ఎడారి జీవితాల్లో.. ఒంటె పాల వెల్లువ

ఎడారి ప్రాంతంలో నివసించే పశుపోషకుల జీవితాల్లో రంగులు పూయిస్తోందీమె. ఒంటె, ఆవుపాల ఉత్పత్తుల తయారీతో మహిళా సాధికారతను కల్పిస్తోంది.

Updated : 11 Jul 2023 04:24 IST

ఎడారి ప్రాంతంలో నివసించే పశుపోషకుల జీవితాల్లో రంగులు పూయిస్తోందీమె. ఒంటె, ఆవుపాల ఉత్పత్తుల తయారీతో మహిళా సాధికారతను కల్పిస్తోంది. రాజస్థాన్‌ నుంచి దేశమంతా పాల ఉత్పత్తులను విక్రయిస్తూ.. వేలమందికి  ఉపాధినందిస్తున్న 27 ఏళ్ల ఆకృతి శ్రీవాస్తవ స్ఫూర్తి కథనమిది..

ధ్యతరగతి కుటుంబంలో పుట్టింది ఆకృతి. దిల్లీకి చెందిన ఈమె గురు గోవింద్‌సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్శిటీలో డిగ్రీ చేసింది. పర్యాటకమంటే ఆసక్తితో థార్‌ ఎడారిలోని పశువులు, ఒంటెల పోషకులపై డాక్యుమెంటరీ తీసింది. మొదట ఇండియా-పాకిస్థాన్‌ సరిహద్దులోని బిజ్జు గ్రామానికెళ్లిన ఈమె అక్కడివారి జీవనశైలిని రికార్డు చేయడం మొదలుపెట్టి, రాజస్థాన్‌లోని బికనీర్‌ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగింది. వారి జీవన విధానం, సంప్రదాయాలు ఆకర్షించడంతో డాక్యుమెంటరీ తీస్తూ మూడేళ్లపాటు అక్కడే ఉంది. అప్పుడే ఒంటెపాల విశిష్టత తెలుసుకుంది. ఆరోగ్యపరిరక్షణలో ఉపయోగపడే ఈ పాలతో ఉత్పత్తులు చేయాలనుకుంది.

ససేమిరా..

ఆ ఎడారిలోని పశుపోషకులతో మాట్లాడుతూ.. వారికెదురయ్యే కష్టాలనూ తెలుసుకొనేది. ‘ వారందరికీ ఉపాధి కల్పించాలనుకున్నా. పాల  డెయిరీ ప్రారంభించి ఉత్పత్తులు తయారుచేయడానికి పాలను విక్రయించమని అడిగా. దానికెవరూ ఒప్పుకోలేదు. ఒంటెపాలను అమ్మడమంటే వారి సంప్రదాయానికి విరుద్ధమని కనుమరుగుతున్న ఒంటె జాతిని పరిరక్షించాలనేవారు. ఆ అపోహను దూరం చేయడానికి జోధ్‌పుర్‌, బికనీర్‌, జైసల్మేర్‌ తిరిగా. 4వేలమందికిపైగా పశుపోషకులను కలుసుకొన్నా. పాలను విక్రయించడంవల్ల వాటి సంరక్షణకు ఎటువంటి లోటు ఉండదనే అవగాహన కలిగించడానికి రెండేళ్లు పట్టింది. చివరికి ఒప్పుకొన్నారంటుం’ది ఆకృతి. 

సేకరించి...

2021లో ఆకృతి ‘బహుళా నేచురల్‌’ అగ్రి డెయిరీ సంస్థ ప్రారంభించిందీమె. ఉత్పత్తుల తయారీ కోసం పాల సేకరణ కోసం 7వేల లీటర్ల సామర్థ్యం ఉన్న పాల కేంద్రాన్ని నిర్మించిందీమె. పాలను భద్రపరచడానికి బికనీర్‌, జోధ్‌పుర్‌లలో 500 లీటర్ల సామర్థ్యం ఉండేలా 8 ఇన్‌స్టెంట్‌ మిల్క్‌ చిల్లర్స్‌ ఏర్పాటు చేసింది. రోజుకి 2వేల లీటర్ల ఆవుపాలు, 200 లీటర్ల ఒంటెపాలను సేకరిస్తోందిప్పుడు.

పర్యావరణహితంగా...

జీరో కార్బన్‌ ఉత్పత్తుల తయారీకే ప్రాధాన్యతనిచ్చింది ఆకృతి. ‘దీని కోసం సౌరశక్తిని వినియోగిస్తున్నాం. ఒంటెలకు ఆహార కొరత రాకుండా హైడ్రోఫోనిక్స్‌ పద్ధతిలో గడ్డి పెంచడానికి రైతులకు శిక్షణనిప్పించా. రోజుకి 3 నుంచి 4 టన్నుల గడ్డిని పశువులు, గొర్రెలు, మేకలకు పంపిణీ చేయగలుగుతున్నాం. పశు వ్యర్థాలను వృథా చేయకుండా బికనీర్‌, జోధ్‌పుర్‌ల్లో 55 బయోగ్యాస్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు చేశాం. వీటి నిర్మాణంలో ఐసీఐసీఐ ఫౌండేషన్‌, అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ సహకారం ఉంది. పలు ఎన్జీవోలు, ప్రభుత్వసంస్థలు కూడా  భాగస్వాములుగా ఉంటూ.. రూ.4 కోట్లు పెట్టుబడిని మాకు సమకూర్చాయి. ఒంటె పాలవల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలెన్నో ఉన్నాయి. తల్లిపాలు సరిపోని శిశువులకు, పాలవల్ల అలర్జీలొచ్చేవారికి వైద్యులు ఈ పాలనే సిఫారసు చేస్తారు. రక్తంలో చక్కెర స్థాయులు తక్కువ ఉన్నవారికి, వ్యాధినిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడతాయ ’ని చెబుతోంది ఆకృతి.

దేశవ్యాప్తంగా...

ఒంటెపాల వెన్న, మజ్జిగ, నెయ్యి, పెరుగు వంటి ఉత్పత్తులను బికనీర్‌లోని రిటైల్‌ అవుట్‌లెట్స్‌ ద్వారా ఆకృతి విక్రయిస్తోంది. ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా రాష్ట్రేతర ప్రాంతాలకూ బిస్కట్లు, ఆర్టిసనల్‌ చీజ్‌, ఫెటా చీజ్‌ వంటివీ పంపిణీ చేస్తోంది. ఆర్నెల్లు నిల్వ ఉండే చీజ్‌ను దిల్లీ, గోవా, ముంబయి నగరాలకు స్టార్‌ హోటల్స్‌కు అందిస్తోంది. వెయ్యిమంది రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కలిగించి నల్లగోధుమను పండించేలా చేస్తోంది. గ్లూటెన్‌ ఫ్రీ కావడంతో మార్కెట్‌లో దీనికీ గిరాకీ ఎక్కువంటోం’ది ఆకృతి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్