రిస్క్‌ లేకుండా దాచేద్దాం!

వివక్షను దాటుకుని కెరియర్‌ ఆకాంక్షలు నెరవేర్చుకుంటోన్న అమ్మాయిలు... ఆర్థిక భద్రత సాధించే దిశగానూ అడుగులు వేయాలి. గత కొన్నేళ్లుగా మార్పు కనిపిస్తోన్నా... అది ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. అందుకే, పొదుపు చేయడంతో పాటు...పెట్టుబడుల వైపూ దృష్టి సారించాలి. అప్పుడే ఆర్థిక సాధికారత సాధ్యం.

Updated : 19 Mar 2024 04:58 IST

వివక్షను దాటుకుని కెరియర్‌ ఆకాంక్షలు నెరవేర్చుకుంటోన్న అమ్మాయిలు... ఆర్థిక భద్రత సాధించే దిశగానూ అడుగులు వేయాలి. గత కొన్నేళ్లుగా మార్పు కనిపిస్తోన్నా... అది ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. అందుకే, పొదుపు చేయడంతో పాటు...పెట్టుబడుల వైపూ దృష్టి సారించాలి. అప్పుడే ఆర్థిక సాధికారత సాధ్యం.

దాయాలు తక్కువగా ఉన్నా, వేతనాల్లో వ్యత్యాసం కనిపించినా... పొదుపు చేసేందుకు ఇప్పుడిప్పుడే మహిళలు ముందుకొస్తున్నారు. ఇదేదో మామూలుగా చెప్పేసిన విషయం కాదండోయ్‌! భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు-2023 మార్చి పేరిట వెలువరించిన ఓ నివేదిక ప్రకారం 2022లో 19.8గా ఉన్న పొదుపు డిపాజిట్లు 2023లో 20.5శాతానికి పెరిగాయట. గత ఐదేళ్ల లెక్కల్ని  చూస్తే... వ్యక్తిగత డిపాజిట్లలో మహిళల వాటా 29శాతం(రూ.37లక్షల కోట్లు)గా ఉంది.

బంగారం మాత్రమే కాదు...

‘పసిడిని మెచ్చని పడతులుండరేమో’... అందుకే ఎక్కువగా వీరు సంప్రదాయ పెట్టుబడి మార్గాల్లో ఒకటైన బంగారం కొనుగోలుపైనే దృష్టిపెడుతుంటారు. కానీ, ఏటికేడు కొండెక్కి కూర్చుంటున్న పసిడిని వదిలి షేర్‌మార్కెట్లూ, రియల్‌ ఎస్టేట్‌ విభాగాల్లో ఇన్వెస్ట్‌ చేయడానికీ మొగ్గు చూపుతున్నారంటోంది అన్‌రాక్‌ సంస్థ చేసిన ఓ అధ్యయనం. ఇవన్నీ శుభ పరిణామాలే అంటారు ఆర్థిక రంగ నిపుణులు.

నష్టభయాలు ఎక్కువగా ఉండే పెట్టుబడి దారులే కాదు... తక్కువ రిస్క్‌తో లాభాలు అందుకునే పలు మార్గాలెన్నో ఉన్నాయంటారు. వాటిల్లో ఇవి కొన్ని...

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌: ట్రిపుల్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు పొందేందుకు ఉన్న కొద్దిపాటి పెట్టుబడి మార్గాల్లో ఇది ఒకటి. అంటే ఇన్‌కమ్‌ట్యాక్స్‌ యాక్ట్‌ -1961లోని 80సి ప్రకారం...పీపీఎఫ్‌లో పెట్టే పెట్టుబడులకు, లభించే వడ్డీ రాబడిపై పూర్తి పన్ను మినహాయింపు ఉంటుంది. మెచ్యూరిటీ మొత్తంపై కూడా ఆదాయపన్ను చెల్లించక్కర్లేదు. కేవలం రూ.100 ఖాతాను తెరవొచ్చు. ఏడాదికి కనీస డిపాజిట్‌ రూ. 500 గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకూ కట్టుకోవచ్చు. ఖాతా కాల పరిమితి 15 ఏళ్లు. ఆ తరవాత కూడా ప్రతి ఐదేళ్లకోసారి పొడిగించుకోవచ్చు. సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పోస్టాఫీసులు అందించే పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే... ఈ ఖాతా వడ్డీ రేట్లు ఎక్కువ.

మ్యూచువల్‌ ఫండ్స్‌: షేర్‌ మార్కెట్లలో నష్టభయం ఎక్కువ. ఇలాంటప్పుడు  సిప్‌ విధానంలో పరోక్షంగా మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా మదుపు చేయొచ్చు. కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు పెట్టుబడి పెడితే మంచి రాబడి అందుకోవచ్చు. 500 రూపాయల నుంచీ గరిష్ఠంగా ఎంతైనా పొదుపు చేయొచ్చు. అందుకే, ఈ మధ్యకాలంలో మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసే మహిళల వాటా పెరిగిందని చెబుతోంది మ్యూచువల్‌ ఫండ్ల పరిశ్రమ సంఘం యాంఫీ. 2017 మార్చిలో మొత్తం మదుపర్లలో మహిళలు 15 శాతం ఉండగా 2023 నాటికి ఆ సంఖ్య 21శాతానికి చేరిందట. రానున్న కాలంలో ఇది మరింత పెరగనుందట.

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌): రిటైర్మెంట్‌ తరవాత భరోసానూ, గౌరవ జీవితాన్నీ అందించడానికి ప్రభుత్వం ఎన్‌పీఎస్‌ను ప్రారంభించింది. ఉద్యోగులే కాదు...సాధారణ గృహిణులు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళలు ఈ మార్గాన్ని ఎంచుకోవచ్చు.  గరిష్ఠ పెట్టుబడిపై పరిమితి లేదు. కనీస మొత్తం మాత్రం రూ.1000 ఉండాలి. 

మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌: ప్రభుత్వ బ్యాంకులతో పాటు అర్హత ఉన్న ప్రైవేటు బ్యాంకుల్లో మహిళా సమ్మాన్‌ పొదుపు పత్రాలు అందుబాటులో ఉంటాయి. మహిళలు, బాలికల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకమిది. రెండేళ్ల వ్యవధితో ఉండే ఈ పథకంలో 7.5 శాతం వార్షిక వడ్డీని చెల్లిస్తారు. రూ.1000 నుంచి రూ.2,00,000 వరకూ పెట్టుబడిగా పెట్టొచ్చు. అంతేకాదు, జమయ్యే మొత్తాన్ని కాలపరిమితి పూర్తి కాకముందే అంటే... మధ్యలోనే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటూ ఉంది. ఖాతా తెరిచిన ఏడాది తరవాత ఉన్న మొత్తంలో నుంచి 40 శాతం వరకు డ్రా చేసుకోవచ్చు.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(ఎఫ్‌డి): ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు మహిళలకు మరో సురక్షితమైన పెట్టుబడి మార్గం. అనేక ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులతో పాటు పోస్టాఫీసులూ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వీటికి అధిక వడ్డీరేట్లు లభించడంతో పాటు భవిష్యత్తు లక్ష్యాలకు మంచి భరోసానూ అందిస్తాయి. పెట్టుబడి హామీనీ కల్పిస్తాయి.

డిజిటల్‌ గోల్డ్‌: పసిడి కొనడానికి అక్షయ తృతీయ, ధన్‌తేరస్‌..వంటి రోజులే అక్కర్లేదు ... మనసు పడితే చాలంటారు మహిళలు. అయితే, రోజు రోజుకీ పెరుగుతోన్న బంగారం ధరలు మాత్రం ఆడవాళ్లను భయపెడుతున్నాయి. గ్రామైనా కొనగలమా అనేవారు... కాస్త ఖర్చులు తగ్గించుకుని గోల్డ్‌ బార్స్‌, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌.. వంటి డిజిటల్‌ గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మార్గాలను ఎంచుకోండి. తక్కువ మొత్తంలో డబ్బు పొదుపు చేసి బంగారం కొనాలనుకునేవారికి ఇది చక్కని మార్గం, మంచి పెట్టుబడి అవకాశం కూడా.


తొలి మహిళ

రాఫెల్‌ యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళ... ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ శివాంగి సింగ్‌. వారణాసిలో జన్మించిన శివాంగి వైమానిక దళంలో చేరిన రెండవ బ్యాచ్‌ మహిళా ఫైటర్‌ పైలట్‌. మొదట రాజస్థాన్‌ సరిహద్దులోని వైమానిక స్థావరంలో విధుల్లో చేరారు. ఆపై అంబాలా కేంద్రంగా పనిచేసే ‘గోల్డెన్‌ యూరోస్‌’ స్క్వాడ్రన్‌లోకి ఎంపికై అత్యాధునిక యుద్ధ విమానం నడిపే అవకాశం దక్కించుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్