నా మాట వినడానికీ ఇష్టపడలేదు

అమ్మానాన్నల ప్రేమ తెలియకుండా పెరిగింది... ఒంటరితనంతో సావాసం చేసింది... మంచి చెడులు చెప్పేవారు, భవిష్యత్తుకి మార్గనిర్దేశనం చేసేవారు లేకపోయినా... ఆత్మస్థైర్యంతో అడుగులేసింది.

Updated : 07 Jul 2023 05:11 IST

అమ్మానాన్నల ప్రేమ తెలియకుండా పెరిగింది... ఒంటరితనంతో సావాసం చేసింది... మంచి చెడులు చెప్పేవారు, భవిష్యత్తుకి మార్గనిర్దేశనం చేసేవారు లేకపోయినా... ఆత్మస్థైర్యంతో అడుగులేసింది. రోడ్లూ, భవనాల నిర్మాణంలో అడుగుపెట్టి లద్దాఖ్‌లో మొదటి మహిళా కాంట్రాక్టర్‌గా నిలదొక్కుకుంది. మగవారితో పోటీపడలేవన్న వారితోనే శెభాష్‌ అనిపించుకుంటోంది జిగ్మెట్‌ నార్జోమ్‌.

ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఇలా ఎవరో ఒకరు విజయానికి మార్గం చూపే వారు ఉంటారు. ‘జిగ్మెట్‌ నార్జోమ్‌’ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నం. పసిపిల్లగా ఉన్న ఆమె ఆలనా పాలనా చూసుకోవాల్సిన తల్లిదండ్రులు... మనస్పర్థలతో తరచూ గొడవలు పడి విడాకులు తీసుకుని చెరో దారీ చూసుకున్నారు. ఆ పరిస్థితుల్లో తాతయ్యే ఆమెను దగ్గరకు తీశాడు. ‘తాతయ్య బాగానే చూసేవారు. కానీ  అమ్మానాన్నలు లేని లోటుతో ఒంటరితనం బాధించేది. దాన్నుంచి బయటపడటం కోసం అన్ని పనులూ స్వతంత్రంగా చేయడం అలవాటు చేసుకున్నా. జమ్మూ యూనివర్సిటీలో చదువయ్యాక రెండేళ్ల పాటు ఓ ఎన్జీవోలో పనిచేశా. ఆపై మరో కెరియర్‌ని ఎంచుకునే విషయంలో ఎన్నో సందేహాలు. అప్పుడే నాకీ ఆలోచన వచ్చింది’ అంటారామె.

ఆ డబ్బులతోనే...

జిగ్మెట్‌ కెరియర్‌ ఎంపిక విషయంలో ఊగిసలాడుతున్న సమయంలోనే స్థానిక ప్రభుత్వం రోడ్లు వేయడానికో కాంట్రాక్టర్‌ కావాలంటూ ప్రకటన ఇచ్చింది. అమ్మాయిలు ఉద్యోగం చేసే విషయంలో ఇప్పటికీ బోలెడు ఆంక్షలు ఉన్న ప్రాంతం నుంచి వచ్చింది తను. పైగా పురుషాధిక్యత గల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలనుకోవడం పెద్ద సాహసమే. అయినా సరే, తానెందుకు ప్రయత్నించకూడదనుకుని అడుగేసింది. మొదట ఈ అవకాశం ఇవ్వడానికి అధికారులు తటపటాయించినా... ఆత్మవిశ్వాసంతో జిగ్మెట్‌ చెబుతోన్న మాటలు ఆమెపై నమ్మకాన్ని పెంచాయి. తన పెళ్లి, భవిష్యత్తు కోసం తాత దాచిన మూడు లక్షల రూపాయల పెట్టుబడితో ఈ వృత్తిలోకి అడుగుపెట్టింది. ‘మొదట్లో నా దగ్గర పనిచేసేవారు కూడా మహిళనని గౌరవ మర్యాదలు ఇచ్చేవారు కాదు. కొందరైతే నేనేం చెబుతున్నానో కూడా వినడానికి ఆసక్తి చూపించేవారు కాదు. నెమ్మదిగా ఈ పనికి అవసరమైన మెటీరియల్స్‌, మిక్సింగ్‌, నాణ్యత, నిర్మాణం.. ఇలా ప్రతి విషయంపైనా పూర్తి అవగాహన తెచ్చుకున్నా. తర్వాత నా పనితీరుని దగ్గరగా గమనించిన కొందరు కార్మికులూ, వ్యక్తుల్లో మార్పు మొదలైంది. నేనీ బాధ్యతల్లో చేరిన రెండేళ్లలోనే తాగునీటి కాలువల నిర్మాణం, పాఠశాలల పునర్నిర్మాణం, రోడ్లు వేయడం వంటివి సుమారు పది ప్రాజెక్టులను పూర్తి చేశా. ఇవన్నీ మా స్వస్థలానికి ముప్ఫై నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో చుట్టుపక్కల అందరికీ నా గురించి తెలిసింది. ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఆడపిల్లలకు నన్ను స్ఫూర్తిగా చూపిస్తున్నారు. ఆడపిల్లలందరికీ నేనొకటి చెప్పాలనుకుంటున్నా...

‘మన మీద మనం నమ్మకం కోల్పోకుండా ఉంటే చాలు... జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయగలం. నీవల్ల కాదన్నప్పుడు నిరూపించుకుంటేనే మనమంటే ఏంటో తెలుస్తుంది. ఓసారి ప్రయత్నించి చూడండి’

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్