Updated : 10/04/2022 05:56 IST

వరుడు లేని పెళ్లి!

భర్తతో ఇబ్బందిపడి వివాహ బంధం నుంచి బయటికి వచ్చిన వారుంటారు... బాయ్‌ ఫ్రెండ్‌తో సమస్యల వల్ల సహజీవన బంధాన్ని ముగించిన వారుంటారు... ఇవి కాకపోయినా మగపొడ గిట్టని వారూ ఉంటారు... కానీ వీళ్లలో చాలా మందికి పెళ్లి కూతురులా ముస్తాబవడం, ఫొటోషూట్లు చేయించుకోవాలని, ఇతర సంబరాలనూ ఆస్వాదించాలనీ ఉంటుంది... జపాన్‌లో ఇలాంటి అమ్మాయిలు ఇప్పుడు ‘సోలో వెడ్డింగ్‌’ చేసుకుంటున్నారు. ఇతర దేశాలకూ పాకుతోందిది. ఒకరకంగా పురుషాధిక్యతకు చెంపపెట్టులా పరిగణిస్తున్న ఈ ధోరణి ఏంటో చూడండి...

పెళ్లిలో వధువు, బంధువులు, వేడుకలు, పురోహితులు, ఫొటోషూట్‌... ఇలా అన్నీ ఉంటాయి ఒక్క వరుడు తప్ప. మరి పెళ్లి ప్రమాణాలంటారా? పెళ్లి కూతురు తనను తాను ప్రేమించుకుంటానని, జీవితాంతం ఒంటరిగా ఉంటానని ప్రమాణం చేస్తూ పెళ్లి ఉంగరాన్ని తనే పెట్టుకుంటుంది. జపాన్‌లో పదేళ్ల క్రితం ఈ ధోరణి మొదలైంది. ఇది ఇటలీ, ఆస్ట్రేలియా, తైవాన్‌, అమెరికాల్లోనూ వేగంగా విస్తరిస్తోంది.

ఈ సొంత పెళ్లి పనులు మీరొక్కరే చేసుకుంటూ ఏం ఇబ్బంది పడతారు, అవన్నీ మేం చేసిపెడతామంటూ 2014లో క్యోటోలో సెరెకా ట్రావెల్స్‌ సంస్థ ప్రత్యేక ప్యాకేజీలు ప్రారంభించింది. దాంతో అప్పటి వరకూ వ్యక్తిగత స్థాయిలో జరుగుతూ వచ్చిన ఈ కార్యక్రమాలకు ఊపొచ్చింది. ఈ ప్యాకేజీలో పెళ్లి కూతురుకు ఆ ప్రత్యేకమైన రోజు జీవితాంతం గుర్తుండి పోయేలా చేస్తారు. ఆహ్వానపత్రికలు ముద్రించడం నుంచి వధువుకు ఫొటోషూట్‌ చేసి పెళ్లి ఆల్బమ్‌ను ఇవ్వడం వరకు అన్నీ మామూలు పెళ్లి స్థాయిలోనే జరిపిస్తారు. అమ్మాయిలు తమ బడ్జెట్‌కు తగ్గట్టు ‘సోలో వెడ్డింగ్‌’ ప్లాన్‌ చేసుకోవచ్చు. ఈ సోలో వెడ్డింగ్‌కు ఖర్చు రెండు లక్షల రూపాయల నుంచి మొదలవుతుంది. సెరెకా సంస్థ తక్కువ కాలంలోనే 130 కంటే ఎక్కువ సోలో వెడ్డింగ్‌ ఈవెంట్‌లను నిర్వహించింది. భాగస్వామి చేతిలో మోసపోయిన వారు/విడాకులు తీసుకున్న వారూ ఈ సోలో వెడ్డింగ్‌ పట్ల ఆసక్తిని చూపుతున్నారని ‘సెరెకా ట్రావెల్‌’ చెబుతోంది. ఆ మధ్య మినావి అనే మహిళా వెబ్‌సైట్‌... పెళ్లిపై జపాన్‌ మహిళల అంతరంగాన్ని తెలుసుకోవడానికి సర్వేను నిర్వహించింది. ఇందులో పాల్గొన్న వారిలో 20 శాతం తమ జీవితంలో ‘సోలో వెడ్డింగ్‌’ తప్పని సరిగా చేసుకోవాలనుకుంటున్నారట. కాబట్టి అబ్బాయిలూ.. బుద్ధిగా ఉండకపోతే.. తలంబ్రాల స్థానంలో అక్షింతలు వేయడానికే పరిమితమైపోగలరు. జాగ్రత్త మరి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని