ఆటోమొబైల్ రంగమా! ‘తగ్గేదేలే’
సామాజిక పరిస్థితులో, శారీరక బలం సరిపోదన్న అపోహో కానీ... మహిళల్ని కొన్ని రంగాల్లో అడుగుపెట్టనివ్వని అప్రకటిత నిషేధం సాగుతుంటుంది. అలాంటి వాటిల్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా ఒకటి.
సామాజిక పరిస్థితులో, శారీరక బలం సరిపోదన్న అపోహో కానీ... మహిళల్ని కొన్ని రంగాల్లో అడుగుపెట్టనివ్వని అప్రకటిత నిషేధం సాగుతుంటుంది. అలాంటి వాటిల్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా ఒకటి. ఇప్పుడు ఇందులో స్త్రీలు అడుగుపెట్టడమే కాదు... అద్భుతాల్నీ సృష్టిస్తున్నారు. వారి ప్రతిభను గుర్తించిన దిగ్గజ వాహన తయారీ సంస్థలు... అమ్మాయిల్ని కొలువుల్లోకి ఆహ్వానిస్తున్నాయి. మరి ఆ ఘనతేంటో తెలుసుకుందామా!
ఉత్పాదకతను పెంచేందుకే...
టాటా మోటార్స్
టాటా మోటార్స్‌కు చెందిన ఆరు తయారీ ప్లాంట్లలోని షాప్ ఫ్లోర్‌లలో సుమారు 4500 మంది మహిళలు పనిచేస్తున్నారు. చిన్న కార్ల నుంచి వాణిజ్య వాహనాల తయారీ వరకు వివిధ హోదాల్లో వీరు సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా టాటా మోటార్స్ పుణె ప్యాసింజర్ వాహన ప్లాంట్‌లో గత రెండేళ్లలోనే మహిళా కార్మికుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. ఇందులో 1500 మందికిపైగా హారియర్, సఫారీ వంటి ప్రసిద్ధ ఎస్‌యూవీల తయారీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ‘కొత్త నియామకాల్లో ఇరవై ఐదు శాతం మంది మహిళలే. సమాన అవకాశాలు కల్పించి, పని ప్రదేశంలో లింగ సమతుల్యత సాధించడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవాలనుకుంటున్నాం. ఈ మెరుగైన నిర్ణయాలు స్త్రీల జీవితాలపై సానుకూల ప్రభావం చూపిస్తాయని నమ్ముతున్నాం’ అని చెబుతున్నారు ఆ సంస్థ ఉన్నతాధికారులు.
కీలక స్థానాలన్నింటిలోనూ..
మహీంద్రా అండ్ మహీంద్రా
స్వదేశీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్‌ఎం)మాన్యు ఫ్యాక్చరింగ్ యూనిట్లలో మహిళా ఉద్యోగుల సంఖ్య గతేడాది కంటే మూడు రెట్లు పెరిగి ప్రస్తుతం 1202కు చేరుకుంది. వెల్డింగ్, రోబోటిక్స్ లోడ్ లోడింగ్, వెహికల్ అసెంబ్లింగ్, మెషిన్ షాప్ వరకు అన్ని కీలకమైన పనుల్లోనూ మహిళలకు స్థానం కల్పించింది. ఇందుకోసం 25కిపైగా పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ)ల నుంచి ఉద్యోగులను ఎంచుకుంటుంది. వాటిల్లో ఎనిమిది గిరిజన ప్రాంతంలో ఉన్న మహిళా ఐటీఐలు కావడం విశేషం.
యాభై శాతానికి చేర్చడమే లక్ష్యం
ఎంజీ మోటార్ ఇండియా
ఎంజీ మోటార్ ఇండియా అయితే స్త్రీ, పురుషులు సమానమేనని చాటే విధంగా 2023 డిసెంబర్ నాటికి తన మొత్తం ఫ్యాక్టరీ సిబ్బందిలో మహిళల వాటాను 50 శాతానికి చేర్చాలన్న లక్ష్యంగా నడుస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో మొత్తం 2,000 మంది పనిచేస్తున్నారు. తయారీలో కీలకమైన పెయింట్ నాణ్యత, సర్ఫేస్ టెస్టింగ్, పరిశోధన, అభివృద్ధి, అసెంబ్లింగ్ వంటి బాధ్యతల్ని వీరే నిర్వహిస్తున్నారు.
అందుకోసమే తేజశ్విని...
హీరో మోటోకార్ప్
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హీరో మోటోకార్ప్’లో ప్రస్తుతం 1,500 మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2021-22 నాటికి లింగ సమానత్వ నిష్పత్తి 9.3 శాతం. అంతేకాదు... ‘తేజశ్విని’ పేరుతో మహిళా సిబ్బందిని పెంచుకునేందుకు ప్రత్యేక ప్రాజెక్టునూ తీసుకొచ్చిందీ సంస్థ. దీనిద్వారా రిక్రూట్‌మెంట్లు, విద్య, శిక్షణ, మార్గదర్శక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
వారిని చూశాకే ఆ ఆలోచన...
అశోక్ లేలాండ్
వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ ఏడు వేర్వేరు తయారీ కర్మాగారాల్లో 991 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. హోసూర్ ప్లాంట్‌లో 120 మంది మహిళలతో ఓ విభాగాన్నే ఏర్పాటు చేసింది. వీరంతా ఒక షిప్టులో 120 ఇంజిన్లను తయారు చేస్తారు. లేలాండ్‌కు చెందిన పంత్‌నగర్ ప్లాంట్‌లో ట్రక్‌ల అసెంబ్లింగ్‌లో పనిచేసే మహిళా ఎగ్జిక్యూటివ్‌లు నాయకత్వ స్థానాల్లో ఉన్నారు. ఇక్కడ వీరి పురోగతి చూశాకే... ఇంజిన్ల తయారీకోసం మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చిందంటారు ఆ సంస్థ ప్రతినిధులు.
అప్పటి కల సాకారమైంది...
బజాజ్ ఆటో చకాన్
బజాజ్ ఆటో చకాన్ ప్లాంట్‌లో డోమినార్ 400, ఆర్‌ఎస్ 200 తయారీకి ప్రత్యేకంగా మహిళలనే వినియోగిస్తోంది. 2012-14 నాటికి 148 మందిగా ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య 2021-22 నాటికి 667కు పెరిగింది. ఆటోమొబైల్ పరిశ్రమలో మహిళా టెక్నీషియన్లు, ఇంజనీర్లు పనిచేయడం అనేది కలేనేమో అనుకున్నారంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు కొన్ని విభాగాలే మొత్తం మహిళలతో నడుస్తున్నాయి. ఈ మార్పు చాలదా.... మహిళా సాధికారత దిశగా వారి అడుగులు పడుతున్నాయని.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.