పచ్చదనం ఆమెకో అలవాటు!

ఇంటి చుట్టూ పచ్చదనం.. వాటిమీద చేరే పక్షులు.. ఆ దారిన పోయేవారెవరూ చూపు తిప్పుకోలేనంత అందం. తెలియని వారెవరైనా ‘ఎవరిదీ ఇల్లు?’ అనకుండా ఉండలేరు కూడా! అలా ఇంటిచుట్టూ పచ్చదనాన్ని సృష్టించింది షిఫా.

Updated : 04 Jul 2023 05:15 IST

ఇంటి చుట్టూ పచ్చదనం.. వాటిమీద చేరే పక్షులు.. ఆ దారిన పోయేవారెవరూ చూపు తిప్పుకోలేనంత అందం. తెలియని వారెవరైనా ‘ఎవరిదీ ఇల్లు?’ అనకుండా ఉండలేరు కూడా! అలా ఇంటిచుట్టూ పచ్చదనాన్ని సృష్టించింది షిఫా. ఆ పరిజ్ఞానాన్ని ఒక్కదాన్నే ఉపయోగించుకుంటే ఎలా? నలుగురితో పంచుకుందామని ఆమె చేసిన ప్రయత్నం లక్షలమంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ఇంతకీ ఆమెవరంటే..?

‘చెట్ల పెంపకం చాలామందికి వ్యాపకం. నాకు మాత్రం అలవాటు’ అంటుంది షిఫా మరియం. కొత్త ప్రదేశానికి వెళితే గుర్తుగా ఏదోక వస్తువు తెచ్చుకుంటాం. తనుమాత్రం మొక్కను ఎంచుకుంటుంది. ప్రత్యేక రకాలు, వాటి పెంపకం గురించి తెలుసుకుంటుంది. వాటన్నింటినీ ఇంట్లో, పెరట్లో ముచ్చటగా అమరుస్తుంది. అలాగని బాగా ఖర్చేమీ పెట్టదు. తక్కువ మొత్తంతో మొక్కల్నిలా తీర్చిదిద్దుతుంది. ఈ చిట్కాలను నలుగురితో పంచుకుంటే ఆసక్తి ఉన్నవాళ్లూ ప్రయత్నిస్తారు కదా అన్నది షిఫా ఉద్దేశం. ఈమెది కేరళలోని తిరూర్‌. పీజీ పూర్తి చేసింది. పచ్చదనంపై ఆసక్తికి తన కుటుంబమే కారణమంటుందీమె. షిఫా వాళ్ల బామ్మకి గార్డెనింగ్‌ అంటే ఆసక్తి. ఆవిడ ప్రోత్సాహంతో చిన్నతనంలో ఓ మెుక్కను నాటింది. అది అలా ఆరోగ్యంగా పెరుగుతోంటే షిఫాకి చాలా ఆనందంగా ఉండేది. రోజూ నీళ్లు పోయడం, ఆ మొక్క బాగోగులు చూసుకోవడం అన్నీ తనే చేసేది. ఒకటి మరొకటి అంటూ నాటుకుంటూ వెళ్లింది. అలా వ్యాపకంగా మొదలై మొక్కల పెంపకాన్నో అలవాటుగా చేసుకుంది. ఇంటి చుట్టూ ఉండే చిన్నపాటి అడవి కూడా మొక్కలపై ప్రేమకు కారణమే అంటుంది తను.

పూలు, ఔషధాలు, ఇండోర్‌, ఎడారి, పండ్ల మొక్కలు.. ఇలా ఆమె తోటలో లేనివే లేవు. ‘ఎంత ఖర్చు పెట్టినా చనిపోతున్నాయి. నువ్వెలా పెంచగలుగుతున్నావ్‌?’ అన్న ప్రశ్న తెలిసిన వారి నుంచి ఎన్నోసార్లు వింది షిఫా. అప్పుడే తన పరిజ్ఞానాన్ని ఇతరులతోనూ పంచుకోవచ్చని తన యూట్యూబ్‌ ఖాతా ‘బొటానికల్‌ విమెన్‌’లో 2020 నుంచి వీడియోలు పెట్టడం మొదలుపెట్టింది. మొక్కల రకాలు, జాగ్రత్తలు, సలహాలు, పనికిరాని వస్తువులను కుండీలుగా మలచడం వంటివి చెబుతోంది. పాండ్‌ గార్డెన్‌, వేలాడే మొక్కలు, వృథానే కుండీలుగా మలిచే వీడియోలకు లక్షల్లో వీక్షణలొచ్చాయి. ‘తొలి వీడియో ఇండోర్‌ మొక్కలపై చేశా. పెద్దగా వ్యూస్‌ రాకపోయేసరికి నిరాశ చెందా. కానీ ‘ఇవి అందరికీ తెలిసినవే! నువ్వు కొత్తగా చెప్పిందేముంది’ అన్న కామెంట్‌ నన్ను ఆకర్షించింది. తర్వాత నుంచి పంథా మార్చా’ననే షిఫా కొద్దిరోజుల్లోనే లక్షల్లో సబ్‌స్క్రైబర్లను సంపాదించుకుంది. భిన్నరకాల మొక్కల పెంపకం, పర్యావరణ హితానికి ప్రాధాన్యమిచ్చే ఆమె సలహాలకు అభిమానులెక్కువ. ప్రస్తుతం ఉన్నతచదువుల కోసం చెక్‌ రిపబ్లిక్‌కి వెళ్లింది షిఫా. అక్కడి విశేషాలను పంచుకుంటోన్న తనకు పచ్చదనం సృష్టించడమే లక్ష్యమట.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్