చిట్టి మనసుల్లో కలతలొద్దంటే..

కమలకు ఇద్దరు పిల్లలు పుట్టారనే సంతోషం నాలుగేళ్లకే ఆవిరైపోయింది. ఒకరి బొమ్మలు మరొకరితో పంచుకోకపోవడం, ఇద్దరూ ఎదుటివారిపై అసూయతో నిత్యం గొడవపడటం, నువ్వెందుకు వచ్చావ్‌.. అనే స్థాయికి చేరింది వారి ప్రవర్తన. దీన్ని మొగ్గలోనే తుంచాలంటున్నారు నిపుణులు. వారిమధ్య బాల్యం నుంచే ప్రేమానుబంధాల్ని పెంచాలంటున్నారు.  

Updated : 02 Jul 2022 05:45 IST

కమలకు ఇద్దరు పిల్లలు పుట్టారనే సంతోషం నాలుగేళ్లకే ఆవిరైపోయింది. ఒకరి బొమ్మలు మరొకరితో పంచుకోకపోవడం, ఇద్దరూ ఎదుటివారిపై అసూయతో నిత్యం గొడవపడటం, నువ్వెందుకు వచ్చావ్‌.. అనే స్థాయికి చేరింది వారి ప్రవర్తన. దీన్ని మొగ్గలోనే తుంచాలంటున్నారు నిపుణులు. వారిమధ్య బాల్యం నుంచే ప్రేమానుబంధాల్ని పెంచాలంటున్నారు.  

మొదటి బిడ్డను తల్లిదండ్రులు అపురూపంగా చూసుకుంటూ అడిగిందల్లా అందించి ప్రేమను పంచుతారు. అమ్మానాన్న ప్రేమ మొత్తం తనదే అనే భావనలో వారు పెరుగుతారు. అకస్మాత్తుగా తనకు, తల్లిదండ్రులకు మధ్య వచ్చిన మరొకరిని ప్రేమించలేరు. అలాకాకుండా రెండోసారి గర్భందాల్చినప్పుడు మొదటి సంతానాన్ని తల్లి మానసికంగా ముందుగానే సిద్ధం చేయాలి. త్వరలో తమ్ముడు లేదా చెల్లి పుడతారనీ, ప్రేమగా చూసుకోవాలనీ చెప్పాలి. తమ కుటుంబంలోకి రాబోతున్న పాపాయిని అందరం ప్రేమించాలనే అవగాహన కలిగించాలి. అయితే అప్పుడే పుట్టిన పాపాయిని తల్లి అపురూపంగా చూసుకోవడం, తనదనుకున్న ఆ ఒడిలో మరొకరుండటం మొదటి బిడ్డ తేలికగా తీసుకోవడం కష్టం. తన మనసునిండా అసూయ, కోపం, బాధ నిండుతాయి. ఒంటరితనానికి గురవుతారు. ఆ సమయంలోనే జాగ్రత్తగా ఆ పసి మనసుని సమన్వయం చేయాలి. బుజ్జాయిని జాగ్రత్తగా చూసుకోవాలనే అవగాహన కలిగించాలి.  

పంచుకోవడం..

తల్లిదండ్రులు ఇద్దరినీ సమానంగా చూడాలి. అలాకాకుండా చిన్నవాళ్లను దగ్గరకు తీసుకొని పెద్దపిల్లలపై కోపాన్ని ప్రదర్శించకూడదు. ఇలా చేస్తే వారి మనసులో ఎదుటివారిపై ద్వేషం పెరిగే ప్రమాదం ఉంది. తమ బొమ్మలు, వస్తువులు, కథల పుస్తకాలను వారితో పంచుకోవడానికి ఇష్టపడరు. రెండో సంతానం పుట్టడం వల్లే తనకు చెందాల్సినవన్నీ అవతల వారికీ చేరుతున్నాయనే ఆలోచన పెద్దవాళ్లలో మొదలవుతుంది. తల్లిదండ్రులు ఇద్దరినీ దగ్గరకు తీసుకోవడం, సమానంగా బొమ్మలు కొనివ్వడం, ప్రేమగా కథలు చెప్పడం, ఒకరితో మరొకరిని పోల్చకుండా మాట్లాడటం వంటివన్నీ తోబుట్టువుల మధ్య ప్రేమను చిగురించేలా చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని