ఆడవాళ్ల కోసమే.. ఆమె బ్రాండ్!
అమ్మాయిలంటే నిర్ణీత కొలతలేనా? అంతకన్నా ఎక్కువ బరువుంటే ఎందుకు సిగ్గుపడాలి? శరీరాన్ని కష్టపెడుతూ తిండి, వ్యాయామమంటూ గడిపేస్తుంటారు.
అమ్మాయిలంటే నిర్ణీత కొలతలేనా? అంతకన్నా ఎక్కువ బరువుంటే ఎందుకు సిగ్గుపడాలి? శరీరాన్ని కష్టపెడుతూ తిండి, వ్యాయామమంటూ గడిపేస్తుంటారు. పోనీ వాళ్లకి తగ్గ దుస్తులైనా ఉండాలిగా! ఇక్కడా బరువు, ఎత్తు సమస్యే! దీనికి పరిష్కారం చెప్పాలను కుంది జీవిక.. ఇంతకీ ఆమెవరంటే..
వాల్‌స్ట్రీట్‌లో బ్యాంకర్.. జేపీమోర్గాన్, జీ, ప్రముఖ టెక్ సంస్థల్లో ఫైనాన్స్, మార్కెటింగ్ విభాగాల్లో పనిచేసిన అనుభవం జీవిక త్యాగిది. 9-5 గం. ఉద్యోగం ఆమెకు బోర్ కొట్టేసింది. లాక్‌డౌన్‌లో నిరంతరం భయం.. అది తగ్గుముఖం పట్టాక వ్యాయామాలంటూ అమ్మాయిలు పడే పాట్లు ఆమెను ‘ఆస్తే’ ప్రారంభించేలా చేశాయి. జీవికది ముంబయి. కంప్యూటర్‌సైన్స్‌లో డిగ్రీ, ఎంబీఏ చేసింది. కానీ తనకి వ్యాపారమన్నా ఆసక్తే! చదువు పూర్తవగానే, ఓపక్క ఉద్యోగం చేస్తూనే ‘స్టాపూ’, ‘ఆల్ ఆయుర్వేద’, ‘యూనిఫైండ్’, ‘ఉషర్‌బే ప్రొడక్షన్’.. ఇలా ఎన్నో సంస్థలను ప్రారంభించింది. మార్కెటింగ్, ఫైనాన్స్, టెక్నాలజీ.. వివిధ విభాగాల్లో పనిచేసింది.
‘లాక్‌డౌన్‌లో అందరూ ఆరోగ్యకరమైన ఆహారంపై చాలా దృష్టిపెట్టారు. వ్యాయామాన్ని పక్కన పెట్టేశారు. నేనూ అంతే. పరిస్థితి సద్దుమణిగాక బరువు పెరిగానే అన్న ఆలోచన. జిమ్ చుట్టూ పరుగులు మొదలుపెట్టా. కాస్త బరువు పెరిగితేనే వ్యాయామానికి అనుకూలమైన దుస్తులు దొరకలేదు. అయినా ‘ఈ కొలతలే అందానికీ, ఫిట్‌నెస్‌కీ ఎందుకు చిహ్నాలవ్వాల’న్న ప్రశ్న ఎదురయ్యాక దానికి మార్గం కనిపెట్టాలనిపించి 2020లో స్నేహితురాలితో కలిసి ‘ఆస్తే’ మొదలుపెట్టా’నంటుంది జీవిక. ఇదో సస్టెయినబుల్ అథ్లెటిక్ వేర్.
‘కొవిడ్‌లో అందరికీ విరామం దొరికినా క్షణం తీరికలేకుండా గడిపింది మన ఆడవాళ్లే. పనుల్లోపడి వాళ్ల గురించి వాళ్లు పట్టించుకోవడమే మానేశారు. దీనికితోడు ఒత్తిడి, అలసట. అలాంటివాళ్లను అందంగా లేవు, లావు పెరిగావు వంటి మాటలు ఎంత బాధించాయో.. ఏమాత్రం లావున్నా ఫ్యాషన్ అన్న పదాన్ని పక్కన పెట్టేయాల్సిందే. అందుకే లీజర్, అథ్లెట్‌వేర్‌ల్లో అన్ని సైజుల వారికీ దుస్తులు అందుబాటులోకి తెచ్చాం. మా ఒక్క ఉత్పత్తి రీసైక్లింగ్ చేసిన 25 చెత్త బ్యాగులతో సమానం. ఫ్యాషన్ కారణంగా అయ్యే నీటి వృథా, పర్యావరణ హాని తగ్గించడానికి జీరో వేస్ట్ పద్ధతిలో ఈ దుస్తులను రూపొందిస్తున్నాం. ఆర్గానిక్ కాటన్, రీసైకిల్డ్ పాలిస్టర్ వంటి వాటిని ఇందుకు వినియోగిస్తున్నా’మనే జీవిక వీటికి ఇన్‌స్టా ద్వారా ప్రచారం కల్పించింది. వీటిని అభిమానించినవారిలో బాలీవుడ్ తారలు, ఆంత్రప్రెన్యూర్స్ కూడా ఉన్నారు. అందుకే ఆరంభించిన ఆరునెలల్లోనే రూ.కోటి వ్యాపారం చేయగలిగింది. ఏడాదిలోగా 60వేలమంది వినియోగదారులయ్యారు. ఎన్నో సంస్థలు ఆస్తేలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ‘లైవ్ ఆస్తే’ పేరుతో మానసిక సమస్యలపైనా అవగాహన కల్పిస్తోంది. అన్నట్టూ తన సంస్థ ..నిర్వహించేదీ మహిళలే. ఇంకా ఇతర స్టార్టప్‌ల్లో పెట్టడమే కాదు.. ఎన్నింటికో ఈమె మెంటార్ కూడా! ‘ఉన్నది ఒక్కటే జీవితం.. చిన్నచిన్న ఆనందాల్ని అనుభవించాలి. చేయాలనుకున్నవన్నీ ప్రయత్నించాలి. నలుగురికీ సాయపడాలి. నేను చేస్తున్నదదే’నంటోంది.
ఆహ్వానం
వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.