మా ఇళ్లల్లో అన్నం కూడా తినరు!

ఆ నలుగురినీ.. బంధువులు వెలివేశారు. శుభకార్యాలకు పిలవాలంటే వెనకాడతారు. వాళ్లూ అంతే.. బంధువులకన్నా అనాథ శవాల సేవే ఎక్కువనుకుంటున్నారు... అందుకోసం దేనికీ వెనకాడలేదు మధుస్మిత బృందం.

Updated : 12 Jul 2023 08:08 IST

ఆ నలుగురినీ.. బంధువులు వెలివేశారు. శుభకార్యాలకు పిలవాలంటే వెనకాడతారు. వాళ్లూ అంతే.. బంధువులకన్నా అనాథ శవాల సేవే ఎక్కువనుకుంటున్నారు... అందుకోసం దేనికీ వెనకాడలేదు మధుస్మిత బృందం. మొన్నటి ఒడిశా ఘోర రైలు ప్రమాదం తర్వాతే వాళ్ల సేవాగుణం గురించి ప్రపంచానికి తెలిసింది... 

శ్మశానంలోకి ఆడవాళ్లు అడుగు పెట్టకూడదని పెద్దలు వారించినా భువనేశ్వర్‌కు చెందిన ఆ నలుగురు స్నేహితురాళ్లు... మధుస్మిత, స్వాగతిక, స్మితా మహంతి, స్నేహాంజలిలు ఆ మాటలకు పెద్దగా విలువనివ్వలేదు. పుట్టుక ఎంత సంబరంగా మొదలవుతుందో నిష్క్రమణం కూడా అంతే  గౌరవంగా ఉండాలంటారు వీళ్లు. అందుకే అనాథ శవాలకీ ఆ గౌరవం కల్పిస్తున్నారు. వాళ్ల జీవితాల్లోని విషాదమే ఈ ఆలోచనకు ప్రాణం పోసింది..

కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేది మధుస్మిత. భర్తకూ సేవాగుణం ఎక్కువే. ‘కొవిడ్‌లో ఎన్నో చావులు చూశా. అయినవాళ్లు ఉన్నా అంత్యక్రియలు చేయడానికి ఒక్కరూ ముందుకు రాని దుస్థితి. అలాంటి వారికి నేను, మావారు కలిసి అంత్యక్రియలు చేసేవాళ్లం. ఆ తర్వాత వాళ్ల బంధువుల కళ్లలో కృతజ్ఞతాభావం చూశాక ఆ పని కొనసాగించాలనిపించింది. అందుకే ఉద్యోగం కూడా మానేసి పూర్తిగా ఈ సేవలోనే ఉన్నా. రైలు పట్టాలపై పడిఉన్న శవాల దగ్గరకు రావడానికి పోలీసులే వెనకాడతారు. అలాంటప్పుడు నేనే ఆ అవయవాలను ఒకచోటికి చేర్చి, ఆఖరి సంస్కారాలు చేస్తా. ఇప్పటివరకు 500మందికి అంత్యక్రియలు చేశానంటారు’ మధుస్మిత.


నానమ్మ జ్ఞాపకంగా...

వాయిస్‌ఓవర్‌ ఇచ్చే స్నేహాంజలి ఇప్పటివరకు 24 మందికి అంత్యక్రియలు చేసింది. ‘అనారోగ్యంతో ఉన్న నానమ్మకు మందులు కొనడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. మా అసహాయత వల్లే ఆమె చనిపోయింది. తలచుకున్నప్పుడల్లా ఆ బాధ ఇప్పటికీ నా గుండెల్ని మెలిపెడుతుంది. ఆమెలాంటి వాళ్ల కోసమే ఈ సేవలోకి దిగా. సాయం అందని వారికి సేవ చేయడం కన్నా గొప్ప ఏముంటుంద’ంటుంది స్నేహాంజలి. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగిని స్వాగతిక..  రైలుపట్టాలు, రహదారుల్లో మృతి చెందిన వారి గురించి పోలీసులకి సమాచారం ఇస్తుంది. అంబులెన్స్‌ ఏర్పాటు చేసి.. అవసరం అయితే మృతులకు అంత్యక్రియలు చేస్తుంది. 


చేదు నింపిన రైలు ప్రమాదం... 

‘బహనాగాలో జరిగిన రైలు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే నలుగురం ప్రమాద స్థలానికి చేరుకున్నాం. స్థానికుల సాయంతో రైలుపెట్టెల్లో ఇరుక్కున్న వాళ్లని బయటకు తీశాం. గాయపడ్డవాళ్లు బాధతో విలవిల్లాడుతుంటే మాకు కాళ్లూ చేతులూ ఆడలేదు. ఇనుపరాడ్ల మధ్య చిక్కుకుపోయి.. అవయవాలు తెగిపడిన వారు కొందరైతే, మరికొందరు అచేతనంగా పడి ఉన్నారు. బయటకు తీసిన వారిని ఆసుపత్రులకు తరలించాం. కటక్‌లోని ఎస్సీబీ మెడికల్‌ కాలేజీ, ఎంసీహెచ్‌ ఆసుపత్రిలో రెండు మూడు రోజులపాటు బంధువుల కోసం వందలమంది కాచుకొని ఉన్నారు. వాళ్లకి దుస్తులు, ఆహారం, మంచి నీళ్లు, మందులు వంటివన్నీ అందించాం. గాయాలకు కట్లు కట్టాం. అయినవాళ్లు వచ్చేవరకూ తోడుగా ఉన్నాం. చనిపోయినవారిని బహనాగాలోని ఓ స్కూల్‌ ఆవరణకు చేర్చాం. అక్కడ గుట్టలుగా చేర్చిన శవాల పక్కనే రాత్రంతా పడుకున్నాం. 25 శవాలకి అంతిమ సంస్కారాలు చేశాం’ అని గుండెల్ని మెలిపెట్టే అనుభవాలు పంచుకున్నారు మధుస్మిత బృందం.


మాకు దూరంగా ఉంటారు...

‘ఆడవాళ్లిలా అంత్యక్రియలు చేస్తారా?.. అంటూ మా చుట్టుపక్కలవాళ్లు మమ్మల్ని దాదాపుగా వెలేశారు. శుభకార్యాలకు పిలవరు. మేం పిలిచినా... మైలపడ్డ ఇంట్లో భోజనం చేయకూడదంటూ వచ్చేవారు కాదు. అందరూ ఇలా ఉండరు. కొందరు మానవత్వంతో స్పందిస్తారు. మీరు చేస్తున్నది సాధారణమైన పని కాదని అని ఎవరైనా అంటే సంతోషమేసేది. మా తమ్ముడు బెంగళూరు రైలు ప్రమాదంలో చనిపోతే చివరి సంస్కారాల కోసం ఒడిశా తరలించలేకపోయాం. వాడిని అలా అనాథలా వదిలేసినందుకు ఎంత బాధపడ్డామో నాకూ, నా కుటుంబానికే తెలుసు. అందుకే ఈ పని చేస్తున్నా’ అంటోంది ఈ బృందంలో నాలుగో అమ్మాయి స్మితా మహంతి. ఈమె కోల్‌కతాలో కిరాణా దుకాణం నడుపుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని