కార్పొరేట్ కొలువు కాదని.. దబాంగ్ పోలీస్!
ఏకధాటిగా వర్షం.. విరిగిపడుతున్న కొండ చరియలు.. పొంగుతున్న నదులు.. పోటెత్తుతున్న వరదలు! కాలుతీసి అడుగేయడమే కష్టంగా ఉంది. ఎప్పుడు ఆపద ఎటునుంచి ముంచుకొస్తుందో తెలియదు.
ఏకధాటిగా వర్షం.. విరిగిపడుతున్న కొండ చరియలు.. పొంగుతున్న నదులు.. పోటెత్తుతున్న వరదలు! కాలుతీసి అడుగేయడమే కష్టంగా ఉంది. ఎప్పుడు ఆపద ఎటునుంచి ముంచుకొస్తుందో తెలియదు. అలాంటి చోట విధులు నిర్వర్తిస్తున్నారు సౌమ్య సాంబశివన్. నీళ్లతో ఇల్లు మునుగుతున్నా ఊరు దాటమని మంకుపట్టు పట్టి కూర్చున్న ఉత్తరాది వాసులను ఒప్పించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అందరి చేతా శభాష్ అనిపించుకుంటున్నారు. ఇంతకీ ఆమెవరంటే...
ఒక మహిళ హత్యకు గురైంది. రోజులు గడుస్తున్నా ఆమెవరో తెలియలేదు. మెడలో తాళి, నుదుట బొట్టు ఉండటంతో హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు చేసేశారు. ఇక ఆ కేసు ముగిసినట్లే అనుకున్నారంతా. కానీ ఎస్‌పీ సౌమ్య మాత్రం ఆ చనిపోయిన మహిళ తాజాగా ఐబ్రోస్ చేయించుకోవడం గమనించి, ఆమె ఫొటోను చుట్టుపక్కల బ్యూటీపార్లర్లలో చూపించమన్నారు. చివరకు ఒకరు గుర్తించారు. ఆమె ముస్లిం. ఆరా తీస్తూ వెళితే చంపేసింది భర్తేనని తేలింది. ఇద్దరూ అనాథలే అవ్వడంతో ఎవరూ ఆమె అదృశ్యాన్ని గుర్తించలేక పోయారు. ఏమాత్రం ఆధారాల్లేని ఇలాంటి కేసులు ఎన్నింటినో పరిష్కరించారు సౌమ్య. హిమాచల్ ప్రదేశ్‌లో డ్రగ్ మాఫియా, హ్యూమన్ ట్రాఫికింగ్, లిక్కర్ దందా వంటివి అరికట్టడమే కాదు.. నేరగాళ్లపై ఉక్కుపాదం మోపి ‘దబాంగ్ పోలీస్’గా పేరు తెచ్చుకున్నారు.
కార్పొరేట్ కొలువు కాదని..
సౌమ్య సాంబశివన్.. నిజానికి కార్పొరేట్ ఉద్యోగి. ఆ జీవితం కాదని ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. పుట్టింది కేరళ. నాన్న ఆర్మీలో ఇంజినీర్‌గా చేశారు. దీంతో ఆమె చదువంతా వివిధ ప్రాంతాల్లో సాగింది. బయోటెక్నాలజీలో డిగ్రీ, హైదరాబాద్‌లోని ఇక్ఫాయ్ నుంచి మేనేజ్‌మెంట్ పట్టా పొందారు. మల్టీనేషనల్ బ్యాంకులో కొలువు. మంచి జీతం.. మూడేళ్ల ప్రయాణం తర్వాత కొత్తదనం కనిపించలేదావిడకి. దీంతో ఏం చేయాలా అని ఆలోచించారు. ప్రజలకు దగ్గరగా ఉండొచ్చు.. సేవా చేయొచ్చని సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2010లో మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించారు. ఇండియన్ రిజర్వ్ బెటాలియన్, సీఐడీ విభాగాల్లో చేసినావిడ సిమ్లాకి తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కూడా.
నెట్టింట ఫేమస్..
సిర్మర్ జిల్లాలో ఎస్‌పీగా ఛార్జ్ తీసుకున్నాక ఎక్కువగా ఈవ్‌టీజింగ్ కేసులే వచ్చేవి. ‘పోలీసులు వెళ్లేప్పటికి ఒక్కోసారి ఆలస్యమైతే?’ ఇదే ఆలోచన వచ్చింది సౌమ్యకి. దీంతో ఆడపిల్లలకు స్వయంగా పెప్పర్ స్ప్రే తయారుచేయడం, స్వీయసంరక్షణ పద్ధతులు నేర్పించారు. ఇది నెట్టింట వైరల్ అవడమే కాదు.. ఈవ్‌టీజింగ్ కూడా తగ్గింది. ఎక్కడికెళ్లినా తనదైన ముద్ర వేశారీమె. ఇద్దరు పెద్దింటి కుర్రాళ్లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తెలిసి అరెస్ట్ చేశారు. బెదిరించినా, ఒత్తిళ్లు ఎదురైనా తగ్గలేదావిడ. విధులకు అడ్డొస్తే ఎమ్మెల్యేనీ లెక్కచేయలేదు. అందుకే ఈమె దగ్గరికి వెళితే న్యాయం తప్పనిసరి అని నమ్మేవారే ఎక్కువ. సామాజిక మాధ్యమాల్లో సౌమ్యకి ఫ్యాన్ పేజీలూ ఉన్నాయి. విధుల్లో కఠినంగా ఉండే ఆమె మనసు మాత్రం వెన్న అంటారు దగ్గరివాళ్లు. సాయానికి ఎప్పుడూ ముందుంటారు. కవియిత్రి కూడా! ‘తారా ద ఎన్‌ఛాంట్రస్’ పేరుతో పుస్తకాన్నీ రచించారు.
‘చిన్నప్పుడు జేమ్స్‌బాండ్ సినిమాలు చూసి, పోలీస్.. ఆపై టీచర్.. డాక్టర్ ఇలా చాలానే అనుకున్నా. చివరకు బ్యాంకర్‌గా స్థిరపడ్డా. కార్పొరేట్ పోటీ, ఆ వాతావరణం చూశాక మనసు సమాజ సేవవైపు మళ్లింది. అందుకు నాకు తట్టిన మార్గం.. సివిల్స్. రంగమేదైనా సవాళ్లు మామూలే. నాకూ వచ్చాయి. గౌరవం కావాలంటే.. ముందు ఇవ్వడం తెలియాలి. అందుకే హోదాతో సంబంధం లేకుండా అందరినీ గౌరవిస్తా. అలా నాతో నడిచే బృందాన్ని ఏర్పాటు చేసుకోగలిగా. నలుగురు తోడుంటే ఎంతటి కష్టమైన పనైనా సులువుగా చేయొచ్చు. అదే నా విజయ రహస్యం. అమ్మాయి అనగానే ఒకరిపై ఆధారపడతారన్న భావన. ముందు మీ కాళ్లపై మీరు నిలబడండి. చేయగలనన్న నమ్మకం పెంచుకోండి.. మీరూ దూసుకెళతార’ని సలహానిచ్చే సౌమ్య ప్రధాని సహా ఎందరో ప్రముఖుల మన్ననలు పొందారు. రాష్ట్రపతి అవార్డుకీ నామినేటయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.