అందాల భామ.. ఇన్‌స్టా సందేశం!

‘అతిచిన్న రాష్ట్రం.. జనాభా తక్కువ’.. మణిపూర్‌ అంటే ఇదే కాదు. భిన్న సంస్కృతుల సమాహారం. నోరూరించే రుచులు, ఎన్నో కళలకు నెలవు.. ఇదే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయా లనుకుంది. తొలిసారి మిస్‌ ఇండియా ఫైనల్స్‌ వరకూ వెళ్లింది కూడా. కానీ ఆమె ఆశలు ఆవిరై.. గొడవలకు నెలవు అన్న పేరు తెచ్చుకుంది. అయినా తన ప్రయత్నం ఆపట్లేదు.. స్టెర్లా తౌనోజమ్‌ లువాంగ్‌! ఇంతకీ ఎవరీమె?

Updated : 30 Jun 2023 06:20 IST
‘అతిచిన్న రాష్ట్రం.. జనాభా తక్కువ’.. మణిపూర్‌ అంటే ఇదే కాదు. భిన్న సంస్కృతుల సమాహారం. నోరూరించే రుచులు, ఎన్నో కళలకు నెలవు.. ఇదే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయా లనుకుంది. తొలిసారి మిస్‌ ఇండియా ఫైనల్స్‌ వరకూ వెళ్లింది కూడా. కానీ ఆమె ఆశలు ఆవిరై.. గొడవలకు నెలవు అన్న పేరు తెచ్చుకుంది. అయినా తన ప్రయత్నం ఆపట్లేదు.. స్టెర్లా తౌనోజమ్‌ లువాంగ్‌! ఇంతకీ ఎవరీమె?
అందాల పోటీల కలను ఈశాన్య రాష్ట్రాల వాళ్లు కనరు. అందానికి నిర్వచనంగా చెప్పే మొనదేలిన ముక్కు, శరీర కొలతలు ఇక్కడివారికి ఉండవన్న భావనే ప్రపంచానిది. ఏడిపిస్తారన్న భయంతో ఆ ఆలోచనే రానివ్వరు. ‘అందమంటే నిర్ణీత కొలతలు.. మణిపూర్‌ అంటే చిన్న రాష్ట్రం మాత్రమే కాద’ని చిన్నతనంలోనే చాటాలనుకుంది స్టెర్లా. ఆమె నిర్ణయం విన్నాక తోటి వాళ్లనుంచే వెక్కిరింతలు మొదలయ్యాయి. అవి ఆమెపై తీవ్ర ప్రభావం చూపాయి. ఒత్తిడి ప్రభావం నరాలపై పడి.. తరచూ మూర్ఛలు వచ్చేవి. ఇక నా జీవితం ఇంతే అనుకుంటారెవరైనా! కానీ స్టెర్లా మాత్రం ఆత్మవిశ్వాసం పెంచుకొని దాన్నుంచి బయటపడింది.
కోరుకున్నట్టుగానే ఈ ఏడాది అందాల పోటీల్లో పాల్గొంది. మణిపూర్‌ నుంచి మిస్‌ ఇండియా ఫైనల్స్‌ వరకూ చేరినవారు ఇప్పటివరకూ లేరు. 30 మంది పోటీదారులకు గట్టిపోటీనిచ్చి సెకండ్‌ రన్నరప్‌గా నిలిచి, అందరి దృష్టీ ఆకర్షించింది స్టెర్లా. ‘కిరీటంతో స్వగ్రామం ఇంఫాల్‌లో అడుగుపెట్టగానే ఘనస్వాగతం లభిస్తుందనుకున్నా. తీరా చూస్తే ఘర్షణలు మొదలయ్యాయి. నానాటికీ పెరుగుతూ వచ్చాయి. ఈ గొడవల మధ్య మమ్మల్ని ఉంచలేక నన్ను, తమ్ముణ్ణి నాన్న చాలా కష్టపడి రాష్ట్రం దాటించారు. నాన్న ఎప్పుడైనా ఫోన్‌ చేస్తేనే వాళ్ల క్షేమసమాచారం తెలిసేది. నేనింకా విద్యార్థినినే. మోడలింగ్‌ చేస్తూ సంపాదిస్తున్నా. ఫీజులో 60 నేను, నాన్న 40% చెల్లిస్తారు. ఎలా కట్టాలో అర్థమవలేదు. సరిగా అప్పుడే నాన్న ఫోన్‌ చేస్తే విషయం చెప్పా. దగ్గర్లోని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి, అక్కడ్నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఇంటర్నెట్‌ సౌకర్యాన్నీ ఆపేశారు మరి. నిజమే మా రాష్ట్రంలో రెండు తెగల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కానీ ఇరువైపులా సాయం అవసరమైతే అవతలి వ్యక్తి తెగతో సంబంధం లేకుండా సాయం చేస్తున్నవారు ఉన్నారు. నిజాలకంటే అవాస్తవాలే ఎక్కువగా నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. అందరూ చేయి కలిపితేనే ఈ పరిస్థితిని మార్చగలం. విద్వేషాలు చెలరేగకుండా ఆపగలం. ప్రస్తుత పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. సమష్టి కృషితోనే మణిపూర్‌ అభివృద్ధి చెందుతోంది. ఈ ఘర్షణలు మళ్లీ మనం వెనకబడేలా చేస్తుంది. ఆపాల్సిన బాధ్యత మన యువతదే’ అంటూ తన ఇన్‌స్టా వేదికగా తోటివారికి సందేశాన్నిస్తోంది. ‘అడ్డంకులు మనల్ని మరింత శక్తిమంతులను చేస్తా’యని నమ్మే స్టెర్లా ఈ దశా త్వరగా ముగిసి తిరిగి రాష్ట్రంలో శాంతి నెలకొనాలని ఆశిస్తోంది. తనవంతు కృషి చేస్తోంది. తన ప్రయత్నం సఫలమవ్వాలని మనమూ కోరుకుందామా మరి?
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్