స్టీల్‌ రంగానికి రాణి

అడుగడుగునా చిన్నచూపు.. ‘అయ్యో.. అమ్మాయివి’ అంటూ జాలి మాటలు.. ఊహ తెలిశాక అయినవాళ్ల నుంచి ఆమెకి ఎదురైనవవే! ఆ మాటలు తనపై ప్రభావం చూపేవి. అలాగని కుంగిపోలేదామె.

Updated : 01 Aug 2023 04:48 IST

అడుగడుగునా చిన్నచూపు.. ‘అయ్యో.. అమ్మాయివి’ అంటూ జాలి మాటలు.. ఊహ తెలిశాక అయినవాళ్ల నుంచి ఆమెకి ఎదురైనవవే! ఆ మాటలు తనపై ప్రభావం చూపేవి. అలాగని కుంగిపోలేదామె. వాటినే ప్రేరణగా తీసుకొని స్టీల్‌ రంగంలో రారాణిగా ఎదిగింది. తను గెలవడమే కాదు.. మరెంతోమంది మహిళలకీ రాణించే అవకాశం కల్పిస్తోంది కైరవీ మెహతా. ఆమె స్ఫూర్తి ప్రయాణమిది.

నాన్న పెద్ద వ్యాపారవేత్త. అలాంటి కుటుంబంలో పుట్టడమంటే అదృష్టంగానే భావిస్తారెవరైనా. ఆమె ఇంట్లో మాత్రం అలా కాదు. ఆడపిల్లల్ని కన్నదని వాళ్లమ్మకి రోజూ చీవాట్లు. వారసుడు లేడని వాళ్ల నాన్న వీరేంద్రని చూసి జాలిపడేవారు. ఆయన ఏదైనా సాధించినా ‘ఏం లాభం? తర్వాత చూసుకోవడానికి వారసులే లేరు’ అనేవారట. తమను ఎంత ప్రేమగా చూసుకున్నా అప్పుడప్పుడూ ఆ మాటలకు ఆయన బాధపడటం గమనించింది చిన్నారి కైరవి. అలా పదకొండేళ్ల వయసులో వీటన్నింటినీ తప్పని నిరూపించి, నాన్నకి వారసురాలవ్వాలని నిశ్చయించుకుంది. వీళ్లది ముంబయి. నాన్న వీకే ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అధిపతి. వీళ్ల సంస్థ స్టీల్‌ ప్లేట్లు, కాయిల్స్‌ను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇంజినీరింగ్‌, రెన్యువబుల్‌ పవర్‌ వంటి సంస్థలకు సరఫరా చేస్తుంది. దేశవ్యాప్తంగా వీరికి వేర్‌హౌజ్‌లూ ఉన్నాయి. ‘స్టీల్‌ బిజినెస్‌.. అదో పురుషాధిక్య రంగం. నిలబడాలంటే సవాళ్లను ఎదుర్కోవాలని అప్పటికి నాకు తెలియదు. అయితే.. నేర్చుకోవాలి, నైపుణ్యాలను అందుకుంటూ వెళితేనే ఈ గాజు తెరల్ని బద్దలు కొట్టగలను, అవకాశాలను అందుకోగలనని బలంగా నమ్మేదాన్ని. అందుకే చదువులో ఎప్పుడూ ముందుండేదాన్ని. డిగ్రీ పట్టా కాదు.. ప్రాక్టికల్‌ పరిజ్ఞానం కోసమని అమెరికా వెళ్లా. దానికి ప్రాధాన్యమిచ్చే బాబ్సన్‌ కళాశాలలో మేనేజ్‌మెంట్‌ డిగ్రీ చేశా. వ్యాపార విషయాలన్నీ తెలుసుకునేదాన్ని. అదిచూసి ‘అమ్మాయివి నీకెందుకంత కష్ట’మనేవారు. ఎవరేమన్నా  నా పని నేను చేసుకుంటూ వెళ్లేదాన్ని. అలాంటిది చదువయ్యాక నాన్న వ్యాపారంలోకి అడుగుపెడతా అనగానే అందరూ షాకయ్యా’రంటుందీమె.

అనుమానాలు.. వివక్ష

‘యజమాని కూతుర్నని నేరుగా సీఈఓ బాధ్యతలేమీ తీసుకోలేదు. అయినా అడుగడుగునా ‘ఏం చేయగలద’నే అనుమానాలు, లింగ వివక్ష. మేనేజ్‌మెంట్‌ స్థాయిలోనే కాదు.. బ్రోకర్లు, సప్లయిర్లు చివరకు ఉద్యోగుల నుంచీ ఇదే సమస్య. నేనవేమీ పట్టించుకోలేదు. పనితోనే సమాధానం చెప్పాలనుకునేదాన్ని’ అనే కైరవి తన సత్తాని 21 ఏళ్లకే నిరూపించుకుంది. 2015లో ఓ అంతర్జాతీయ వేదికపై ‘స్టీల్‌ దిగుమతుల్లో జాగ్రత్త’లపై అనర్గళంగా ప్రసంగించి పరిశ్రమ నిపుణుల చూపు తనవైపునకు తిప్పుకొంది. తర్వాత రెండేళ్లకు చెన్నై కస్టమ్స్‌ వాళ్లమీద ఓ కేసు గెలిచి తన ప్రతిష్ఠను మరింత పెంచుకుంది. డిస్ట్రిబ్యూషన్‌ సర్వీస్‌లను వేగవంతం చేయడానికి సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టడమే కాదు.. చదువుకోని వాళ్లూ ఉపయోగించగల అధునాతన టెక్నాలజీని పరిచయం చేసింది. అలా కస్టమర్లకు మరింత చేరువ అవ్వడమే కాదు.. లాభాలనూ పెంచి, కొన్నేళ్లలోనే  సంస్థను రూ.500 కోట్ల వ్యాపారంగా మార్చింది. అందుకే తనను స్టీల్‌ రంగానికి రాణి అంటారు.


50శాతం మహిళలే..

రెండేళ్ల క్రితం సీఈఓగా సంస్థ పగ్గాలు తీసుకుంది. ఈసారి ఎవరూ అనుమానాలు వెలిబుచ్చలేదు. అంతటితో ఆగిపోవాలనుకోలేదు కైరవి. సాధించాలని కలలు ఉండి, అవకాశాల్లేక వెనకపడే అమ్మాయిలకి చేయూత ఇవ్వాలనుకుంది. తన సంస్థలో 50శాతానికిపైగా మహిళలకు అవకాశాలిచ్చింది. వాళ్ల అవసరాలు, భద్రతకు ప్రాధాన్యమిస్తూనే ఉన్నతహోదాల్లో సమానావకాశాలిస్తోంది. అంతేకాదు నెక్స్ట్‌జెన్‌ పేరుతో రాబోయే తరం ఆంత్రప్రెన్యూర్లకు సలహాలూ, సూచనలూ ఇస్తోంది. ‘నేనొక్కదాన్నే సాధిస్తే గొప్పగా భావించను. నావల్ల కొందరిలోనైనా మార్పు రావాలి, వాళ్లకి స్ఫూర్తిగా నిలవగలగాలి అప్పుడే విజయమనుకుంటా. ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా వెనక్కి లాగేవారు ఉంటారు. దానికి కుంగిపోతే ఎప్పటికీ ఎదగలేం. వాటినే మిమ్మల్ని నడిపించే ఇంధనంగా భావించండి. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఆ తత్వాన్ని ఏర్పరుచుకోండ’ని సలహానీ ఇస్తోంది 29 ఏళ్ల కైరవి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్