పశువులు మేపి.. సైనికాధికారి అయ్యింది!

నంజమడైకుట్టై...  పశ్చిక కనుమల్లో విసిరేసినట్టుగా ఉండే ఆ ఊరి గురించి నిన్నమొన్నటి వరకూ పొరుగూళ్లకే తెలియదు. కానీ ఇప్పుడు దేశంలో ఎంతో మంది ఆడపిల్లలు ఆ ఊరి అమ్మాయి శరణ్యను గొప్పగా తలుచుకుంటున్నారు.

Updated : 24 May 2022 07:13 IST

నంజమడైకుట్టై...  పశ్చిక కనుమల్లో విసిరేసినట్టుగా ఉండే ఆ ఊరి గురించి నిన్నమొన్నటి వరకూ పొరుగూళ్లకే తెలియదు. కానీ ఇప్పుడు దేశంలో ఎంతో మంది ఆడపిల్లలు ఆ ఊరి అమ్మాయి శరణ్యను గొప్పగా తలుచుకుంటున్నారు. పశువులు కాసుకుంటూ గెజిటెడ్‌ ఆర్మీ ఆఫీసర్‌ అయిన ఆమె కథ ఏ ఆడపిల్లకైనా స్ఫూర్తే కదా మరి...  

రోడు జిల్లాలోని అందియూరు సమీపంలో ఉన్న నంజమడైకుట్టై శరణ్య సొంతూరు. దాన్ని ఊరు అనడమే కానీ.. నిజానికది కొండల్లో ఒదిగిన నాలుగు గడపల గూడెం. అక్కడకు రవాణా కూడా కష్టమే. ఎటు చూసినా పచ్చిక బయళ్లతో ఉంటుంది కాబట్టి పశువుల పెంపకమే జీవనాధారంగా మార్చుకున్నాయి అక్కడి కుటుంబాలు. శరణ్యది కూడా అటువంటి కుటుంబమే. చిన్నప్పట్నుంచీ ఆ ఇంట్లో వ్యవసాయ పనులన్నీ శరణ్యే చేసేది. పశువులనీ కాసేది. ఆమె ధైర్యం, తెగువను గమనించిన నాన్న మోహన్‌సుందరం చదువు, కెరియిర్‌ వంటి విషయాలని ఆమెకే వదిలేశాడు. అందుకే శరణ్య ఐటీ ఉద్యోగం వదిలి కబడ్డీ వైపు అడుగులు వేసింది. ‘చదువుకుంటూనే వ్యవసాయ పనులు చేసేదాన్ని. పశువులనీ కాసేదాన్ని. అందియూర్‌లో ఉన్న బడికి రోజూ రెండు గంటలు ప్రయాణించి వెళ్లేదాన్ని. కబడ్డీ అంటే ఇష్టం. స్కూల్‌లో మొదలైన ఆ ఇష్టం కాలేజీకెళ్లినా పోలేదు. అన్నావర్సిటీ తరపునా ఆడే అవకాశం వచ్చింది. దాంతో సివిల్‌ ఇంజినీరింగ్‌కయ్యే ఖర్చుని కాలేజీ యాజమాన్యమే భరించింది. చదువు పూర్తయ్యాక కాగ్నిజెంట్‌ ఐటీ కంపెనీలో చేరాను. మంచి జీతం ఉన్నా నాకెంతో ఇష్టమైన కబడ్డీ ఆడలేకపోయాననే భావన వెంటాడేది. దాంతో ఉద్యోగం మానేసి ఆరునెలలు కబడ్డీ ఆడాను. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నా. డబ్బులొచ్చే ఉద్యోగం వదలి ఇలా ఆడతానంటే ఏ ఇంట్లోనూ ఒప్పుకోరు. కానీ నాకిష్టమైన కెరియర్‌ ఎంచుకొనే అవకాశం నాన్న నాకిచ్చారు. ఆ ఆత్మవిశ్వాసంతోనే నా ఆలోచనలు మిలటరీవైపు మళ్లాయి. కానీ అందులోకి ఎలా వెళ్లాలో తెలియదు. మా ఊళ్లో ఒక్కరు కూడా సైన్యంలో లేరు. అందుకే మిలటరీ శిక్షణ ఎలా ఉంటుందని చాలామందిని అడిగి తెలుసుకునేదాన్ని. గత ఏడాది జూన్‌లో సైన్యంలో చేరడానికి