బాస్టిల్‌ డే పరేడ్‌లో.. దిశా అమృత్‌!

చేస్తున్న ఐటీ ఉద్యోగం ఆమెకి సంతృప్తినివ్వలేదు... దేశానికి సేవచేయాలన్న కల ఆమెని నిలబడనివ్వలేదు.. అందుకే దేశ నావికారంగంలో అడుగుపెట్టి యువతకి స్ఫూర్తిగా నిలిచింది.

Updated : 12 Jul 2023 04:58 IST

చేస్తున్న ఐటీ ఉద్యోగం ఆమెకి సంతృప్తినివ్వలేదు... దేశానికి సేవచేయాలన్న కల ఆమెని నిలబడనివ్వలేదు.. అందుకే దేశ నావికారంగంలో అడుగుపెట్టి యువతకి స్ఫూర్తిగా నిలిచింది. భారత్‌- ఫ్రాన్స్‌ ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న పరేడ్‌లో నాయికగా మారి అందరి దృష్టినీ ఆకర్షించింది దిశా అమృత్‌.. 

నం గణతంత్ర దినోత్సవాన్ని వేడుకగా చేసుకున్నట్టే.. ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవ వేడుకలూ బాస్టిల్‌ డే పరేడ్‌ పేరుతో గొప్పగా జరుగుతాయి. దీనికి తోడు భారత్‌- ఫ్రాన్స్‌ల ద్వైపాక్షిక భాగస్వామ్యానికీ 25 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఇది మరో ప్రత్యేకత. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లో జరుగుతున్న భారత త్రివిధ దళాల కవాతు ప్రాధాన్యం సంతరించుకుంది.

జులై 14న జరిగే ఈ పరేడ్‌కు మన ప్రధాని నరేంద్ర మోదీ హాజరు అవుతున్నారు. ఈ ఏడాది జరిగిన మన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో నావికా దళ కవాతు బృందానికి నాయకత్వం వహించి, దేశం గర్వించేలా చేసింది మంగళూరుకు చెందిన నేవీ అధికారిణి దిశా అమృత్‌. బాస్టిల్‌ డే పరేడ్‌లోనూ పాల్గొనే అరుదైన అవకాశాన్నీ దక్కించుకుందామె. ఇప్పటికే కవాతు బృందాలు పారిస్‌ చేరుకుని సాధన ప్రారంభించాయి. నేవీ కవాతు బృందంలో దిశా అమృత్‌తో సహా నలుగురు నావికా దళ అధికారులు, 64 నావికులు ఉన్నారు.

ఐటీ ఉద్యోగం కాదనుకుని..

మంగళూరులోని బోలూరు సమీపంలోని తిలక్‌ నగర్‌కు చెందిన అమృత్‌ కుమార్‌, లీలా దంపతుల కుమార్తె దిశా అమృత్‌. దిశ స్థానిక కెనరా స్కూల్లో చదువుకున్నారు. 8వ తరగతి నుంచి ఎన్‌సీసీలో చేరారు. పాఠశాలలో చదువుతున్నప్పుడే దిల్లీలో జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ఎంపికయ్యారు. బెంగళూరులోని బీఎంఎస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. కొన్నేళ్ల పాటు అమెరికాకు చెందిన ఓ ఐటీ కంపెనీలో పనిచేశారు దిశ. మంచి ఉద్యోగంలో స్థిరపడినప్పటికీ సంతృప్తి చెందలేదు. ఎందుకంటే చిన్న వయసు నుంచే రక్షణ రంగంలోకి రావాలన్నది ఆమె ఆశయం. తన తండ్రి కల కూడా అదే. అందుకే ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి దేశసేవ చేయడానికి సిద్ధపడ్డారు దిశా అమృత్‌. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన దిశ 2016లో నేవీలో చేరారు. ఏడాది శిక్షణ తర్వాత అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఆమెకు పోస్టింగ్‌ వచ్చింది. ప్రస్తుతం అక్కడే నేవల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ‘దిశకు చిన్నప్పటి నుంచే నేవీ అధికారి కావాలని కోరిక. ఈ ఘనత సాధించడం నాకు చాలా గర్వంగా ఉందని అంటున్నారు’ ఆమె తండ్రి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని