Published : 15/02/2023 00:19 IST

లక్ష్యం లేకుండా ఉంటే...

అలేఖ్య పదేళ్ల కూతురికి  లక్ష్యమంటూ ఉండదు. చదువుసహా సమయపాలన, అభిరుచి వంటి ఏ విషయాల్లోనూ తనకంటూ అభిప్రాయం ఏర్పరుచుకోదు. ఎలాంటి కెరియర్‌నెంచుకోవాలనేదానిపై చిన్నప్పటి నుంచి అవగాహన ఉండాలంటున్నారు నిపుణులు. వారి దిశా మార్గాన్ని వారే నిర్ణయించుకొనేలా పెద్దవాళ్లు ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.

పిల్లల్లో లక్ష్యం ఏర్పడాలంటే ఆయా రంగాలపై ముందుగా పూర్తి అవగాహనను తల్లిదండ్రులే కల్పించాలి. లక్ష్య నిర్దేశంవల్ల కలిగే లాభాలను చెప్పాలి.  పోటీల్లో పాల్గొనాలన్నా కూడా .. లక్ష్యం తప్పనిసరి అని చెప్పాలి. ఇవే వారిలో భవిష్యత్తు లక్ష్యానికి పునాది అవుతాయి. నైపుణ్యాలను పెంచుతాయి. తమను తాము మెరుగుపరుచుకుంటూ.. ఏ రంగంలో అడుగుపెడితే అనుకున్నది సాధిస్తారో నిర్దేశించుకునే స్థాయికెదుగుతారు.

చిన్నగా.. కొందరు పిల్లలు పాఠశాల నుంచి వచ్చిన వెంటనే  హోంవర్క్‌ పూర్తిచేయడం లక్ష్యమని చెబుతుంటారు. రెండుమూడు రోజులకే దాన్ని మర్చిపోయి దాటవేయడం మొదలుపెడతారు. మరికొందరు పిల్లలకు లక్ష్యమే ఉండదు. సమయంబట్టి పని పూర్తిచేస్తారు లేదా వాయిదా వేస్తారు. ఈ రెండు విధానాలూ సరైనవి కాదు. లక్ష్యమంటే భయపడేంత విషయం కాదని వాళ్లకు చెప్పగలగాలి. చిన్నచిన్న అంశాల్లో వారిని ముందుకు అడుగులేయించాలి. హోంవర్క్‌ అంతా ఒకేసారి పూర్తిచేయలేకపోతే రెండు భాగాలుగా చేసి నిర్ణీత సమయంలోపు రాయాలన్నట్లు నేర్పించాలి. అలా చేయడంతో కలిగే ప్రయోజనాలను క్రమేపీ వారే తెలుసుకుంటారు.

ఒక్కొక్కటిగా.. ఇంట్లో అందరికీ అవసరమయ్యే నీళ్లను మంచినీళ్ల సీసాల్లో నింపే పనిని పిల్లలకు అప్పజెప్పాలి. తోటలోని మొక్కలకు నీళ్లు పోయడం, అక్వేరియంలో చేపలకు ఆహారం వేయడం వంటి చిన్నచిన్నవాటిని బాధ్యతలుగా అందించాలి. రోజూ ఆ పనులను వారే పూర్తిచేయాలనే నియమం పెట్టాలి. క్రమేపీ ఇవన్నీ వారికి క్రమశిక్షణ నేర్పుతాయి. ఆయా సమయాలకు వాటిని చేయడం అలవడి, సమయపాలన నేర్చుకుంటారు. క్రమేపీ ఇవన్నీ పిల్లల్లో అభిరుచులను ఏర్పడేలా చేస్తాయి. వాటి నుంచి లక్ష్యాలంటే ఏంటో తెలుసుకుంటారు. మనసుకు నచ్చిన మార్గాన్నెంచుకోవడం మొదలుపెడతారు. అందులో కావాల్సిన ప్రోత్సాహాన్ని పెద్దవాళ్లు అందించి చేయూతనిస్తే చాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని