చెట్ల కింద చదువుకుంటారా!

వాకింగ్‌ చేసేవాళ్లు, ఆడుకొనే పిల్లలతో కిటకిటలాడే ఆ పార్కు ఆదివారాల్లో విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయంగా మారిపోతుంది.

Published : 22 Jul 2023 00:11 IST

వాకింగ్‌ చేసేవాళ్లు, ఆడుకొనే పిల్లలతో కిటకిటలాడే ఆ పార్కు ఆదివారాల్లో విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయంగా మారిపోతుంది. వందలమంది చేతుల్లో పుస్తకం వచ్చి చేరుతుంది. ఇంత మంచి మార్పునకు కారణం ఇద్దరు స్నేహితురాళ్లు శృతి షా, హర్ష్‌స్నేహాన్షులు. ప్రకృతి నడుమ పుస్తకం చదివితే కలిగే అనుభూతిని అందరికీ అందివ్వాలనే ఈ ప్రయత్నం చేశాం అంటున్నారు వీళ్లు. ‘కబన్‌ రీడ్స్‌’ పిలుపు ఇప్పుడు దేశవిదేశాలకు వ్యాపించింది..

గతంలో పుస్తక పఠనం పట్ల అభిరుచి ఉన్నవారు గ్రంథాలయాలకి వెళ్లేవారు. ఆసక్తి ఉన్నవాళ్లు తీరిక దొరికితే పుస్తకాలు కొని చదివేవారు. ఇప్పుడా స్థానాన్ని ఫోన్‌ భర్తీ చేసింది. దీంతో పుస్తకపఠనం దూరమైందంటారు శృతి షా, హర్ష్‌స్నేహాన్షులు. ‘మేమిద్దరం మార్కెటింగ్‌ నిపుణులం. వ్యాపారవేత్తలుగా బెంగళూరులో స్థిరపడ్డాం. వారాంతాల్లో కబన్‌ పార్కులో సైక్లింగ్‌, రీడింగ్‌ చేసేవాళ్లం. మా అనుభూతిని సామాజిక మాధ్యమాల్లో పంచుకొంటే స్నేహతులంతా స్పందించి వారు మాతో కలుస్తామన్నారు. ఇటువంటివారి కోసం ‘కబన్‌ రీడ్స్‌’ పేజీని సోషల్‌మీడియాలో ప్రారంభించి ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానించాం. నలుగురైదుగురితో మొదలై, 500మందికి ఈ సంఖ్య పెరిగింద’ని సంతోషంగా చెప్పుకొస్తున్నారు వీరిద్దరూ.

దేశవ్యాప్తంగా..

కబన్‌రీడ్స్‌లో యువత నుంచి వృద్ధుల వరకు సభ్యులుగా ఉన్నారు. దీన్ని పూర్తిగా బుక్‌ క్లబ్‌లా కాకుండా దిన పత్రికలు, విద్యార్థులు సబ్జెక్ట్‌ పుస్తకాలు వంటివేవైనా నిశ్శబ్దంగా చదువుకోవచ్చని ప్రోత్సహిస్తున్నాం అంటారు షా. ‘పఠనం ఇష్టమైనా తగిన వాతావరణం లేక మధ్యలోనే పుస్తకాన్ని ఆపేస్తామంటూ చాలామంది మాతో చెబుతారు. ఈ ప్రశాంతమైన వాతావరణం వారికెంతో సంతోషాన్నిస్తోందంటారు. కబన్‌రీడ్స్‌ స్ఫూర్తి ఇప్పుడు మరిన్ని ప్రాంతాలకూ విస్తరించడం గర్వంగా ఉంది. బెంగళూరులో మరో ఆరుచోట్ల ఇది ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్‌ సహా దిల్లీ, ముంబయి, త్రివేండ్రం వంటి 30 చోట్ల పుస్తక ప్రియులు కబన్‌ రీడ్స్‌ సభ్యులయ్యారు. ఆయా ప్రాంతాల్లోని పార్కుల్లో పుస్తక పఠనం చేస్తున్నారు. లండన్‌, మలేసియా వంటి 15 దేశాల్లోనూ రీడింగ్‌ కమ్యూనిటీ సభ్యులు దీన్ని అనుసరిస్తున్నార’ని వివరిస్తున్నారు షా.

వైజాగ్‌లో..

వీఎమ్మార్డీఏ సెంట్రల్‌ పార్కులో వారాంతంలో సైలెంట్‌ బుక్‌-రీడింగ్‌ కమ్యూనిటీ సభ్యులతో నిండుతోంది. ఫార్మ్‌డీ విద్యార్థిని మేఘనా గోర్లి, బిజినెస్‌ కన్సెల్టెంట్‌ షిరేన్‌ మెహర్‌ వైజాగ్‌లో కబన్‌ రీడ్స్‌కు నేతృత్వం వహిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని