చుక్కలపై ప్రేమతో..
ప్రపంచాన్ని తనవైపు తిప్పుకొన్న చంద్రయాన్- 3 ప్రయోగం తర్వాత.. అందరి ఆలోచనలూ అంతరిక్ష ప్రయోగాలవైపే! కానీ కొన్నేళ్ల క్రితమే ఈ దిశగా ఆలోచించి.. అంతరిక్ష అవకాశాలు, ప్రయోగాలపై పిల్లలు, యువతలో ఆసక్తిని పెంచుతున్నారు వీళ్లు.
ప్రపంచాన్ని తనవైపు తిప్పుకొన్న చంద్రయాన్- 3 ప్రయోగం తర్వాత.. అందరి ఆలోచనలూ అంతరిక్ష ప్రయోగాలవైపే! కానీ కొన్నేళ్ల క్రితమే ఈ దిశగా ఆలోచించి.. అంతరిక్ష అవకాశాలు, ప్రయోగాలపై పిల్లలు, యువతలో ఆసక్తిని పెంచుతున్నారు వీళ్లు. వేలమందికి నింగిపై మమకారాన్ని పెంచుతున్న స్పేస్ ఇన్‌ఫ్లుయెన్సర్ల గురించి మీరూ తెలుసుకోండి..
30వేల మందికి..
పద్మశ్రీ నాయుడు
‘కెరియర్ అంటే డాక్టర్, ఇంజినీరింగ్, సీఏ మాత్రమే అనుకోకుండా అంతరిక్షాన్ని కూడా అద్భుతమైన అవకాశంగా మార్చుకోవచ్చని నిరూపించాలనుకున్నా. అందులోని ఉపాధి అవకాశాల గురించి భవిష్యత్ తరాలకి చెప్పాలని 2008లో ‘స్పేస్ అధ్యాయన్’ ప్రారంభించా. 15 ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లోని 30వేలమంది విద్యార్థులకు అంతరిక్ష పాఠాలని బోధించా. చాలా మంది ఆస్ట్రానమీ అనగానే సైంటిస్ట్‌లుగా తప్ప మరే అవకాశాలుండవనుకుంటారు. అందుకే మొదట్లో మా తరగతులకు అంతగా ఆదరణ ఉండేది కాదు. కానీ రేడియో ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫొటోగ్రఫీ, మెట్రాలజీ, స్పేస్ లా వంటివాటిపై అవగాహన కల్పించాక పాఠశాలలు, పిల్లల తల్లిదండ్రులు నేరుగా వచ్చి తరగతులు తీసుకొమ్మంటున్నారు. పాఠశాల సిలబస్‌కి ఇబ్బంది రాకుండా జీరో పీరియడ్ సమయంలో క్లాసులు తీసుకుంటాం. నాసా, ఇస్రో, రష్యా అంతరిక్ష సంస్థలతో కలిసి పనిచేస్తున్నా. తొమ్మిది వేలమంది పిల్లలకు ఇస్రో ప్రయోగాలు చూసే అవకాశం కల్పించాం. 300 మందిని నాసాకి పంపించాం. శాస్త్రవేత్తలని ఆహ్వానించి పిల్లలతో నేరుగా సంభాషించడానికి కావాల్సిన వేదికలు ఏర్పాటు చేశా. అలాగే అంతరిక్ష అనుభవాలు తెలియడం కోసం ఏటా స్టార్ చేజింగ్ చేస్తాం. టెలిస్కోప్ సాయంతో అంతరిక్ష వింతలని చూపిస్తాం. ఎన్జీవోలతో కలిసి అనాథ పిల్లలకీ ఉచితంగా ఈ తరగతులు చెబుతుంటాం. మా బృందంలో 23 మంది ఉన్నాం. మా విద్యార్థులు ఇస్రో, నాసా వంటి సంస్థలకు సేవలు అందించాలన్నది నా కల’ అంటారు పద్మశ్రీ.
డాక్టర్.. ఆస్ట్రోనాట్..
- షానా పాండ్య
‘స్పేస్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో అమ్మాయిల ప్రాధాన్యం తక్కువ. దానిలో మార్పు రావాలని కూర్చోవడం కాదు.. చూడాలనుకుంటున్న మార్పు మనమే ప్రారంభించాలి’ అంటారు షానా పాండ్య! కెనడాలో పెరిగిన భారత సంతతి మహిళ. డాక్టర్, వ్యోమగామి, మోడల్, గాయని, మార్షల్ ఆర్టిస్ట్.. ఇలా చెబుతూపోతే ఇంకా ఎన్నో! జిజ్ఞాస ఉండాలే కానీ దేన్నైనా నేర్చుకోవచ్చు అనే షానాకి ఆకాశం, చుక్కలంటే ప్రేమ. వైద్యమన్నా అంతే ఇష్టం. అందుకే న్యూరోసైన్స్‌లో డిగ్రీ అయ్యాక స్పేస్‌స్టడీస్‌లో పీజీ, ఆపై ఎండీ (మెడిసిన్) చేశారు. 2017లో కెనడా స్పేస్ ప్రాజెక్ట్- పీఓఎస్‌ఎస్‌యూఎమ్‌కు ఎంపికయ్యారు. దానిలో భాగంగా వ్యోమగామి శిక్షణ, నాసాలో ఇంటర్న్‌షిప్ చేశారు. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనాటికల్ సైన్సెస్ (ఐఐఏఎస్)కి చీఫ్ ఇన్‌స్ట్రక్టర్‌గా చేశారు. ప్రస్తుతం స్పేస్ మెడిసిన్ గ్రూప్‌కి డైరెక్టర్. వాతావరణ మార్పులు.. అంతరిక్షంలో వ్యక్తుల ఆరోగ్యంలో వచ్చే తేడాలు వంటి ఎన్నో అంశాలపై పనిచేస్తున్నారు. ఐఐఏఎస్ ఆల్ ఫిమేల్ మైక్రోగ్రావిటీ ఫ్లైట్ సిబ్బందిలో ఈమె ఒకరు. శాస్త్రసాంకేతిక, అంతరిక్ష రంగాల్లో అమ్మాయిల ప్రాధాన్యం పెంచడానికి దేశవిదేశాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇన్‌స్టా ద్వారా ఆసక్తికరమైన అంశాలను పంచుకుంటారు. అన్నట్టూ షానా స్కైడైవర్, అడ్వాన్స్‌డ్ డైవర్, ఆక్వానాట్ కూడా.. 100 రోజులు సముద్రగర్భంలో పరిశోధనలు జరిపారు. ఎన్నో పురస్కారాలు అందుకున్న షానా ఆంత్రప్రెన్యూర్ కూడా. ‘ఆసక్తి ఉన్న ప్రతిదాన్నీ ప్రయత్నించాలనుకుంటా. ఇంట్లో ఎప్పుడూ ‘నీ ఇష్ట’మన్న సమాధానమే. వాళ్లేగనక ‘చేయలేవు, నీవల్ల కాదు’ అంటే ఎలా ఉండేదో! అయితే సైన్స్ అనగానే అమ్మాయిలకు అవకాశాలు తక్కువ అనుకుంటారు. ఒక్కసారి కాలు పెట్టండి. అద్భుతాలు సృష్టిస్తారు’ అంటారు 36 ఏళ్ల షానా!
శాస్త్రవేత్తల తయారీ
శ్రీమతి కేసన్
‘అల్లంత దూరాన ఉన్న ఆకాశం.. చిన్నపిల్లలకు ఓ అద్భుతం. పెద్దయ్యేనాటికి అదో అందని అవకాశం. చిన్నతనంలోనే ఆ ఆసక్తిని కొనసాగేలా చేస్తే.. అంతరిక్ష రంగంలో అద్భుతాలను చూడొచ్చ’ంటారు డాక్టర్ శ్రీమతి కేసన్. యువ శాస్త్రవేత్తలు, నాయకులను తయారు చేయడమే లక్ష్యంగా సాగుతున్నారీమె. అందని ద్రాక్షగా భావించే స్పేస్ రంగాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ‘స్పేస్ కిడ్స్ ఇండియా’ ప్రారంభించారు. శ్రీమతిది చెన్నై. స్పేస్ సైన్స్‌లో ఏళ్ల అనుభవం. చిన్నపిల్లలను స్పేస్ సెంటర్లకు తీసుకెళ్లడం.. ఆసక్తి ఉన్నవారికి మెంటరింగ్ చేస్తూ వాళ్లతో చిన్న శాటిలైట్లనూ తయారు చేయించి అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది అమ్మాయిలతో ‘ఆజాదీ శాట్’ రూపొందించి, కక్ష్యలో ప్రవేశపెట్టి విజయం సాధించారు కూడా. నాసా, ఈఎస్‌ఏ, జీసీటీసీ స్పేస్ సెంటర్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఏకైక భారతీయురాలు. గత ఏడాది నాసా ‘వన్ డే ఆస్ట్రోనాట్’ ప్రోగ్రామ్‌లో పాల్గొని ‘జీరో గ్రావిటీ’ అనుభవాన్ని పొందారు. ‘ఏటా యంగ్ సైంటిస్ట్, యూత్ ఐకాన్, ఇన్నోవేటివ్స్ ఫర్ ఇండియా పేరుతో పోటీలూ నిర్వహిస్తుంటాం. మెచ్చిన ఆలోచనలకు ఫండింగ్ ఏర్పాట్లూ చేస్తుంటా. ఇవన్నీ యువతరాన్ని అంతరిక్ష రంగంవైపు ఆకర్షించే ప్రయత్నాలే. ఈరంగంలో దేశాన్ని మేటిగా నిలపాలంటే యువతకే సాధ్యం. అందుకే ఈ నా ప్రయత్నం’ అంటారు శ్రీమతి.
ఆహ్వానం
వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.