పెళ్లి తీరు మారుస్తున్నారు!

రెండు మనసులు ముడిపడటమే పెళ్లి. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలో ఎటు చూసినా కోలాహలమే. అందులో తానూ భాగమవ్వాలనుకుంటోంది నేటి పెళ్లి కూతురు. ప్రమాణాలకు ముందే ఇద్దరం చెరో సగం అని చెబుతోంది. వరుడి వెనుక కాకుండా.. కలిసి అడుగు వేయాలను కుంటోంది. తమ ఆనందం పర్యావరణానికీ హితమవ్వాలని చూస్తోంది. తనదైన రోజున నచ్చినట్టుగా ఉంటూ..

Published : 25 Apr 2022 01:54 IST

రెండు మనసులు ముడిపడటమే పెళ్లి. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలో ఎటు చూసినా కోలాహలమే. అందులో తానూ భాగమవ్వాలనుకుంటోంది నేటి పెళ్లి కూతురు. ప్రమాణాలకు ముందే ఇద్దరం చెరో సగం అని చెబుతోంది. వరుడి వెనుక కాకుండా.. కలిసి అడుగు వేయాలను కుంటోంది. తమ ఆనందం పర్యావరణానికీ హితమవ్వాలని చూస్తోంది. తనదైన రోజున నచ్చినట్టుగా ఉంటూ.. అవతలి వాళ్లూ తననలాగే స్వీకరించాలని కోరుకుంటోంది. అందుకు ఉదాహరణలే.. వీళ్లు!


‘నేను.. నేనులా..’

మనదైన రోజున ప్రత్యేకంగా నిలవాలని ఎవరికుండదు? కానీ.. ‘నేను నేనులా ఉండటమే ప్రత్యేక అంద’మంటున్నారు కొందరు. బుల్లితెర హాస్యనటుడు దిలీప్‌ జోషి కూతురు నియతికి పాతిక నిండకుండానే తెల్లజుట్టు మొదలైంది. కానీ దాన్నెప్పుడూ దాయాలనుకోలేదు. దాంతోనే పెళ్లి పీటలెక్కింది కూడా. నేహా దుపియాకీ చిన్నతనం నుంచీ కొద్దిగా నెరుపుంటుంది. ఈమె కూడా పెళ్లి సమయంలో రంగు వేయలేదు. పైగా అది తన ఉనికీ, అదృష్ట చిహ్నం అని చెప్పింది. అందం పేరిట మేకప్‌ ముసుగున దాగడానికీ కొందరు ఇష్టపడటం లేదు. పూర్తిగా మేకప్‌ లేని లేదా అతి తక్కువ మేకప్‌కీ ప్రాధాన్యమిస్తున్నారు. తాజాగా ఆలియా, గతంలో అనుష్కాశర్మ ఈ మంత్రాన్ని పాటించినవారే!


పట్టు వస్త్రాలు కాదు..

మన దేశంలో పెళ్లి కూతురు పట్టుచీర కట్టుకోవడం లేదా లెహెంగా ధరించడం పరిపాటి. దీంతోపాటు స్థాయికి తగ్గట్టుగా బంగారు నగలూ. కానీ సంజనా రిషి మాత్రం ఇందుకు విరుద్ధంగా సూట్‌ ప్యాంట్‌లో పెళ్లి చేసుకుంది. ఈమెది దిల్లీ. అమెరికాలో చదువుకొని అక్కడే వ్యాపారవేత్తగా ఎదిగింది. కార్పొరేట్‌ లాయర్‌ కూడా. పెళ్లి కోసమని దిల్లీ తిరిగొచ్చేసింది. సస్టెయినబిలిటీకి ప్రాధాన్యమిస్తుందీమె. ఫ్యాషన్‌ కారణంగా వస్త్రాల రూపంలో పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందనేది ఈమె భావన. అందుకే సెకండ్‌ హ్యాండ్‌ దుస్తులకే ప్రాధాన్యమిస్తుంది. పేరుకు వీటిని కొన్నా ఒకట్రెండు సార్లకే ట్రెండ్‌ ముగిసిందని పక్కన పడేస్తారు చాలామంది. పైగా వృథా అంటుందీమె. అలాంటప్పుడు జీవితంలో ఒక్కసారి వేసుకునే పెళ్లి దుస్తులకు బోలెడు డబ్బులు పోయడమెందుకని తనకు నచ్చిన సూట్‌ ప్యాంట్‌తోనే 2020లో పెళ్లి పీటలెక్కింది. ‘సూట్‌ ప్యాంట్‌ మహిళల బలమైన వ్యక్తిత్వానికి ప్రతీక. నన్నో బలమైన వ్యక్తిగా నాకు నేను చూపించుకోవడానికీ, నాదైన రోజును సౌకర్యవంతంగా ఆస్వాదించాలనుకున్నా’ అని చెబుతుందీమె. లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి వివాహమైంది. వాళ్లూ ఆడంబరాలకు దూరంగా ఉన్నారట. ఇంకా.. ఈమెను చూసే ప్యాంట్‌ స్టైల్‌ శారీ ఫ్యాషన్‌ మొదలైందనీ చెబుతారు మరి!


