చదవమనొద్దు.. కలిసి చదవండి!

స్కూలు నుంచి ఇంటికి రావడం ఆలస్యం.. ‘పుస్తకం తీయి’ అన్నమాటే నోటి నుంచి వచ్చేస్తుంది కదూ! వాళ్ల భవిష్యత్తు కోసమే మన తాపత్రయం అయినా ఎంతసేపూ అలా చెబుతోంటే వాళ్లకీ చిరాకేగా! మరేం చేద్దామంటారా? కలిసి చదువుదాం. దీనివల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి.

Published : 05 Aug 2023 00:15 IST

స్కూలు నుంచి ఇంటికి రావడం ఆలస్యం.. ‘పుస్తకం తీయి’ అన్నమాటే నోటి నుంచి వచ్చేస్తుంది కదూ! వాళ్ల భవిష్యత్తు కోసమే మన తాపత్రయం అయినా ఎంతసేపూ అలా చెబుతోంటే వాళ్లకీ చిరాకేగా! మరేం చేద్దామంటారా? కలిసి చదువుదాం. దీనివల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి..

  • పరిజ్ఞానం అనేది స్కూలు పుస్తకాల నుంచే రాదు. వేరేవీ చదవాలి. కాబట్టి, వాళ్లకి ఏవి నచ్చుతాయో వాళ్లనే ఎంచుకోమనండి. ఉదాహరణకు కథల పుస్తకమే చదువుతా అన్నారనుకోండి. తీయనివ్వండి. ఒక పేరా చదివాక ఏం అర్థమైందో వాళ్లని అడగండి. ఈసారి మీ వంతు. దీనివల్ల ఆలోచనాశక్తితో పాటు భాషా నైపుణ్యాలూ పెరుగుతాయి.
  • అస్తమానూ కథలు, కార్టూన్ల పుస్తకాలే అంటే చదువేం కాను? నిజమే.. ఆటలు, కథల విషయానికొచ్చేసరికి సరదాగా మనమూ కూర్చుంటాం. తీరా చదువుకునేప్పుడు వాళ్లపై ఓ కన్ను వేసినట్టు ప్రవర్తిస్తాం. దీంతో వాళ్లకి అనాసక్తి మొదలవుతుంది. పాఠాలు చదివేప్పుడు టీవీ, మొబైల్‌ అన్నీ పక్కనపెట్టి, వాళ్ల పక్కనే కూర్చోండి. వాళ్లతోపాటు మీరూ వాటిని చదివేయండి. వాళ్లకేం అర్థమైందో చెప్పమనండి. పొరపాట్లు ఉంటే సరిచేయండి. నేర్చుకోవడం ఎంత సరదానో తెలియ చేసినవారు అవుతారు. చదువూ పక్కకెళ్లదు.
  • అలవాటు చేయమన్నారు కదాని ఒక్కసారిగా పెద్ద పుస్తకాలు ఇవ్వొద్దు. చిన్న కథలు.. బొమ్మల పుస్తకాలతో ఆరంభించండి.  ఇష్టంగా చదువుతారు. అందులో భయపడే అంశమొస్తే వాళ్లను భయపెట్టేవేంటో కనుక్కోండి. ఇష్టమని చెబితే ఎందుకో చెప్పమనండి. ఎలా ప్రవర్తించాలి.. ఏం చేయకూడదు అన్నింటినీ ఆ సమయంలో వివరంగా చెప్పొచ్చు. ఇది మంచి నడవడికను అలవాటు చేయడంతోపాటు అనుబంధాన్నీ పెంచుతాయి.
  • అయితే ఈ ప్రక్రియ మొత్తంలో పుస్తకం పట్టుకోవడం, పేజీలు తిప్పడం వంటివన్నీ పిల్లలకే వదిలేయండి. అలాగే ఒక్కసారిగా దేన్నైనా అలవాటు చేయడం కష్టం. పుస్తకాల విషయంలోనూ అంతే! రోజూ కొద్దిగా మొదలుపెట్టండి. వాళ్లు చదువుతోంటే మీరు మరొకటి తీసుకొని చదవండి. నచ్చిన అంశాలను పంచుకోండి. అభిప్రాయాలను చెప్పడం, ధైర్యంగా మాట్లాడటం వంటివీ అలవాటు అవుతాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్