అన్నింట్లో అచ్చు గుద్దినట్లే...

ఒకే రూపు రేఖలూ, ఆహార్యంతో కనిపించే కవలలు చాలామందినే చూసుంటాం. అయితే, కేవలం ఆ తరహా గుర్తింపుతోనే కాదు, పాఠశాల చదువు నుంచి పీహెచ్‌డీ వరకూ ఒకే మార్కులతో పాసై అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారీ బెంగళూరు కవలలు.

Updated : 04 May 2023 04:03 IST

ఒకే రూపు రేఖలూ, ఆహార్యంతో కనిపించే కవలలు చాలామందినే చూసుంటాం. అయితే, కేవలం ఆ తరహా గుర్తింపుతోనే కాదు, పాఠశాల చదువు నుంచి పీహెచ్‌డీ వరకూ ఒకే మార్కులతో పాసై అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారీ బెంగళూరు కవలలు... మరి ఈ జంట ప్రయాణాన్ని మనమూ తెలుసుకుందామా!

ఎంత కవలలైనా... చేసే పనుల్లో, నడవడికలో, అదృష్టంలో... ఇలా కొన్ని తేడాలు కనిపిస్తుంటాయి. కానీ ప్రగ్య, రాగ్యల విషయంలో మాత్రం ఇది భిన్నంగానే జరిగిందని చెప్పొచ్చు. ఇద్దరూ పదోతరగతిలో 10 సీజీపీఏ సాధించారు. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల్లోనూ కేవలం 0.4 శాతం తేడాతో ఒకే విధంగా మార్కులు సాధించారు. దిల్లీ యూనివర్సిటీ, మిరిండా హౌజ్‌లో ఫిజిక్స్‌లో డిగ్రీ చేశారు. పరిశోధనా రంగంలో ప్రతిభ నిరూపించుకోవాలన్న తపనతో బెంగళూరులోని జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రిసెర్చ్‌ (జేఎన్‌సీఏఎస్సార్‌)లో చేరి మాస్టర్స్‌ చేశారు. ఇటీవలే పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు. తాజాగా మరిన్ని పరిశోధనల కోసం అమెరికాలోని ప్రఖ్యాత సంస్థల్లో స్థానం సంపాదించుకున్నారు. రాగ్య మసాచుసెట్స్‌లోని హార్వర్డ్‌లో చేరితే, ప్రగ్య అక్కడికి 16 కిలోమీటర్ల దూరంలోని బ్రాందేస్‌ యూనివర్సిటీలో చోటు సంపాదించుకుంది. అయితే ప్రగ్య ఎక్స్‌పరిమెంటల్‌ ఫిజిక్స్‌లో పరిశోధన చేస్తుంటే, రాగ్య థియరిటికల్‌ ఫిజిక్స్‌ని ఎంచుకుంది.

ఆ నమ్మకంతోనే...

‘నాన్నది వస్త్రాలకు రంగులద్దే వ్యాపారం. కొత్త వర్ణాలు, ఛాయలు తీసుకురావడానికి వివిధ రకాల రసాయనాలు కలిపి ఆయన చేసే ప్రయోగాలు మాలో ఆసక్తిని పెంచాయి. శాస్త్రవేత్తలమైతే మేమూ అలా  ప్రయోగాలు చేయొచ్చని అనుకున్నాం. జవహర్‌లాల్‌ పరిశోధన సంస్థలో రిసెర్చ్‌ చేసే అవకాశం రావటంతో మా కల నెరవేరింది. దేశం మొత్తం మీద ఎనిమిది మంది మాత్రమే దీనికి ఎంపికయ్యారు. అందులో మేముండటం చాలా సంతోషంగా అనిపించింది. దేశంలోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను కలిసే అవకాశం మాకు అక్కడ లభించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో నాయకత్వ స్థానాల్లో ఉండే మహిళలు చాలా తక్కువ. ఆ ఆలోచనతోనే మేము మరింత శ్రమించి మా లక్ష్యాలను చేరుకున్నాం. ఇద్దరం విభిన్న పరిశోధనలపై ఉండటంతో రెండింటిపై మాకు గౌరవం పెరిగింది. అదే మమ్మల్ని మంచి శాస్త్రవేత్తలుగా చేస్తుందని నమ్ముతున్నాం. కొందరు మా ఎత్తు, బరువు, చదువు, పరిశోధనలు అన్నింటిలోనూ మమ్మల్ని పోలుస్తుంటారు. మేమెప్పుడూ ఒకరికొకరం పోటీ కాదు. ఇతరులతోనూ పోటీ పెట్టుకోం. ప్రతి మనిషీ ప్రత్యేకమే. ఎవరికి ఉండే బలాలు, బలహీనతలు వాళ్లకు ఉంటాయి. ఒకరి నుంచి ఒకరం నేర్చుకుంటాం. చేయూతనిచ్చుకుంటాం’ అంటున్నారు ఈ కవలలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్