ఆడంబరానికి దూరం..

బాలీవుడ్‌లో పేరు తెచ్చుకొని తాజాగా తెలుగు నాటా అడుగుపెట్టింది ఆలియా భట్‌. ఇటీవలే ప్రియుడు రణ్‌బీర్‌ని పెళ్లాడింది. ప్రదేశమేంటో తెలుసా! తన ఇంటి బాల్కనీ. దగ్గరి స్నేహితులు, బంధువుల మధ్యే తన వేడుకను చేసుకుంది. వీళ్లే కాదు.. యామీ గౌతమ్‌, దియా మిర్జా కూడా గత ఏడాది ఇదే విధానంలో పెళ్లి చేసుకున్నారు. తమ ఫామ్‌హౌజ్‌, గార్డెన్లలో వీళ్ల పెళ్లిళ్లు జరిగాయి. పర్యావరణ హితానికీ ప్రాధాన్యమిచ్చారు. అరటి ఆకులు, మట్టితో అలికిన నేలకే కాదు.. వాళ్లమ్మ పెళ్లిచీరనే పెళ్లి సమయంలో ధరించింది యామీ. పెళ్లి ఓ మధురమైన వేడుకే. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కలవడం ముఖ్యం. ఆడంబరం కాదు. పైగా ఈ పేరుతో ఆహారం, పూలు ఎన్నో వృథా. ఆ సమయంలో వాడే ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికీ హాని. వీటన్నింటినీ అరికట్టడానికే ఇలా నిరాడంబర, పర్యావరణ హితమైన పెళ్లికి ప్రాధాన్యమిచ్చామంటారు వీళ్లిద్దరూ. వీళ్లని ఆదర్శంగా తీసుకొని కాగితం, వెదురు, మట్టితో చేసిన డెకరేషన్లు, తులసి దండలు.. ఇలా భిన్నమైన మార్పులు తీసుకొస్తున్న వారెందరో!  దియా ఓ అడుగు ముందుకేసి.. లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ గత ఏడాది తన పెళ్లినీ షీతల్‌ అట్టా అనే పురోహితురాలితో జరిపించుకుంది.


అదీ మారింది..!

ఉత్తర భారతదేశంలో వివాహ వేదికకు వరుడు ఊరేగింపుగా రావడం సంప్రదాయం. దీనికిప్పుడు చుక్క పెడుతున్నారు ఎందరో అమ్మాయిలు. గుర్రం, బైకు, ట్రాక్టర్లను స్వయంగా నడుపుతూ పెళ్లి మండపాలకు చేరుకున్నారు. ‘ఎప్పుడూ అబ్బాయిలే ఘన స్వాగతాలు అందుకోవాలా? పెళ్లిలో ఇద్దరూ సమానమైనప్పుడు.. అమ్మాయిలకూ అది దక్కాలిగా!’ అంటారు వీళ్లు. కన్యాదానాలనీ వ్యతిరేకించినవారున్నారు. మన దగ్గరా అత్తారింటికి ఏడుస్తూ కాక నృత్యం చేస్తూ ఆనందంగా వెళుతున్నారు నేటితరం పెళ్లికూతుళ్లు. ‘కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నపుడు దాన్ని కన్నీటితో ఎందుకు మొదలుపెట్టాలనేది’ వీరి ప్రశ్న.

వీటన్నింటిపై ‘సంప్రదాయాలను మంటగలుపుతున్నా’రన్న వాదనలకూ తావు లేకపోలేదు. కానీ.. ‘అమ్మాయి జీవితంలో జరిగే అతిపెద్ద వేడుక, మార్పు పెళ్లి. దీన్ని కడుపు మాడ్చుకునో, ఇబ్బందిపడుతూనో, ఎవరేమనుకుంటారో అని సమాజం కోసం ఎందుకు చేసుకోవాలి? అయినా దీనిలో సంప్రదాయాన్ని మంటగలపడమేమీ లేదు. కలిసి నడుస్తామన్న ప్రమాణాల్ని పాటిస్తూనే.. కొన్ని వెసులుబాట్లు తీసుకుంటున్నాం. అందరినీ మాలాగే చేయమనీ సూచించట్లేదు. మా విషయంలో నచ్చిన మార్పులు చేసుకున్నాం. కాకపోతే ఇది చాలామందికి అనుసరించాలనిపిస్తోందంతే’ అని సమాధానమిస్తున్నారు. మరి మీ ఓటెటు?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని