూ మారాలి

ఏ బంధంలోనైనా.. అలకలు, కోపాలు సాధారణమే. ఆలుమగల బంధమూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఇది కాస్త ప్రత్యేకం. మొదట్లో ఉన్న ఆకర్షణ నెమ్మదిగా అలవాటుగా మారుతుంది. దీంతో చిన్న చిన్న అసంతృప్తులు మొదలవుతాయి. అయితే ఇక్కడ చేసే చిన్నపొరపాటు విడిపోయే వరకూ తీసుకెళుతుంది. కాబట్టి..

* కోపం, అసహనం మనవాళ్లు అన్నవాళ్ల దగ్గరే చూపిస్తాం. బయటివాళ్లు ఏమనుకుంటారో అని అక్కడ నియంత్రించుకుంటాం. కానీ దాన్నంతా భాగస్వామి దగ్గర ప్రదర్శిస్తాం. దాంతో మన మనసు కుదుటపడుతుంది కానీ ఎదుటివ్యక్తిది గాయపడొచ్చు. భావోద్వేగాల్లో మార్పులొస్తున్నాయి, కోపం పెరుగుతోంది అనిపించినప్పుడు ముందుగానే దాన్ని నియంత్రించుకునే మార్గాలపై దృష్టిపెట్టండి. ప్రధానంగా చర్చలకు తావివ్వకండి. కాస్త చల్లగాలికి తిరగడం, ప్రశాంతతనిచ్చే పాట వినడం లాంటివి చేసి ఫర్లేదు అనిపించాకే సంభాషణ మొదలెడితే మంచిది.

* ఇద్దరికీ వేర్వేరు వ్యాపకాలు ఉండొచ్చు. ఒకరివొకరివి నచ్చాలనేం లేదు. అంతమాత్రాన మార్చుకోమని కోరాల్సిన పనిలేదు. సాధారణంగా ఎక్కువ గొడవలు జరిగేదీ ఇక్కడే. వారికంటూ కొంత సమయం కేటాయించుకోవడం వల్ల వచ్చే సమస్యలేముంటాయి? కాస్త మానసిక ప్రశాంతతే కదా! కాబట్టి, వారికి, మీకు అనారోగ్యకరం కానంతవరకూ చేసుకోనివ్వండి. ఇది ఇద్దరికీ ప్రశాంతత, ఒకరిపై మరొకరికి గౌరవాన్నీ ఏర్పరుస్తుంది.

* ఒకరితో మరొకరు గడిపే సమయం తగ్గడమూ ఇద్దరి మధ్యా దూరానికి కారణమవుతుంది. ఇద్దరికీ నచ్చిన పనిని కలిసి చేయడం, పాటల్ని కలిసి వినడం.. వారానికోసారి బయటకు వెళ్లడం, ఆటలాడటం.. చిన్నవే! ఇలా ప్రణాళిక వేసుకోండి. ఆహ్లాదంగా ఎదురు చూస్తారు. బంధమూ బలపడుతుంది. వ్యక్తుల తీరుల్లో మార్పు రావడం సహజం. దానికి తగ్గట్టుగా పరిస్థితులనూ మార్చుకుంటేనే బంధంలో బీటలకు తావుండదు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని