అక్కాచెల్లెళ్లం స్నేహితులం!

గొడవలు, గిల్లికజ్జాలు..  అలకలు, కొట్లాటలు.. అక్కాచెల్లెళ్లు అంటే ఇవన్నీ మామూలే! అమ్మలా మారిన అక్కయ్యలు.. ఆత్మీయతలు పంచే చెల్లెళ్లు.. స్నేహితులుగా మారి జీవితంలో ఆనందాలు విరబూయించుకుంటున్న వీళ్ల అనుబంధాలను మీరూ చూసేయండి..

Updated : 06 Aug 2023 07:33 IST

సిస్టర్స్‌ డే సందర్భంగా

గొడవలు, గిల్లికజ్జాలు..  అలకలు, కొట్లాటలు.. అక్కాచెల్లెళ్లు అంటే ఇవన్నీ మామూలే! అమ్మలా మారిన అక్కయ్యలు.. ఆత్మీయతలు పంచే చెల్లెళ్లు.. స్నేహితులుగా మారి జీవితంలో ఆనందాలు విరబూయించుకుంటున్న వీళ్ల అనుబంధాలను మీరూ చూసేయండి..


అమ్మ తర్వాత తనే
జాన్వీ కపూర్‌

వరో ఒకరిపై ఆధారపడే మనస్తత్వం నాది. ఎప్పుడూ అమ్మ శ్రీదేవి కొంగు పట్టుకొనే తిరిగేదాన్ని. ఇంట్లో నిజానికి నేను పెద్ద. కానీ ఎప్పుడూ చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంటా. నా చెల్లి ఖుషీ మాత్రం పెద్దదానిలా బాధ్యతగా ఉంటుంది. అందరు అక్కాచెల్లెళ్లలా మేమూ గొడవలు పడతాం. కానీ కాసేపే. వెంటనే కలిసిపోతాం. అవసరం, సందేహం ఏదొచ్చినా చెల్లినే అడుగుతా. నా గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి, నన్ను నడిపించే బెస్ట్‌ ఫ్రెండ్‌ తనే. అమ్మ చనిపోయాక ఆ లోటు తెలియనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంది. చిన్నపిల్లలా నన్ను దగ్గరుండి చూసుకోవడమే కాదు.. రోజూ నేను పడుకున్నాక గానీ తను నిద్రపోయేది కాదు. ఇప్పటికీ ఇంట్లో ఉంటే ప్రతిక్షణం తను నా పక్కన ఉండాల్సిందే. వేరే ప్రాంతాల్లో షూటింగ్‌లో ఉన్నప్పుడూ ఏమాత్రం ఖాళీ దొరికినా తన దగ్గర వాలిపోతా. లేదా తననే రప్పించుకుంటా. అంతగా ఒకరినొకరం మిస్‌ అవుతుంటాం. ఇటీవలే తనూ సినిమాల్లోకి అడుగుపెట్టింది. మొదటిరోజు షూటింగ్‌కి పక్కనే ఉండాలనుకున్నా. మేకప్‌ అంతా పూర్తయ్యేవరకూ ఉన్నా. తీరా షూటింగ్‌ మొదలయ్యేప్పటికి వెళ్లాల్సి వచ్చింది. తనకు ముఖ్యమైన రోజున కూడా పక్కన ఉండలేకపోయా.. నేనేం అక్కని అని ఏడ్చేశా. అప్పుడూ ఖుషీనే నన్ను సముదాయించింది. కెరియర్‌లో ఇవన్నీ మామూలే అని బుజ్జగించాక కానీ మామూలు మనిషిని కాలేకపోయా. నాకు మరో అమ్మ తను. అందుకే ఈ లోకంలో ఫేవరెట్‌ వ్యక్తి ఎవరంటే కచ్చితంగా ఖుషీ అనే చెబుతా.


ఆమె ఉంటే సందడే
కృతి సనన్‌

నా చెల్లెలు నుపుర్‌ నాకంటే అయిదేళ్లు చిన్న. జాగ్రత్తగా చూసుకోవాలన్న భావన చిన్నప్పుడే ఏర్పడింది. అందుకేనేమో చెల్లెలిగా కంటే కూతురిలానే ఎక్కువగా చూసుకుంటా. దూరంగా ఉంటే తిన్నావా, వేళకు పడుకున్నావా అంటూ పదే పదే కనుక్కుంటా. దాంతో సరదాగా నన్ను ‘చిన్న మమ్మీ’ అని పిలుస్తుంది. నుపుర్‌ గాయని. సినిమాల్లోకీ అడుగుపెట్టింది. తననెవరైనా ప్రశంసిస్తే నన్నే మెచ్చుకున్నంత సంబరంగా ఉంటుంది. చిన్న చిన్న తగాదాలూ పెట్టుకుంటాం. ముఖ్యంగా నా వస్తువులు ఒకసారి వాడుకొని ఇస్తానంటూ తీసుకుంటుంది.. అంతే! తిరిగి ఇవ్వనే ఇవ్వదు. అలాంటప్పుడు మాత్రం కోపమొచ్చేస్తుంది. నాకు బయట స్నేహితులు తక్కువ. చిన్నదైనా ఓ స్నేహితురాలిగా తనతోనే అన్నీ పంచుకుంటా. కలిసే ట్రిప్‌లు ప్లాన్‌ చేసుకుంటాం. కానీ నుపుర్‌ అలాకాదు.. ఎక్కడికెళ్లినా బోలెడు మంది ఫ్రెండ్స్‌ అయిపోతారు. అందుకే తను ఎక్కడున్నా సందడిగా ఉంటుంది. ఖాళీ దొరికితే తనతో గడపడానికి ఇష్టపడతా. ఇద్దరం ఎప్పుడూ ఒకరికొకరం తోడుంటామని ప్రామిస్‌ చేసుకున్నాం. దానికి గుర్తుగానే ఏటా రాఖీనాడు ఒకరికొకరం రాఖీ కట్టుకొని ఆ బాసని గుర్తు చేసుకుంటుంటాం.


తనే స్ఫూర్తి..
కీర్తి సురేష్‌

క్క రేవతీ, నేనూ ఫ్రెండ్స్‌లా ఉంటాం. అమ్మానాన్న సినిమాల్లో బిజీగా ఉండేవారు. అమ్మ లేనప్పుడల్లా అక్కే నాకు అమ్మ. నన్ను అమ్మ పక్కలో పసిగుడ్డుగా చూసినప్పటి నుంచీ ప్రేమించడం మొదలుపెట్టిందట. ఇంట్లో హోంవర్క్‌ నుంచి ఆడుకోవడం వరకు ఒకరికొకరంగా ఉండేవాళ్లం. అక్క నన్ను కిట్టీ అని ప్రేమగా పిలుస్తుంది. బాలనటిగా కెరియర్‌ మొదలుపెట్టా. ఓసారి నీలాగే హీరోయిన్‌ అవుతా అని అమ్మతో చెబితే, ముందు చదువుకోమంది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేసి ఆ తర్వాత హీరోయిన్‌నయ్యా. అక్క నృత్య కళాకారిణి. దర్శక రంగాన్ని ఎంచుకొంది. నా నటనను విశ్లేషించి సలహాలిస్తుంది. నా సమస్యను తనదిగా భావిస్తుంది. తన సినిమాల గురించి ముందుగా నాతోనే పంచుకుంటుంది. చిన్నప్పటి నుంచి లావుగా ఉందంటూ అందరూ తనను విమర్శించినప్పుడు చాలా బాధపడేది. నా స్నేహితులంతా నాకన్నా అక్కనే అందంగా ఉందనేవారు. కొందరు మాత్రం ఎందుకంత లావుగా ఉన్నావంటూ ముఖంపైనే అడిగేవారు. ఆ విమర్శలన్నింటికీ అక్క బదులు చెప్పింది. యోగాతో 20 కేజీల బరువు తగ్గి, తనలాంటివారికి స్ఫూర్తినిచ్చింది. తన ఆత్మవిశ్వాసాన్ని చూసి గర్వపడుతున్నా. మనల్ని విమర్శించేవారికి బదులెలా చెప్పాలో తన నుంచే నేర్చుకున్నా.


వార్డ్‌రోబ్‌ ఒకటే..
తాప్సి

మా చెల్లి షగున్‌ నాకన్నా నాలుగేళ్లు చిన్నది. దాని పరిణితి చూస్తే నాకన్నా పెద్దదానిలా అనిపిస్తుంది. నాకు త్వరగా కోపం వస్తుంది. తనేమో శాంత మూర్తి. నాకు కోపాన్నెలా అదుపు చేసుకోవాలో చెబుతుంది. మా ఇద్దరికీ ఊర్లు తిరగడమంటే చాలా ఇష్టం. ఇలా సిస్టర్స్‌ డే, పుట్టినరోజులు వంటి ప్రత్యేక సందర్భాలుంటే ఒకేచోట ఉండాలనుకుంటాం. ఇద్దరం కలిస్తే అల్లరే అల్లరి. కొట్టుకొంటాం.. తిట్టుకుంటాం. చివర్లో కలిసి పోతాం. హెయిర్‌కట్‌ చేయడం, టాటూలు వేయించుకోవడం, కలిసి డ్యాన్స్‌ చేయడం వంటివన్నీ నాకిష్టం. అవన్నీ షగున్‌పై ప్రయోగిస్తుంటా. పాపం తను నాకోసం అన్నింటినీ భరిస్తుంది. నాకిష్టమైనవన్నీ తను చేస్తుంది. వ్యక్తిగత విషయాలనీ పంచుకుంటాం. ఇద్దరిదీ ఇప్పటికీ ఒకటే వార్డురోబ్‌. దుస్తులు, షూ, యాక్ససరీస్‌ వంటివన్నీ పంచుకుంటాం. కొత్తది కొన్నామంటే దాన్ని మొదట ఎవరు వాడుకుంటారు అనేదానిపై మాత్రం గొడవలు అయిపోతాయి. చివరికి నేనే గెలుస్తా. కెరియర్‌లో తన మనసుకు నచ్చింది చేయమని చెబుతుంటా. మా మాటతీరు, నడక వంటివన్నీ ఒకేలా ఉంటాయి. కొన్నిసార్లు అమ్మానాన్నలతో ఫోన్‌లో ఉన్నప్పుడు మా ఇద్దరిలో ఎవరు మాట్లాడుతున్నారో గుర్తించలేరు. దీంతో అమ్మ వీడియోకాల్‌లో మాట్లాడుతుంది. నా సినిమాల్లో కొన్ని సీన్లకు తను ఏడ్చేస్తుంది. అంతగా నా నటనంటే ఇష్టం. జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూ సరదాగా గడపాలన్నది మా లక్ష్యం. సిస్టర్స్‌ కన్నా.. మేం ఎక్కువగా ఫ్రెండ్స్‌గానే ఉంటాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్