ఈ ‘బార్‌’ మహిళల కోసం..!

ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవాలన్నది అందరికీ తెలిసిందే. అయితే ఆ పోషకాల్ని ఓ స్నాక్‌ బార్‌లా తీసుకుంటే ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు.

Updated : 24 Mar 2024 06:38 IST

ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవాలన్నది అందరికీ తెలిసిందే. అయితే ఆ పోషకాల్ని ఓ స్నాక్‌ బార్‌లా తీసుకుంటే ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు. జీవన శైలికి సంబంధించిన వ్యాధుల్ని ప్రధానంగా నెలసరి సమస్యల్నీ బరువునీ తగ్గించుకోవచ్చు అంటూ వాటిని తయారుచేస్తోంది సమంత తాతినేని.  ఆ విశేషాలను వసుంధరతో పంచుకుందిలా...

మా సొంతూరు పాల్వంచ. హైదరాబాద్‌లో ఇంటర్‌, ఊటీలో ఫార్మసీ చదివా. అమెరికాలో ఎమ్మెస్‌ చేసి, అక్కడే ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగంలో చేరా. మూడు సంస్థల్లో 12 ఏళ్లు పనిచేశా. నాన్న చనిపోయినప్పుడు ఇండియాకొచ్చా. అమ్మకు తోడుగా ఉన్నప్పుడే కొవిడ్‌ వస్తే ఇంటి నుంచే పనిచేశా. ఆ సమయంలో డ్రైఫ్రూట్స్‌తో బార్స్‌ చేసి అందరికీ ఇస్తే రుచిగా ఉన్నాయనేవారు. ఇంకా కావాలని అడిగేవారు. అప్పుడే వచ్చిందీ ఆలోచన. ‘ఆహారమే ఔషధం’ అన్న కోణంలో బార్స్‌ చేయాలనిపించింది. చిన్ననాటి అనుభవమూ ఇందుకు కారణమే. చిన్నప్పుడు బొద్దుగా ఉండటంతో హేళనకు గురయ్యేదాన్ని. చదువుకునేప్పుడు సన్నగా మారాలని డైట్‌ చేసేదాన్ని. ఎవరేం చెప్పినా, ఎక్కడేది చదివినా పాటించేదాన్ని. దీంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. తరవాత నాన్న చనిపోయాక కుంగుబాటుతో కనిపించిందల్లా తిని మరింత బరువు పెరిగా. అప్పుడు నన్ను నేను మార్చుకోవాలని పోషకవిలువలపై అవగాహన కోసం పుస్తకాలు చదివేదాన్ని. నేను అనుసరిస్తున్నవన్నీ తప్పని, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని తెలిసింది. న్యూట్రిషన్‌పై ప్రత్యేక కోర్సులోనూ చేరా. ఏయే పోషక విలువలున్న పదార్థాలను రోజుకి ఎంత మోతాదులో తీసుకోవాలో నోట్స్‌ రాసుకునేదాన్ని. ఆ మేరకు వంటింట్లోనే బార్స్‌ చేసి రెండుమూడు నెలల పాటూ తింటూ స్వీయ పరిశీలన మొదలుపెట్టా. లైఫ్‌స్టైల్‌ కూడా మార్చుకున్నా. క్రమేపీ నెలసరి సమస్య దూరమైంది. బరువు తగ్గా. హార్మోన్ల సమస్య తగ్గిందని తెలిసింది. ఇలా నన్ను నేను రెండేళ్లపాటు పరిశీలించుకున్నాకే ‘ట్రూ గ్రబ్స్‌’ పేరుతో బార్స్‌ తయారీకి సిద్ధపడ్డా.

పొదుపు చేసిన రూ.50 లక్షల పెట్టుబడితో పలు ప్రయోగాలు చేశా. వాటికి ప్రభుత్వ అనుమతులు తీసుకున్నాక బార్స్‌లా చేసి మొట్టమొదట ఎగ్జిబిషన్లలో విక్రయించాం. రెస్పాన్స్‌ బాగా వచ్చింది. అయితే వీటి తయారీలో సవాళ్లెన్నో ఎదుర్కొన్నా. చక్కెర, తేనెకు బదులుగా ఖర్జూరం వాడాం. కానీ కొన్ని రకాల ఖర్జూరాలతో చేసే బార్‌లు కొద్దిరోజులకే పుల్లగా మారేవి. మరికొన్ని బార్‌లు గట్టిగా అయ్యేవి. దీంతో నాణ్యమైన ఖర్జూరం కోసం చాలా వెతికా. చివరకు దుబాయి నుంచి వీటిని తెప్పించి వినియోగిస్తున్నాం. అయితే ఈ క్రమంలో తరచూ మెషీన్లు పాడయ్యేవి. మరమ్మతుకు వేరే రాష్ట్రం నుంచి సిబ్బంది వచ్చేవరకు మా ఉత్పత్తి ఆగిపోయేది. చివరకు నేనే ఇప్పుడు మెషీన్లను పార్ట్స్‌గా విడదీసి బిగించేయడం నేర్చుకున్నా. 

ఏమేం వాడతామంటే...

చర్మం, శిరోజాల ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత మెరుగుపరచడానికి మొదట 6 రకాల బార్స్‌ తయారీ ఆరంభించాం. పలురకాల నట్స్‌తోపాటు ఒత్తిడి ఆందోళనను తగ్గించే అశ్వగంధ, యాంటీఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉండే సీబక్తార్న్‌ బెర్రీ పౌడర్‌... వంటివి వాడి న్యూట్రిషన్‌ బార్స్‌, నెలసరి ఆరోగ్యం కోసం హార్మోన్‌ బార్స్‌ను నిపుణుల సలహాతో తీసుకొచ్చాం. వీటిని ఎప్పుడెప్పుడు తినాలనేది దానిమీదే సూచిస్తున్నాం. త్వరలో పిల్లలకూ తీసుకురానున్నాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్