ఆలుమగల అనుబంధం పెరగాలంటే...

వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు వివాహ బంధంలోకి అడుగుపెడతారు. సంస్కృతి, సంప్రదాయాలు, అలవాట్లు భిన్నంగా ఉండే ఆ ఇరువురూ ఒకటై నిండు నూరేళ్లూ సుఖసంతోషాలతో జీవించాలంటే కొన్ని సూత్రాలు పాటించాలంటున్నారు నిపుణులు...

Published : 18 May 2022 01:33 IST

వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు వివాహ బంధంలోకి అడుగుపెడతారు. సంస్కృతి, సంప్రదాయాలు, అలవాట్లు భిన్నంగా ఉండే ఆ ఇరువురూ ఒకటై నిండు నూరేళ్లూ సుఖసంతోషాలతో జీవించాలంటే కొన్ని సూత్రాలు పాటించాలంటున్నారు నిపుణులు...

పంచుకుంటూ... ఇంటి బాధ్యతలను పంచుకున్నట్లే ఇంటి పనులు కూడా నువ్వూ నేను సగం సగం అనుకుంటూ పూర్తి చేయాలి. మగవాడిని నేనెందుకు చేయాలి లేదా నాకు చేయడం రాదు అని తప్పించుకో కూడదు. చిన్నప్పుడు నేనీ పనులు నేర్చుకోలేదు అంటూ అమ్మాయిలు బద్దకించడానికి ప్రయత్నించకూడదు. ఇలా చేస్తే తమకు ఎదుటివారి చేయూత లేదు, మొత్తం పనంతా నాపైనే అనే భావన ఇవతలి వారికి కలిగే ప్రమాదం ఉంది. అలాకాకుండా ఇంట్లో సమానత్వానికి పెద్దపీట వేయాలి. చిన్న పనిని కూడా పంచుకుంటూ చేస్తే చాలు. ఒకరిపై మరొకరికి మర్యాద, గౌరవం, ప్రేమ పెరిగి, ఇరువురి అనుబంధాన్ని మరింత పెంచుతాయి.

తల్లిదండ్రులను.. ఇరువైపులా పెద్దలను భార్యాభర్తలిద్దరూ అభిమానించాలి. తమ వారిని బాగా చూసుకుంటూ ఎదుటివారి తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండకూడదు. ఇలా చేస్తే అవతలివారు నొచ్చుకుంటారు. ఒక్కోసారి వారు వెంటనే దాన్ని పైకి చెప్పలేకపోవచ్చు. కానీ మీపై ప్రేమ క్రమేపీ తగ్గిపోయే అవకాశం ఉంది. దాని ఫలితంగా మీపై కూడా ఆసక్తి క్రమేపీ తగ్గుతుంది. నిజమైన ప్రేమ లేని చోట బంధం బలహీనపడుతుంది. ఇది మరిన్ని దుష్పరిణామాలకు దారితీస్తుంది. అలా కాకుండా ఇరువురూ జీవిత భాగస్వామి అమ్మా నాన్నలను కూడా సొంత వారిలానే ప్రేమించగలిగితే సమస్యలకు తావుండదు. ఎక్కడైనా, ఎప్పుడైనా పెద్దవాళ్లను గౌరవిస్తూ, వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉంటే వారి అనుభవాలే మీకు చక్కటి మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి.

బయటవారితో... కుటుంబ సమస్య ఏదైనా వచ్చినప్పుడు దాన్ని మీ ఇద్దరే తీర్చుకోవడానికి ప్రయత్నించాలి. బయటి వారితో చర్చించడం లేదా భాగస్వామి గురించి వారివద్ద చెడుగా మాట్లాడటం చేయకూడదు. మూడో వ్యక్తికి అవకాశం ఇస్తే, సమస్య అవతలివారి చేతిలోకి వెళ్లినట్లే. దాని గురించి మీకు అర్థమైనంతగా వారికి అర్థం కాకపోవచ్చు. ఒకసారి మీరు అలా చర్చిస్తే, తిరిగి మళ్లీ ఎదురుచూడొచ్చు. ఇది మరో సమస్యను కొనితెచ్చుకున్నట్లే. తీవ్రత మీకే తెలుస్తుంది. ఇరువురూ కలిసి చర్చించుకుని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటే ఆ సమస్య మళ్లీ తలెత్తక పోవచ్చు. వచ్చినా.. దాన్నెలా తీర్చిదిద్దుకోవాలో మీ అనుభవం నేర్పుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని