ఎక్కడ తగ్గాలో తెలిస్తే చాలు...

భార్యాభర్తలిద్దరూ ఒకేలా ఉండరు. భిన్న మనస్తత్వాలు, సంప్రదాయాలు, ప్రాంతాలు, అభిరుచులు... అన్నింటిలోనూ తేడా ఉంటుంది. అందుకే అభిప్రాయాలను పంచుకుంటూ.. ఒకే తాటిపై కలిసి అడుగులేద్దాం అనుకుంటే చాలు. సమస్యల్లేకుండా సాగొచ్చు. దంపతులు ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటే బంధం కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.  

Published : 10 Mar 2022 02:31 IST

భార్యాభర్తలిద్దరూ ఒకేలా ఉండరు. భిన్న మనస్తత్వాలు, సంప్రదాయాలు, ప్రాంతాలు, అభిరుచులు... అన్నింటిలోనూ తేడా ఉంటుంది. అందుకే అభిప్రాయాలను పంచుకుంటూ.. ఒకే తాటిపై కలిసి అడుగులేద్దాం అనుకుంటే చాలు. సమస్యల్లేకుండా సాగొచ్చు. దంపతులు ఎక్కడ తగ్గాలో తెలుసుకుంటే బంధం కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

అన్నీ తెలుసు... కొందరు భార్యా భర్తల్లో తమకన్నీ తెలుసు, ఎదుటి వారు పూర్తిగా అజ్ఞానులు అనే భావన ఉంటుంది. తాము చెప్పిందే కరెక్ట్‌ అని వాదిస్తారు. ఇది సరి కాదు. ఏ ఒక్కరూ నూటికి నూరు శాతం నిష్ణాతులు కాదు. తామే అన్నింటిలో పండితులమని భావించకూడదు. అది అవతలి వారిపై చులకన భావాన్ని తెలియజేస్తుంది. ఒకరికి కొన్ని విషయాల్లో అవగాహన ఎక్కువ ఉండొచ్చు. రెండో వారికి తక్కువగా ఉండొచ్చు. ఆ కారణంగా ఎదుటి వారిని అవమానించకూడదు. ఎందుకంటే వీరికీ మరికొన్నింటిలో ఎక్కువ జ్ఞానం ఉంటుంది. దంపతులిద్దరూ తమకున్న ఆలోచనా పరిజ్ఞానాన్ని పంచుకుంటూ ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తే  భేదాభిప్రాయాలకు ఆస్కారం ఉండదు.

వాదనలొద్దు... ఏదైనా విషయం చర్చకు వచ్చినప్పుడు వాదించుకోకూడదు. ఆ అంశం కుటుంబానికి చెందిందా లేక బయటి వ్యక్తులదా అనేది ముందుగా విడదీయాలి. వేరేవాళ్ల గురించి అయితే వాదనకు చోటివ్వకూడదు. ఇంటి విషయమైతే ఇరువురూ ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. అలాకాకుండా దంపతుల్లో ఏ ఒక్కరైనా అధిక ప్రస్తావన తెస్తుంటే దాన్ని ఖండించలేనప్పుడు ఇవతలివారు కొంతసేపు తగ్గి ఉండగలగాలి. ఇలా చేసినంత మాత్రాన తక్కువ అవుతామని అనుకోకూడదు. అప్పుడే చర్చ ఆగిపోతుంది. అనవసరపు సంభాషణలు, భావోద్వేగాలకు చోటుండదు. తర్వాత మెల్లగా మాట్లాడుకుంటే చాలు...పరిష్కారమవుతుంది.

విమర్శించొద్దు.. సంసారంలో ఎదురయ్యే ఒడుదొడుకులు, ఆర్థిక, ఆరోగ్యసమస్యలను దాటడానికి ఇరువురూ కలిసి ప్రయత్నించాలి. అలాకాకుండా ఒకరినొకరు పాత సంఘటనలను తిరగదోడి విమర్శలకు దిగడం లేదా ఆ సమస్య  ఎదుటి వారివల్లే వచ్చిందని ఆరోపించడం వంటివి చేస్తే ఆ బంధం మరింత బలహీనపడుతుంది. కాబట్టి పరిష్కారం కోసం దంపతులిద్దరూ ఆలోచించాలి. అప్పుడే సమస్యలను దాటగలుగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని