దిల్లీ మోమోస్‌... న్యూజెర్సీ వీధుల్లో...

అది న్యూజెర్సీ నగరం... సాయంకాలం...  ఆఫీసు నుంచి వచ్చేవాళ్లూ, స్కూలు పిల్లలూ అందరూ ఆ బండి చుట్టూ నిల్చొని ఉన్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందా అని దేనికోసమో ఎదురు చూస్తున్నారు.

Published : 22 Mar 2024 01:33 IST

ది న్యూజెర్సీ నగరం... సాయంకాలం...  ఆఫీసు నుంచి వచ్చేవాళ్లూ, స్కూలు పిల్లలూ అందరూ ఆ బండి చుట్టూ నిల్చొని ఉన్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందా అని దేనికోసమో ఎదురు చూస్తున్నారు. తీరా ఆ ఆర్డర్‌ వచ్చాక లొట్టలేసుకొని మరీ తినడమే కాదు, ప్లేటు మీద ప్లేటు లాగించేస్తున్నారు కూడా. అసలు ఆ బండీ, ఈ తిండీ కథేంటీ అనుకుంటున్నారా!  ఆ బండే ‘ఫోమో మోమో’ ఫుడ్‌ ట్రక్‌. వాళ్లు అంతలా ఎదురుచూసింది మోమోస్‌ కోసం... న్యూజెర్సీలో తెగ ఫేమస్‌ అయిన ఈ మోమో ట్రక్‌ను నడుపుతున్నది మన దేశానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు... అంకితా నాగ్‌పాల్‌, ఇంప్రీత్‌లు. అంకితకు చిన్నప్పటి నుంచీ వారాంతాల్లో దిల్లీ వీధుల్లో బండ్ల మీద దొరికే స్నాక్స్‌ తినడం ఇష్టం. అందులోనూ మోమోలంటే మరీ మక్కువ. పెళ్లి తర్వాత ఆమె భర్తతో పాటు అమెరికా వెళ్లి స్థిరపడింది. అక్కడ భర్త... స్నేహితుడి భార్య ఇంప్రీత్‌ పరిచయమైంది. ఇద్దరి అభిరుచులూ కలిసాయి. ఓసారి మాట్లాడుకునే సందర్భంలో దిల్లీ రుచులను అమెరికా వాళ్లకూ రుచి చూపిద్దామన్న ఆలోచనా వచ్చింది. అలా ‘ఫోమో మోమో’ పేరుతో 2021లో ఫుడ్‌ బిజినెస్‌ మొదలుపెట్టి,  ఓ ఫుడ్‌ ఫెస్టివల్‌లో వీటిని పరిచయం చేశారు. అప్పుడు వాళ్లకు ఎదురైన సవాలు ఏంటంటే... మోమోస్‌ అంటే అక్కడి వారికి అంతగా తెలీదు. ఎలా పరిచయం చేయాలా అని. నార్త్‌ ఇండియాకి తప్ప, దక్షిణాదిన అంతగా పరిచయం లేని వీటిని ఈ దేశంలో ఎలా అమ్మాలా అని ఆలోచించి, ముందు వీటిని ఇక్కడి వారికి పరిచయం చేయాలని భావించి, ఉచితంగానే శాంపిల్స్‌ ఇచ్చేవారు. స్థానికుల నుంచి పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ రావడంతో క్రమంగా 2023లో ఫుడ్‌ ట్రక్‌ వ్యాపారం మొదలుపెట్టారు. పుట్టినరోజులూ, పెళ్లిళ్లూ, బేబీ షవర్‌... లాంటి వాటికీ క్యాటరింగ్‌ సర్వీసులను ప్రారంభించారు.

ప్రత్యేకంగా మెనూ...

‘‘సాధారణంగా అమెరికన్లు సటిల్‌ ఫ్లేవర్లను ఇష్టపడతారు. కానీ కొందరు ఇప్పుడు మన తందూరీ మోమోలనూ ప్లేట్ల కొద్దీ లాగించేస్తుంటే ఆనందంగా అనిపిస్తుంది. అందరికీ నచ్చేట్లు ప్రత్యేక మెనూనీ తయారుచేశాం. డైలీ కస్టమర్లు అందరూ మాకు తెలుసు. వారు ఏం తింటారో ముందే అర్థమైపోతుంది. అందుకు తగ్గట్లు ఆర్డర్‌ తయారుచేసి ఇస్తాం. అంతలా మోమోస్‌కు ఇక్కడివాళ్లు అలవాటు పడ్డారు. ఇప్పుడిప్పుడే ఇక్కడ ఫుడ్‌ ట్రక్కులకు ఆదరణ పెరుగుతోంది. సాధారణ దుకాణాల కంటే ఈ మొబైల్‌ ట్రక్కుల వల్ల కస్టమర్లతో మంచి అనుబంధమూ ఏర్పరచుకోవచ్చు. కాకుంటే గాలులు బాగా వీచినప్పుడూ, వాతావరణం బాగోలేనప్పుడు మాత్రం వీటితో కొంచెం కష్టమవుతుంది. అయితే కిచెన్‌లో ఉండడానికీ, ట్రక్‌ను నడపడానికీ ఎప్పుడూ డజను మంది వర్కర్లు సిద్ధంగా ఉండాలి. వీళ్లను సమన్వయ పరచుకోవడం మరో సవాలు’’ అంటారీ ద్వయం. రోజూ సాయంత్రం 3గంటల నుంచీ 9గంటల వరకూ ఈ ట్రక్‌ బిజీబిజీగా సాగుతుంటుంది. అన్నట్లూ ఈ అమ్మాయిలిద్దరికీ ఇదే ప్రధాన వృత్తి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వీళ్లిద్దరూ టెక్‌ ప్రొఫెషనల్స్‌. ఓ వైపు ఫుల్‌ టైమ్‌ ఉద్యోగం చేస్తూనే... మరోవైపు వ్యాపారాన్నీ విజయవంతంగా నడిపిస్తున్నారు. ప్యాషన్‌నూ, ఉద్యోగాన్నీ సమన్వయం చేసుకుంటూ విజయపథంలో పయనిస్తున్న ఈ స్నేహితురాళ్లు... స్ఫూర్తిదాయకమే కదూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్