ఎస్‌ఎస్‌బీ(సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు) పరీక్షలు రాశాను. దీని శిక్షణ కోసం కోవైలోని ప్రైవేటు అకాడమీలో చేరాను. మొదట్లో చాలా కష్టంగా ఉండేది. మూడు నిముషాల పాటు ఆపకుండా ఇంగ్లీషులో మాట్లాడి రోజూ వీడియో తీసి పంపమనే వారు. ప్రారంభంలో 50, 60 సార్లు వీడియో టేక్‌లు తీసుకుని కూడా చెప్పలేకపోయేదాన్ని. చాలా టాస్క్‌లు ఇచ్చేవారు. మొదట్లో అవి చేయలేక, వెనకడుగు వేశా. దాంతో అకాడమీ నుంచి తీసేశారు. కానీ పట్టుదలతో మూడు నెలల తర్వాత మళ్లీ చేరాను. బాగా మెరుగయ్యాను. భోపాల్‌, బెంగళూరుల్లో నిర్వహించిన సైనిక పరీక్షల్లో ఎంపిక కాలేదు. నా తప్పులను సమీక్షించుకుని మూడో ప్రయత్నంగా అలహాబాద్‌ వెళ్లాను. నాలుగు రోజుల్లో 17 టెస్టులు నిర్వహించారు. ఒక్కో టెస్టు ముగిసేసరికి నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. నేనంతలా ముందుకెళ్లడానికి కారణం... మాజీ సైనికుడు, నా కోచ్‌ లెఫ్టినెంట్‌ ఈసన్‌. సైన్యంలో చేరాలనుకొనే గ్రామీణ యువతకి ఆయనిచ్చే శిక్షణ అద్భుతంగా ఉంటుంది. ఎంతోమంది ఆయన శిక్షణలో తమ కలల్ని నెరవేర్చుకున్నారు. 190 మంది అలహాబాద్‌లో రిపోర్టు చేస్తే అందులో 26 మంది స్క్రీన్‌ఇన్‌ అయ్యారు. అందులో ఐదుగురు మాత్రమే సైన్యంలో చేరడానికి అర్హత సాధించాం. ఈ ఐదుగురిలో కూడా ముగ్గురు సైనిక కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే. కానీ మారుమూల గ్రామం నుంచి వచ్చిన అమ్మాయిని నేను మాత్రమే’ అంటూ సంతోషంగా చెబుతోంది శరణ్య. ‘రాత్రి 12 గంటల వరకు ఇంటి పనులు, వ్యవసాయ పనులు ఉండేవి. అవన్నీ చేసి తిరిగి ఉదయం నాలుగు గంటలకు లేచి శిక్షణకు వెళ్లేది. మా ఊరి నుంచి బస్సులు కూడా ఉండవు. చాలా కష్టపడేది. చాలామంది సైన్యంలో చేరుతుందా... ప్రాణాలు పోతాయ్‌ అని హెచ్చరించేవారు. ప్రాణాలు ఎక్కడయినా పోవచ్చు. అక్కడికి వెళ్తేనే పోతాయనేది పొరపాటు’ అంటోంది శరణ్య తల్లి తవలక్ష్మి.

అక్కడ విధులు నిర్వహించాలని ఉంది...

‘శిక్షణ పూర్తయ్యాక.. ఇంజినీరింగ్‌ విభాగంలో చేరాలనేది నా ఆశ. ఎవరూ కాలుపెట్టలేని అటవీ ప్రాంతాలకు వెళ్లడం నాకు వెన్నతో పెట్టిన విద్య. అటువంటి అటవీ ప్రాంతంలో సైనికులు ప్రయాణించడానికి వీలుగా రహదారులు, వంతెనలు, బంకర్ల నిర్మాణానికి అవకాశం వస్తే వదులుకోను’ అంటోంది శరణ్య.  

- ఆశీర్వాదం, చెన్నై

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్