పిల్లల్ని దారికి తెచ్చుకునే మార్గం ఉందా?

నేనొక ప్రైవేట్‌ స్కూల్లో టీచర్ని. పిల్లల్లో పెద్దవాళ్లంటే భయభక్తులు కనిపించడం లేదు. చాలామంది విద్యార్థులు ఎదురు చెబుతున్నారు. కొందరైతే అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి పిల్లల్ని దారికి తెచ్చుకోవడానికి ఏదైనా మార్గం చెప్పండి...

Updated : 20 Jun 2022 15:35 IST

నేనొక ప్రైవేట్‌ స్కూల్లో టీచర్ని. పిల్లల్లో పెద్దవాళ్లంటే భయభక్తులు కనిపించడం లేదు. చాలామంది విద్యార్థులు ఎదురు చెబుతున్నారు. కొందరైతే అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి పిల్లల్ని దారికి తెచ్చుకోవడానికి ఏదైనా మార్గం చెప్పండి...

పిల్లల్లో మార్పు రావడానికి అటు సమాజం, ఇటు కుటుంబ వ్యవస్థ రెండూ కారణమే. సినిమాలూ సీరియళ్లలో టీచర్లు, లెక్చరర్లను వెక్కిరించడం, హేళన చేయడం చూసి వీళ్లు అనుసరిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలకి విలువలు, క్రమశిక్షణ నేర్పకుండా గారాబం చేస్తున్నారు. తప్పు చేసినప్పుడు మందలించి సరిచేయకుండా వెనకేసు కొస్తున్నారు. వాళ్లు అడిగినవన్నీ కొనిచ్చి గారాబం చేస్తున్నారు. పిల్లలు చదవకపోతే టీచర్లకు ఏమీ తెలీదని నిందించడం, వాళ్లకు ఎదురుచెబితే, పరిహసిస్తే కోప్పడకుండా అది ధైర్యమని మురిసిపోవడం వల్ల వాళ్లింకా రెచ్చిపోతారు. తూలనాడటం, పేర్లు పెట్టడం లాంటివి ఒకరి నుంచి ఒకరు నేర్చుకుని అనుసరిస్తున్నారు. పిల్లల్లో మంచిని మెచ్చుకోవాలే కానీ చెడును కాదు.

సమాజంలో మార్పు రావడానికి అందరూ కలిసి కృషి చేయాలి. మీరు ఒక్కరుగా ఏమీ చేయలేరు కనుక అలాంటివి పట్టించుకోకుండా హుందాగా వ్యవహరించండి. వాళ్ల చేష్టలను వ్యక్తిగతంగా తీసుకుని బాధపడొద్దు. ఇది సామాజిక రుగ్మత అనుకోండి. మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తూ వీలైనప్పుడు మంచి నడవడిక గురించి కథల రూపంలో చెబితే మార్పు వచ్చే అవకాశం ఉంది. వాళ్ల తల్లిదండ్రులకు, ప్రిన్స్‌పల్‌కు చెప్పి చూడండి. తోటి టీచర్లూ, స్కూలు యాజమాన్యం కలిసి పిల్లల తత్వంలో మార్పు వచ్చేందుకు ఏం చేయొచ్చో ఆలోచించండి. ఇలాంటి అంశాల నుంచి మళ్లించడానికి ఆయా అంశాల్లో పోటీలు పెట్టండి. మంచి ప్రవర్తనకు దారితీసేలా కథలు చెప్పించడం, డ్రామాలు వేయించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని