Published : 19/05/2022 00:56 IST

సానుకూలం.. సామరస్యం..

ఉద్యోగినులకు ఇంటా బయటా పనిభారంతో ఇబ్బంది అన్న సంగతి తెలిసిందే. ఆ ఒత్తిడి ఆందోళనగా మారితే అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో భాగస్వామితో విభేదాలకు దారితీసే ఆస్కారముంది. అలాకాకుండా ఉండాలంటే సానుకూలంగా మెలుగుతూ సమస్యలను పరిష్కరించుకోమని హితవు చెబుతున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు. కొన్ని సూచనలు కూడా చేశారు, పాటించి చూడండి...

* ముందుగా మీ పని సులువులేమిటో అన్వేషించి ఆచరణలో పెట్టండి. అప్పుడు త్వరగా అలసిపోరు. ఇక రెండోది భర్త నుంచి సాయం తీసుకోండి.
* ఇంటిపట్టునే ఉండే మహిళలు పనులన్నీ సొంతంగా చేసుకోవడమే తప్ప భర్త, పిల్లలకు చెప్పడం తక్కువ. అందువల్ల మీ భర్తకు ఇంటి పనులు చేతకాకపోవచ్చు లేదా చేయాలనే ఆలోచన రాకపోవచ్చు. అలాంటప్పుడు నిష్టూరాలు, కోపతాపాలు పడేకంటే మీరొక్కరే చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోతున్న సంగతి విడమర్చి చెప్పండి. అందులోని కష్టమేంటో తప్పకుండా అర్థమవుతుంది. అందాకా అలవాటు లేదు కనుక మొదట చిన్న చిన్న పనులే అప్పగించండి.
* ఇంకొందరు పెళ్లయిన కొత్తలో మొహమాటంతో పనులన్నీ ఒంటరిగా చేసుకుపోతారు. దాంతో అదే అలవాటుగా కొనసాగుతుంది. కనుక ముందుగానే పనులను పంచుకుంటే సంసారం సాఫీగా సాగుతుంది.
* పనులు చేతకాకున్నా, చెడగొట్టినా విసుక్కుని లేదా వెక్కిరించి వదిలేయకుండా అర్థమయ్యేలా చెప్పండి. మీలా చేయలేదనో, మెల్లగా చేస్తున్నారనో వంకలు పెట్టొద్దు. సతమతమవుతూ ఒక్కరే చేసుకునే కంటే ఎంతో కొంత భారం తగ్గిందని సంతోషించండి.
* కూరగాయలు తరిగివ్వడం, పిల్లలకు తినిపించడం లాంటి పనులు చేసినప్పుడు ‘నేను చేయడం లేదా.. ఇది మామూలే’ అనుకోకుండా మెచ్చుకోండి. కృతజ్ఞత తెలియజేయండి. అది మరింత చేసేలా ప్రేరేపిస్తుంది.
* ఇంటా బయటా సమస్యలు ఎదురైతే మనసులోనే ఉంచుకుని కుమిలిపోయే బదులు భాగస్వామితో పంచుకోండి. ఒంటరిగా కంటే ఇద్దరు కలిసి ఆలోచించినప్పుడు పరిష్కారం సులువుగా లభిస్తుంది. అంతకంటే ముందు ఊరట, ఓదార్పూ దొరుకుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని