వీళ్లకి మూడు నాలుగు అయిదు ప్రభుత్వ కొలువులు

ఎన్ని కొలువులున్నా ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడూ ప్రత్యేకమే! అది అనుకున్నంత సులువుగా చేజిక్కదు మరి! ఏళ్లు శ్రమించీ విఫలమయ్యేవారున్నారు. సంతోషమ్మ, చంద్రకళ, దీపారెడ్డి, మమత మాత్రం వారికి భిన్నం. ఒకటి కాదు... మూడు, నాలుగు, అయిదు చొప్పున సాధించారు వీళ్లు.

Published : 04 Mar 2024 01:59 IST

ఎన్ని కొలువులున్నా ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడూ ప్రత్యేకమే! అది అనుకున్నంత సులువుగా చేజిక్కదు మరి! ఏళ్లు శ్రమించీ విఫలమయ్యేవారున్నారు. సంతోషమ్మ, చంద్రకళ, దీపారెడ్డి, మమత మాత్రం వారికి భిన్నం. ఒకటి కాదు... మూడు, నాలుగు, అయిదు చొప్పున సాధించారు వీళ్లు. ఆ శ్రమనీ, విజయం వెనక వారు దాటిన సవాళ్లనీ వసుంధరతో పంచుకున్నారు...


ప్రొఫెసర్ల స్ఫూర్తితో...

ఏదైనా సాధించడానికి వివాహం అడ్డుకాదని నిరూపిస్తోంది దీపారెడ్డి. ఈమెది జోగులాంబ గద్వాల్‌ జిల్లా మానవపాడు. హైదరాబాద్‌లోని నిజాం కళాశాల నుంచి ఇంటిగ్రేటెడ్‌ కోర్సు, ఉస్మానియా నుంచి బీఈడీ పూర్తిచేసింది. 2021లో పవన్‌కుమార్‌ రెడ్డితో పెళ్లయినా ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధత కొనసాగించింది. 2022లో దిల్లీ సబార్డినేట్‌ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించినా నియామకానికి సంబంధించి దిల్లీ న్యాయస్థానంలో వ్యాజ్యం నడుస్తుండటంతో వెళ్లలేకపోయింది. తరవాత వెలువడిన గురుకుల పీజీటీ, జేఎల్‌, డీఎల్‌, ఏకలవ్య మోడల్‌ స్కూల్‌ టీచర్‌ ఉద్యోగాలకు ప్రయత్నించి, నాలుగు కొలువులూ సాధించింది. ‘రోజుకు దాదాపు 10 గంటలు చదివేదాన్ని. నాలా అందరూ ఇన్ని గంటలు శ్రమించాలి అనను కానీ... సరైన ప్రణాళిక మాత్రం తప్పనిసరి. నాలుగింటిలో డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగాన్ని చేయాలని నిర్ణయించుకున్నా. ఇందుకు మా యూనివర్సిటీ ప్రొఫెసర్లే స్ఫూర్తి. వాళ్లని చూశాకే అధ్యాపకురాలు అవ్వాలనుకున్నా’ అంటోంది దీపారెడ్డి.

సురేష్‌, మానవపాడు


ప్రజాసేవ... పుస్తకాలతో కుస్తీ

ఓవైపు ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే నాయకురాలామె. అయినా ప్రభుత్వ కొలువును సాధించాలన్న కలను మర్చిపోలేదు లంకాల సంతోషమ్మ. ఈమెది మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దాసరిపల్లి. ఎంఎస్‌సీ, బీఈడీ చేసిన సంతోషమ్మకు డిగ్రీ తొలి ఏడాదిలోనే పెళ్లైయింది. భర్త రాఘవేందర్‌ రెడ్డి ప్రోత్సహించడంతో చదువు పూర్తిచేసింది. ఆపై భర్త అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, సర్పంచ్‌ అయ్యింది. సీసీరోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, పేదలకు సంక్షేమ పథకాలు అందించడం లాంటివెన్నో చేసి, ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకుంది. అంతేకాదు, గ్రామపంచాయతీలకు ఇచ్చే ‘హెల్త్‌ విలేజ్‌, చైల్డ్‌ ఫ్రెండ్లీ విలేజ్‌’ అవార్డులూ గెలుచుకుంది. సంతోషమ్మకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది కల. ఇద్దరు పిల్లలు. ఓవైపు సర్పంచ్‌ బాధ్యతలు. మరోవైపు ఇంటి పనులు. వీటిమధ్య కోచింగ్‌ సెంటర్‌కి వెళ్లే వీల్లేక ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేది. ఖాళీ సమయమంతా పుస్తకాలతోనే కుస్తీ పట్టేది. ‘గ్రామపంచాయతీ పనులు, ఇంటి బాధ్యతలు చూసుకుంటూ చదవడం ఒత్తిడితో కూడుకున్నదే. ఇంట్లోవాళ్ల సహకారంతోనే నెట్టుకొచ్చా’ననే సంతోషమ్మ తాజాగా గురుకుల జూనియర్‌ లెక్చరర్‌గా ఎంపికైంది. గతంలో గురుకుల పీజీటీ, టీజీటీ కొలువులనూ సాధించింది. అన్నట్టూ ఈమె గ్రూప్స్‌ పరీక్షలూ రాసింది. ‘ఇటీవలే సర్పంచ్‌ పదవీ కాలం ముగిసింది. ఇప్పటివరకూ సర్పంచ్‌గా ప్రజలకు సేవ చేశా. ఇప్పుడు జూనియర్‌ లెక్చరర్‌గా విద్యార్థులను తీర్చిదిద్దుతా’నంటోన్న సంతోషమ్మ... సాధించాలన్న పట్టుదలే ఇన్ని బాధ్యతల మధ్యా సమయం కుదుర్చుకునేలా చేసిందంటోంది.

నర్సింగోజ్‌ మనోజ్‌కుమార్‌, మహబూబ్‌నగర్‌


హేళనలు దాటి...

ఆడపిల్లలకు చదువులెందుకు? పెళ్లి చేసి పంపొచ్చుగా అన్న మాటలకు మూడు ప్రభుత్వ, ఒక కేంద్రప్రభుత్వ కొలువులు సాధించి దీటుగా జవాబు చెప్పింది చెన్నా చంద్రకళ. అమ్మానాన్నలు చదువుకోకపోయినా పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. అందుకే టిఫిన్‌ బండి నడుపుతూనే కూతుళ్లిద్దరినీ చదివించారు. చంద్రకళ చిన్నమ్మాయి. వీళ్లది ప్రొద్దుటూరు. అమ్మానాన్నల కష్టం చూసిన ఆమె ఉదయం, సాయంత్రం స్కూలు నుంచి వచ్చాక బండి దగ్గర సాయం చేసేది. ‘పది వరకూ తెలుగు మాధ్యమమే. ఇంటర్‌లో ఒక్కసారిగా ఇంగ్లిష్‌లో చదవాలంటే ఇబ్బందిపడ్డా. ‘అసలు పాసైనా అవుతావా’ అనేవారు తోటివాళ్లు. పట్టుదలగా చదివి, ఇంటర్‌లో 979, డిగ్రీలో 94% మార్కులు సాధించా. అమ్మకు నన్ను ప్రభుత్వోద్యోగిగా చూడాలని కల. అందుకే డిగ్రీ పూర్తవడంతోనే సన్నద్ధత ప్రారంభించా. ఇంట్లో ఉంటే పనులు చేస్తున్నానని అమ్మ అనంతపురంలోని అమ్మమ్మ దగ్గరికి పంపింది. అప్పుడే కొవిడ్‌ రెండోదశ. నన్ను చూడాలని ఉందని నా దగ్గరికొచ్చారు నాన్న. కాసేపు మాట్లాడి, చిన్నాన్న వాళ్లింటికెళ్లారు. నేనేమో ఫోన్‌ సైలెంట్‌లో పెట్టి చదువుకుంటున్నా. తీరా పూర్తయ్యాక చూస్తే బోలెడు మిస్డ్‌ కాల్స్‌. తిరిగి ఫోన్‌చేస్తే నాన్న చనిపోయారన్న కబురు. అప్పుడూ ఇక చదువు మానమన్న సలహాలే. అమ్మ మాత్రం కొనసాగించమంది. తొలి ప్రయత్నంలోనే కర్ణాటక రూరల్‌ బ్యాంకులో పీవో, ఎల్‌ఐసీలో అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ గ్రేడ్‌3 ఆఫీసర్‌ ఉద్యోగాలొచ్చాయి. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో గత అక్టోబరులో చేరా. తొలిజీతం చేతికిచ్చినప్పుడు అమ్మ కళ్లలో ఆనందభాష్పాలు. అవి చూశాక సాధించా అనిపించింది’ అనే చంద్రకళ తాజాగా కేంద్రప్రభుత్వ ఉద్యోగాన్నీ సాధించింది. చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు సాయం చేస్తోంది.

వేల్పూరి వీరగంగాధర శర్మ, పిడుగురాళ్ల


ఉద్యోగం చేస్తూ...

పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అంటోంది పుప్పాల మమత. కాబట్టే ఏకంగా అయిదు ప్రభుత్వ కొలువులు సాధించిందీమె. తనది జగిత్యాల జిల్లాలోని ల్యాగలమర్రి గ్రామం. నాన్న భూమయ్య రైతు, అమ్మ రమ. ఎంకాం, బీఈడీ చేసిన మమత 2019లోనే టీఎస్‌ సెట్‌కి అర్హత సాధించింది. తర్వాత సిరిసిల్లలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఒప్పంద అధ్యాపకురాలిగా చేరింది. మూడేళ్లుగా ఉద్యోగం చేస్తూనే సన్నద్ధత కొనసాగించింది. గురుకుల నియామక పరీక్షలో పీజీటీ, టీజీటీ, మున్సిపల్‌ జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, జూనియర్‌, డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగాలు సాధించి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘కామర్స్‌ అంటే చాలా ఇష్టం. ఇన్ని ఉద్యోగాలు సాధించడానికి అదే సాయపడింద’నే మమత డిగ్రీ లెక్చరర్‌గా విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలనుకుంటోందట.

మల్లారెడ్డి, పెగడపల్లి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్