Published : 13/03/2022 01:44 IST

సమదృష్టితో చూడాలి..

మా అల్లుడెంత మంచివాడో అమ్మాయి గీసిన గీత దాటడు అని చెప్పే ఆ తల్లి, తన కొడుకును మాత్రం కోడలి మాటను జవదాటడం లేదంటూ విమర్శిస్తుంది. ఈ తరహా ఆలోచనే ఇంట్లో ఎన్నో సమస్యలను తెచ్చిపెడతాయంటున్నారు మానసిక నిపుణులు. కూతురు, కోడలు అని తేడా లేకుండా సమదృష్టితో చూడగలిగే వాతావరణం ఉన్న ఇల్లు నందనవనమని, దీనికంటూ ఓ ప్రవర్తనావళిని పాటించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

మానవ సంబంధాలు.. చిన్నప్పటి నుంచి కొడుకు కోసం ఎన్నో త్యాగాలు చేసి ప్రేమగా పెంచి పెద్దచేసిన తల్లికి తీరా వివాహమైన తర్వాత భార్య మాట వింటున్నాడనే బాధ, కోపం ఆ తల్లికి ఉండటం సహజమే. అప్పటివరకు తనతోపాటు ఉండే కొడుకు ప్రస్తుతం ఎక్కువ సమయాన్ని తనకు కేటాయించడం లేదనే బాధ క్రమేపీ అసూయకు దారితీస్తుంది. అది కోడలిపై కోపాన్ని పెంచే ప్రమాదం ఉంది. అయితే దీన్ని అధిగమించగలిగితేనే ఆ ఇంట మానవసంబంధాలు బలపడతాయి. కూతురిని అల్లుడు ప్రేమగా చూసుకుంటుంటే సంతోషపడుతున్నప్పుడు, అదేలా కోడలి గురించి ఆలోచించడం ఆ తల్లి అలవరుచుకుంటేనే ఆ సంసారం సంతోషంగా సాగుతుంది. 

సమానంగా... కూతురు, కోడలిని సమానంగా చూడటం నేర్చుకుంటే సమస్యలకు తావుండదు. కొడుకు తన ఆస్తి అనే భావన, స్వార్థం ఆ తల్లిలో ఉండకూడదు. తను ప్రారంభించిన కొత్త జీవితానికి అవసరమైతే ఆ తల్లి చేయూతనివ్వాలి. అలాకాకుండా అప్పటివరకు ప్రేమించిన కొడుకును కూడా విమర్శించడం, దాంతోపాటు కోడలిని దుయ్యబట్టడం సరైంది కాదు. ఇంట్లో పెళ్లి కావాల్సిన కూతురు ఉన్నప్పుడు ఆమెకూ వదినపై అసూయ, ద్వేషం పెరిగేలా చేయకూడదు. అందరూ సమానమే అనే భావన ఆ ఇంటి ఇల్లాలికి ఉంటే, వాతావరణం ప్రశాంతంగా మారుతుంది.

ఇరువురిపట్ల... తల్లిపై భార్య, లేదా భార్యపై తల్లి కోపాలను ప్రదర్శించేటప్పుడు ఆ ఇంటి వారసుడు నిశ్శబ్దంగా ఉండకూడదు. అలాగే ఎవరో ఒకరివైపు పక్షపాతాన్ని చూపకూడదు. తన ప్రవర్తన ద్వారా ఇరువురూ తనకు సమానమన్న భావన తెలియపరచగలగాలి. ఇంట్లో ఎదురయ్యే సమస్యలను సమన్వయం చేయగలగాలి. తల్లి, భార్య.. ఇరువురి మర్యాదనూ కాపాడుతూ వాతావరణాన్ని కలుషితమవకుండా చూడాలి. ఇవన్నీ ఆ కొడుకుకు అలవడాలంటే చిన్నప్పటి నుంచి ఆ తల్లి కూడా సమదృష్టితో ఉండాల్సిందే. అప్పుడే పిల్లలనూ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా తీర్చిదిద్దగలుగుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని