వీగన్ అందం..కోట్ల వ్యాపారం!
ఆడపిల్లలకీ, కాస్మెటిక్స్‌కీ అవినాభావ సంబంధముంది. మాయిశ్చరైజర్, ఫౌండేషన్, లిప్‌స్టిక్.. ఇలా ఎన్నెన్నో ఉపయోగిస్తాం. ఈ సౌందర్య ఉత్పత్తులన్నీ నాణ్యమైనవే ఉండాలని ఆకృతి పట్టుపట్టినప్పుడు అది సాధ్యం కాదంటూ నవ్వేరంతా.
ఆడపిల్లలకీ, కాస్మెటిక్స్‌కీ అవినాభావ సంబంధముంది. మాయిశ్చరైజర్, ఫౌండేషన్, లిప్‌స్టిక్.. ఇలా ఎన్నెన్నో ఉపయోగిస్తాం. ఈ సౌందర్య ఉత్పత్తులన్నీ నాణ్యమైనవే ఉండాలని ఆకృతి పట్టుపట్టినప్పుడు అది సాధ్యం కాదంటూ నవ్వేరంతా. కానీ ఆ విజయాన్ని సాధించి కోట్లు గడిస్తున్న ఆమె విజయ రహస్యమేంటో చూద్దాం..
ఆకృతి ప్రముఖ టీవీ ఛానల్లో పనిచేసేది. భర్త షౌనక్ చపారియా కొలువు మెక్‌కిన్సేలో. కొన్నాళ్లకి ఇద్దరూ కలిసి వ్యాపారం చేయాలనుకున్నారు. ఛానల్లో నటులు, యాంకర్లను దగ్గరగా చూసినందున ఆకృతికి సహజంగానే మేకప్ సామగ్రి పట్ల ఆసక్తి. షౌనక్‌కు కార్యనిర్వహణలో భేషైన సామర్థ్యముంది. ఇంకేం.. వీగన్ సౌందర్య ఉత్పత్తులు అందించాలనుకొని ఆన్‌లైన్ వ్యాపారం ఆరంభించారు.
జంతు ఆధారితాలు, రసాయనభరితాలు హానికరం కనుక చర్మ సంరక్షణకు ఉపయోగించేవి మొక్కలతోనే రూపొందాలని స్థిరంగా అనుకున్నారు. ఆకులు, సుమాలు, కాండం, వేరు.. ఇలా మొక్కల ఆధారంగా బ్యూటీ ప్రాడక్ట్స్ తయారుచేసే నిపుణులు ఎవరైనా దొరుకుతారేమోనని చూశారు. కానీ అలాంటివాళ్లకి మన దగ్గర కొరత ఉందని అర్థమైంది. సొంతంగా కంపెనీ నెలకొల్పడానికి ఆ కొరతే ధైర్యాన్నిచ్చింది. దాచుకున్న సొమ్ము, సమీకరించింది కలిపి 90 లక్షలు సమకూర్చుకున్నారు. అలా 2018లో ఆర్ అండ్ డి ల్యాబ్ ఆరంభించి పరిశోధనలు చేసేందుకు నిపుణులను నియమించుకున్నారు. ఏడాదికల్లా గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో ‘లా మియర్’ నెలకొల్పారు. ఫెయిర్‌నెస్ క్రీములతో ఆరంభించిన కంపెనీ ఇప్పుడు 30కి పైగా ఉత్పత్తులను రూపొందిస్తోంది. వాటితోబాటు ఎన్‌రిచ్, డాటర్ ఎర్త్, రికోడ్ స్టూడియోస్ లాంటి అనేక సెలూన్లు ఏర్పాటుచేశారు. సంవత్సరం తిరిగేసరికి పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వచ్చింది. ప్రస్తుతం రూ.4.2 కోట్ల టర్నోవర్‌తో విజయబాటలో సాగుతోంది.
లిప్‌స్టిక్, ఐ షాడో ప్యాలెట్లు, హైలైటర్, ఫిల్టర్, ఎయిర్‌బ్రష్ పౌడర్, ఫౌండేషన్, మాయిశ్చరైజర్ లాంటి అనేక సౌందర్య ఉత్పత్తులను రూపొందిస్తోంది లా మియర్. శాకాహారం, పరిశుభ్రతలే ప్రధాన సూత్రం. ప్రపంచం నలుమూలల నుంచి మూలికలను సేకరిస్తారు. హింసను వ్యతిరేకిస్తూ జంతుసంబంధితాలేవీ ఉపయోగించక పెటా సర్టిఫికెట్ కూడా పొందారు.
20కోట్ల లక్ష్యంతో..
40 శాతం రెవెన్యూ ఫెయిర్‌నెస్ సాధనాలతోనే వస్తుంది. ఈ ఏడాది ఆరంభంలో రూ.9.6 కోట్లు గడించగా సంవత్సరాంతానికి 20 కోట్లు టార్గెట్ నిర్దేశించుకున్నారు. లాభాలను తిరిగి పెట్టుబడి పెడుతూ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసేందుకు యత్నిస్తున్నారు.
‘మా బ్రాండ్‌కు ఆదరణ పెరిగింది. వీగన్ కాస్మెటిక్స్‌కు భవిష్యత్తు మరింత బాగుంటుందని నమ్ముతున్నాం. కొనుగోలు దారుల్లో ఆరోగ్యం, పర్యావరణాలపై అవగాహన పెరిగింది. అందుకే సంప్రదాయ, రసాయన రహిత ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్లో లభ్యమయ్యే సౌందర్య ఉత్పత్తుల్లో రసాయనాలు ఎక్కువగా ఉన్నందున చర్మం పాడవుతుందని భయపడు తున్నారు. మా బ్రాండ్ అందుకు ప్రత్యామ్నాయం. నూటికి నూరుశాతం సురక్షితం. ప్రపంచ దేశాలు వీగన్ సూత్రాన్ని అనుసరిస్తున్నాయి. మనకిది కొత్త. అందుకే మా ఆలోచన విన్నప్పుడు రసాయన ఉత్పత్తుల్లా ఇది సత్ఫలితాన్ని ఇవ్వదు- అనుకున్నారంతా. కానీ మా ఉత్పత్తుల గిరాకీ చూశాక వాళ్ల ఆలోచన మారింది. వీగన్ ప్రాడక్ట్స్ పట్ల కొనుగోలు దారుల్లో అవగాహన కలిగించడంతోబాటు మన జనాభా లెక్కలు, వాతావరణానికి అనుకూల మైనవి తయారుచేసే అంశమై మరింత కృషి చేస్తున్నాం. మరో ఐదేళ్లలో మా వేగన్ బ్రాండ్ లీడింగ్‌లో ఉండాలన్నదే మా ఆశయం’ అంటున్నారు ఆకృతి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.