మంచులో ఆంచల్ సాహసం..
గడ్డకట్టిన మంచులో అతి సునాయసంగా జారడం ఈమెకెంతో ఇష్టం. గాలిలో ఎగిరి దూకుతూ స్కీయింగ్ చేయడంలో ఈమె వేగం ప్రపంచస్థాయి పోటీలకు అర్హతను సాధించింది. దేశంలో తొలి మహిళా ‘ఆల్పైన్ స్కీయర్’గా నిలిచిన 26 ఏళ్ల ఆంచల్ ఠాకూర్ మనోగతమిది.
గడ్డకట్టిన మంచులో అతి సునాయసంగా జారడం ఈమెకెంతో ఇష్టం. గాలిలో ఎగిరి దూకుతూ స్కీయింగ్ చేయడంలో ఈమె వేగం ప్రపంచస్థాయి పోటీలకు అర్హతను సాధించింది. దేశంలో తొలి మహిళా ‘ఆల్పైన్ స్కీయర్’గా నిలిచిన 26 ఏళ్ల ఆంచల్ ఠాకూర్ మనోగతమిది.
మాది హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీ. ఏడాదిలో మూడోవంతు మా ఊరి పర్వతాలన్నీ మంచుతో కప్పి ఉంటాయి. మంచులో తోటి పిల్లలతో కలిసి సరదాగా స్కీయింగ్ చేస్తూ ఆడుకొనేవాళ్లం. అయితే ఇదే నా కెరియర్ అవుతుందని కలలో కూడా ఊహించలేదు. నాన్న రోషన్ ఠాకూర్ పారా గ్లైడర్. అన్న హిమాన్షు స్కీయింగ్ చేసేవాడు. పదేళ్లు నిండకుండానే తను నాకు నేర్పడానికి ప్రయత్నించినా ఆసక్తి లేక వినేదాన్ని కాదు. కఠినంగానైనా నాకు నేర్పించడం ప్రారంభించాడు. సాధారణంగా మంచులో స్కేటింగ్ చేయడం కన్నా, స్కీయింగ్ చాలా కష్టమైంది. అవసరమైనప్పుడు గాలిలో ఎగిరి దూకుతూ ముందుకు సాగుతుండాలి. ఇందులో ప్రమాదకరమైన మలుపులెన్నో ఉంటాయి. వేగానికి తగినట్లు శరీరాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి. ఆడుతున్నకొద్దీ ఇష్టం పెరిగింది. ప్రాక్టీస్‌తోపాటు ఈ క్రీడలో విజేతల వీడియోలు చూసేదాన్ని. మొదట్లో చెక్కతో చేసిన స్కీస్, బ్యాలెన్స్ మిషన్‌తో సాధన చేసేదాన్ని.
పోటీ.. మొదట చిన్న చిన్న పోటీల్లో పాల్గొనేదాన్ని. నాన్న ప్రోత్సహించినా, అమ్మ మాత్రం ప్రమాదకరమైన ఆట, మానేయమని చెప్పేది. స్కీయింగ్‌తోపాటు ఫిజికల్ ట్రైనింగ్, రన్నింగ్ సహా వ్యాయామాలు చేసేదాన్ని. సాధారణ రోడ్డు మార్గంలో చక్రాల బూట్లతో స్కేటింగ్ చేసేదాన్ని. మొదట్లో మనాలీలోని గులబ్బా అనే ప్రాంతానికి రేస్‌కెళ్లా. అక్కడందరూ సీనియర్స్, మగవాళ్లు. నేను మాత్రమే ఆడపిల్లనూ, వయసులో చిన్నదాన్ని. నెగ్గగలనా అని భయపడినా ఆ రేస్‌లో మూడో స్థానంలో నిలబడ్డా. అందరూ ప్రశంసిస్తుంటే నాలో విశ్వాసాన్ని పెంచింది. క్రమంగా జాతీయస్థాయికి, ఆపై 2012లో వింటర్ యూత్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకుని అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నా.
నగదులేక... 22 ఏళ్లప్పుడు తుర్కియేలో ఆల్పైన్ ఎజ్‌డర్ 3200 కప్ సాధించా. 2018, 2021లో అంతర్జాతీయ స్థాయిలో కాంస్య పతకాలను సాధించా. దుబాయిలో జరిగిన ఎఫ్‌ఐఎస్ రేస్‌లో వెండిపతకాన్ని దక్కించుకొన్న తొలి భారత స్కీయర్‌గా నిలిచా. ఫ్రాన్స్‌లో వరల్డ్ స్కీ ఛాంపియన్‌షిప్స్‌లోనూ పాల్గొన్నా. ఒలింపిక్స్‌లో అర్హత సాధించినా... కొవిడ్ సమయం కావడం, శిక్షణకు తగినంత ఆర్థిక తోడ్పాటు దొరక్క ముందుకెళ్లలేకపోయా. మనదేశంలో శిక్షణ తీసుకోవడానికి సరైన సౌకర్యాల్లేవు. దాంతో ఆస్ట్రియా, ఇటలీలో ట్రైనింగ్‌కు నెలకు రూ.20 లక్షలు కావాలి. అంత ఖర్చు భరించే స్థాయిలో మా కుటుంబం లేదు. ఇందులో పాల్గొనే విదేశీయులంతా ఉన్నచోటే సాధన చేస్తుంటే నాకు ఆ అవకాశం వెంటనే దొరకలేదు. చివరకు నాన్న తెలిసినవాళ్ల దగ్గర అప్పు చేసి మరీ నన్ను ఇటలీ పంపించారు. అయితే అప్పటికే పోటీ దగ్గరపడింది. దాంతో వరల్డ్ స్కీ ఛాంపియన్‌షిప్స్‌లో గెలుపు దూరమైంది. దుబాయిలో 2022లో జరిగిన యుఏఐ అల్పైన్ స్లాలమ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు వెండిపతకాలను గెలుచుకోవడంతోపాటు ‘ప్రపంచ స్కీ ఛాంపియన్‌షిప్స్ -2023’లో పాల్గొనే అర్హతను సాధించా. 2026 వింటర్ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నా.
సామర్థ్యాన్ని పెంచేందుకు.. పారాగ్లైడింగ్‌లో శిక్షణనిస్తున్నా.. సామర్థ్యాన్ని మరింత పెంచుకొనేందుకు ఇటీవల సైకిల్ యాత్ర చేపట్టా. 75 కిలోమీటర్ల దూరంలోని సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తున్న ప్రాంతానికెళ్లొచ్చా. మనదేశంలో వింటర్ స్పోర్ట్స్ తక్కువ. అలాగే స్కీయింగ్ నేర్చుకోవడానికి తగిన సౌకర్యాల్లేవు. ఆసక్తి ఉన్నవారికి మన ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తే మరెందరో క్రీడాకారులు మన దేశం తరఫున ఆడే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.