ఊరిని దిద్దిన ప్రేమ!

సొంతూరికి ఎంత చేసినా తక్కువే.. రామగిరి లావణ్య కూడా ఊరి బాగు కోసం అందుకే ముందుకొచ్చింది.. సామాన్యురాలే అయినా ప్రజల సమస్యలు తీరుస్తూ వాళ్ల మనసు దోచుకుంది.

Updated : 07 Jul 2023 04:46 IST

సొంతూరికి ఎంత చేసినా తక్కువే.. రామగిరి లావణ్య కూడా ఊరి బాగు కోసం అందుకే ముందుకొచ్చింది.. సామాన్యురాలే అయినా ప్రజల సమస్యలు తీరుస్తూ వాళ్ల మనసు దోచుకుంది. సర్పంచ్‌గా మారాక ఆ ఒరవడిని కొనసాగించింది. ఈ కృషికి తాజాగా అంతర్జాతీయ మహిళా పార్లమెంట్‌ పురస్కారం అందుకుంది..

మాది పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ముత్యాల గ్రామం. 500 గడపలున్న ఊరు. మేం ఆరుగురు పిల్లలం. నా పదకొండేళ్ల వయసులోనే నాన్న చనిపోతే అమ్మ కూలి చేసి మమ్మల్ని పెంచింది. పదో తరగతి చదివా. చిన్నప్పటి నుంచీ నాకు తెలిసిన నాగరాజుని ప్రేమించా. విషయం తెలిసి మా రెండు కుటుంబాల వాళ్లూ మందలించారు. ఆ తర్వాత మనసు మార్చుకుని వాళ్లే మా పెళ్లి జరిపించారు. మా ఇద్దరిదీ ఒకే ఊరు కాబట్టి అక్కడి సమస్యలపై అవగాహన ఉండేది. అవి పరిష్కరించే క్రమంలో ఆ ఊరికే దూరం కావాల్సి వచ్చింది. పెళ్లైన మూడునెలలకే గ్రామం వదిలి దగ్గర్లోని గోదావరిఖనికి వెళ్లిపోయాం. పుట్టి పెరిగిన ప్రాంతాన్ని వదిలి వెళ్లడం చాలా బాధనిపించింది. 

పరిష్కరిస్తూ..

చేతిలో పైసా లేకుండా బయటికెళ్లిన మేం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. దొరికిన చిన్నాచితకా పనులు చేశాం. పాప పుట్టిన తర్వాత ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయి. మావారు ఒక ప్రైవేటు సంస్థలో సూపర్‌వైజర్‌గా కుదురుకున్నారు. కాస్త ఫర్వాలేదు అనుకున్న తర్వాత.... పుట్టి పెరిగిన మా గ్రామానికి మా వంతు సేవ చేయాలనుకున్నాం. గోదావరిఖనిలోనే ఉంటూ ముత్యాల గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేవాళ్లం. తాగునీటి సదుపాయం అందించాం. అదే సమయంలో.. స్థానిక ఎన్నికలు వచ్చాయి. 2019లో ప్రజలు నన్ను సర్పంచిగా ఎన్నుకున్నారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టేందుకు... ఇంకా ఏదో చేయాలనిపించింది. ఇంటింటికీ తిరిగి పిల్లలను బడుల్లో చేర్చా. సౌరశక్తితో పనిచేసే వీధిలైట్లు వేయించా. డ్రైనేజీ సమస్యను పరిష్కరించి.. రోడ్లు వేయించా. గ్రామ మహిళలందరూ ఏ సమస్య వచ్చినా సమావేశమై, చర్చించుకోవడానికి వీలుగా ఓ భవనాన్ని నిర్మించాం. కూలి పనుల మీదనే ఆధారపడకుండా... టైలరింగ్‌, చేనేత వంటివాటిల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి పొందేలా చేశా.

కొవిడ్‌లో..

లాక్‌డౌన్‌ సమయంలో గోదావరిఖని వెళ్లి రేషన్‌ తీసుకొనే అవకాశం లేక గ్రామస్థులు పస్తులున్నప్పుడు నావంతుగా ముందడుగు వేశా. ప్రత్యేక కమిటీని వేసి సరకులను గ్రామానికి రప్పించి .. గడప గడపకీ స్వయంగా వాటిని పంపిణీ చేశా. ఉపాధి లేనివారికి మూడు నెలలపాటు నేనే వంటచేసి అన్నదానం చేశా. ఇప్పుడు ప్రతి బుధవారం పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అరటిపండ్లు అందిస్తున్నాం. ముత్యాలలోని రెండు పాఠశాలలు, రెండు అంగన్‌వాడీలు, సమీపంలోని సుందిళ్ల గ్రామంలో 4 పాఠశాలలు, 5 అంగన్‌వాడీ కేంద్రాలలోని విద్యార్థులకూ వీటిని అందేలా చేస్తున్నాం. మా ఊరిలో నా చిన్నప్పటి నుంచీ తగాదాలెక్కువ. వాటిని నియంత్రించడానికి.. కౌన్సెలింగ్‌ నిర్వహించడం మొదలుపెట్టా. క్రీడాపోటీలు నిర్వహించడంతో ఇప్పుడు కేసులు తగ్గి, గ్రామాభివృద్ధిలో యువత పాలుపంచుకుంటున్నారు. పిల్లలకు మన జాతి గొప్పదనం తెలియాలని సమరయోధుల జయంతి, వర్ధంతులను జరుపుతుంటాం. ‘ఇవన్నీ మీకెందుకు... మీరు చేయలేరంటూ’ నిరుత్సాహ పరుస్తుంటారు. కానీ ప్రయత్నం చేస్తే ఏదీ అసాధ్యం కాదనుకుంటా. అందుకే ఆయనతో కలిసి అడుగు ముందుకు వేస్తున్నా. ఈ అవార్డుని అందుకోవడానికి 46 దేశాల నుంచి మహిళా ప్రతినిధులు వచ్చారు.  నా కృషికి మొదటిసారి 2020లో ఇందౌర్‌లో రాష్ట్ర ప్రేరణ అవార్డుని అందుకున్నా. అక్కడ నుంచి పలు సామాజిక సంస్థల నుంచి ఎన్నో పురస్కారాలు వరించాయి. అవన్నీ గ్రామ ప్రజలకే అంకితమిస్తున్నా. ఇప్పుడు దిల్లీలో అంతర్జాతీయ మహిళా పార్లమెంట్‌ పురస్కారం అందుకోవడం.. అలా మా ఊరి పేరు అందరికీ తెలియడం సంతోషంగా ఉంది. ఈ ఉత్సాహంతో మా గ్రామాన్ని ఇంకా ముందుకు నడిపించాలని ఉంది.

- బోల్లబత్తుల రాజేందర్‌, పెద్దపల్లి


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని