Published : 16/04/2022 00:23 IST

పోటీ అవసరమే.. కానీ..

పిల్లలు తెల్లటి కాన్వాస్‌ లాంటివాళ్లు. వాళ్లల్లో మంచి భావాలను నింపితే మంచిగా తయారవుతారు. క్రమశిక్షణ లేకుండా పెంచితే పట్టు తప్పి పాడైపోతారు. కనుక అద్భుత చిత్రాల్లా రూపొందించాల్సిన బాధ్యత పెద్దలదే. అందుకు ఈ సూత్రాలు పాటించమంటున్నారు నిపుణులు...

* చిన్నారులు తల్లిదండ్రులను చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. కనుక ముందు మనం పద్ధతిగా ఉండాలి. మనం ఎలా ప్రవర్తించినా వాళ్లను అదుపు చెయ్యొచ్చు అనుకుంటే కుదరదు. ‘నన్ను చేయమంటున్నావు.. మరి నువ్వెందుకు చేయడం లేదు’ అని తప్పక అడుగుతారు. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?’ అని సామెత. కనుక ముందు మనం ఆచరించి, ఆనక పిల్లలకు చెప్పాలి.

* ‘అన్నం కింద పడకుండా తినడం, పాలు తాగిన గ్లాసు సింక్‌లో పెట్టేయడం’ లాంటి అతి చిన్న విషయాల దగ్గర నుంచి ‘స్థాయీ భేదాల్లేకుండా అందరితో మంచిగా, మన్ననగా ఉండాలి.. ఎవరినీ తూలనాడొద్దు’ లాంటి అంశాల వరకూ ఆయా వయసుల్లో నేర్పించాలి. అంటే దశల వారీగా వాళ్ల ప్రవర్తనను తీర్చిదిద్దుతూ వ్యక్తిత్వాన్ని అందంగా మలచాలి.

* తప్పులూ పొరపాట్లు జరగడానికి వీల్లేదంటూ భయపెట్టడం సరి కాదంటున్నారు మానసిక నిపుణులు. ఎంతో జీవితాన్ని చూసిన తర్వాత కూడా పొరపాట్లు దొర్లుతుంటాయి. కనుక తప్పు జరిగినప్పుడు సంయమనం కోల్పోక వాళ్లను సరిదిద్దాలి.

* ప్రశంసలు మరిన్ని మంచిపనులు చేసేలా ప్రోత్సహిస్తాయి, ప్రేరేపిస్తాయి. కనుక మీ చిన్నారి ఎంత చిన్న మంచి పని చేసినా మెచ్చుకోండి. అలాగే మొరాయించినప్పుడు కోపగించుకుని శిక్షించే బదులు పర్యవసానాలు వివరించి చెప్పండి. ఇది వాళ్లలో పశ్చాత్తాపానికీ, మంచి మార్పుకూ దారితీస్తుంది.

* ‘స్పర్థయా వర్థతే’ అన్నారు. అయితే పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండాలి. ‘ఫలానా వ్యక్తి అంత బాగా చదవడం వల్ల ఇంత మంచి స్థితి సాధ్యమైంది’ తరహాలో ఉండాలే తప్ప ‘ఆమె చూడు, ఏదైనా గొప్పగా చేస్తుంది.. నీకేదీ చేతకాదు, నువ్వెప్పటికీ పైకి రావు’ లాంటి మాటలతో దెప్పితే నీరుకారి నిస్పృహకు లోనవుతారు.

* అందరూ అన్నింటిలో గొప్పగా ఉండరు. మీ చిన్నారి సామర్థ్యాలేమిటో గుర్తించి వాటిలో ప్రోత్సహిస్తే సరిపోతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని