ఆమె కళ్లలో.. కాంతుల్ని వెలిగించింది
కొన్ని భావోద్వేగాల వల్ల కలిగే సంతోషం... కోట్లు ఖర్చు పెట్టినా రాదు. దాన్ని అనుభవించి ఆనందించాల్సిందే అలాంటి అనుభూతిని ఓ మంచి పనితో సాధించారు ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ. ఆమె ఆ ఇంట్లో వెలిగించిన దీపపు వెలుగులు.. ఓ వృద్దురాలి కళ్లల్లో కాంతులకు కారణమయ్యాయి.
కొన్ని భావోద్వేగాల వల్ల కలిగే సంతోషం... కోట్లు ఖర్చు పెట్టినా రాదు. దాన్ని అనుభవించి ఆనందించాల్సిందే అలాంటి అనుభూతిని ఓ మంచి పనితో సాధించారు ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ. ఆమె ఆ ఇంట్లో వెలిగించిన దీపపు వెలుగులు.. ఓ వృద్దురాలి కళ్లల్లో కాంతులకు కారణమయ్యాయి. ఈ అపురూప క్షణాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడు ఈ ఆఫీసర్ గురించి ఆరా తీస్తే తన ఆశయం, ప్రయాణం వరకూ ఎన్నో విషయాలు స్ఫూర్తినిస్తున్నాయి.
‘బాలీవుడ్ చిత్రం ‘స్వదేశ్’లో నాసా శాస్త్రవేత్త పాత్రలో షారూఖ్ తన ఊరికి కరెంట్ తేవడానికి చేసిన ప్రయత్నం తెరమీద ఎన్నో భావోద్వేగాల్ని పండించింది. అంత శ్రమ ఇక్కడ లేకున్నా... నూర్జహాన్ ఆంటీ ఇంట్లో వెలిగించిన దీపపు కాంతులు...ఆ సన్నివేశాల్ని గుర్తు తెస్తున్నాయి’ అంటూ బులంద్‌షెహర్ అడిషనల్ ఎస్పీ అనుకృతి శర్మ చేసిన ట్విట్టర్ పోస్ట్ లక్షల మందిని కదిలించింది. నిజానికి ఆ సినిమాలో హీరోకీ, నిజ జీవితంలోని అనుకృతికి ఉన్న పోలిక సేవాగుణం మాత్రమే కాదు. నాసాలో ఉద్యోగం కూడా. అవును కేవలం ఐపీఎస్ కావాలన్న లక్ష్యంతోనే ఆమె దాన్ని వదులుకున్నారట. ఇందుకోసం వరుస వైఫల్యాలెన్నో తట్టుకుని అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు.
వైఫల్యాలెదురైనా..
అనుకృతి స్వస్థలం రాజస్థాన్‌లోని అజ్మేర్. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. అను కోల్‌కతాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చిలో సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ (బీఎస్‌ఎమ్మెస్) కోర్సు, 2012లో హ్యూస్టన్‌లోని రైజ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. సహవిద్యార్థి వైభవ్ మిశ్రాను ప్రేమ వివాహం చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. పీహెచ్‌డీ చేస్తున్నప్పుడే నాసాలో వల్కనోలపై పరిశోధన చేసే అవకాశం వచ్చిందామెకు. అక్కడ కొన్నాళ్లు పని చేశాక తాము చదివిన చదువు దేశ ప్రజలకు ఉపయోగపడాలనుకున్నారా దంపతులు. దాంతో అనుకృతి తన నాసా ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆపై ఇండియాకు తిరిగొచ్చేశారు. ‘బనారస్‌లో ఉంటూ.. ఇద్దరం యూపీఎస్‌సీ పరీక్షకి సిద్ధమయ్యాం. ఒకరికొకరం సలహాలు, సూచనలిచ్చుకుంటూ కలిసి చదివే వాళ్లం. 2015లో మొదటిసారి రాసినప్పుడు ప్రిలిమ్స్ వరకు వెళ్లగలిగా. ఇక రెండో ప్రయత్నంలో కనీస అర్హత కూడా సాధించలేకపోయా. మూడోసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఎంపిక కాలేదు. ఇలా వరుస వైఫల్యాలు వెక్కిరించినా లక్ష్యాన్ని చేరే వరకు పోరాడాలనుకున్నాన’ని అంటారు అనుకృతి.
అయిదో సారి...!
‘మూడుసార్లు విఫలమవ్వడమంటే... నా ప్రయత్నంలోనే ఏదో లోపం ఉందనిపించింది. ఈసారి ప్రణాళికలో మార్పులు చేసుకున్నా. నాలుగోసారి 355వ ర్యాంకు సాధించా. ఐఆర్‌ఎస్‌లో చోటు దక్కింది. ఐపీఎస్ కావాలనేది నా కల. చివరి సారి ప్రయత్నించాలని గట్టిగా అనుకున్నా. నన్ను నేను నిరుత్సాహ పరుచుకోకూడదని తర్వాతి ఏడాది పరీక్ష రాయలేదు. అలాగని ఎక్కడా కోచింగ్‌కూ చేరలేదు. సొంతంగా చదువుకున్నా. నాకు నేనుగా సిలబస్‌ను తయారుచేసుకొని కావాల్సిన సమాచారాన్ని ఇంటర్నెట్‌లో తీసుకుంటూ 2020లో యూపీఎస్‌సీ అయిదోసారి రాశా. నా కల ఫలించింది. 138వ ర్యాంకు సాధించా. నాకిష్టమైన యూనిఫారంను ధరించే అవకాశాన్ని అంది పుచ్చుకున్నా. లఖ్‌నవూలో శిక్షణ పూర్తిచేసి బులంద్‌షెహర్‌లో అడిషనల్ ఎస్పీగా సేవలందిస్తున్నా. వైభవ్ ఇప్పుడు దిల్లీ కోచింగ్ ఫెసిలిటీలో పనిచేస్తున్నార’ని చెబుతున్నారు అనుకృతి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహించడమే కాదు.... యూపీఎస్‌సీ పరీక్షలకు హాజరయ్యేవారికి తన అనుభవాలను పాఠాలుగా మార్చి స్ఫూర్తినందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.