బృందాన్ని నడిపించాలంటే..

పదోన్నతితో బృందానికి నేతృత్వం వహించే స్థాయికి చేరుకున్నప్పుడు మరిన్ని నైపుణ్యాలను పెంచుకోవాలంటున్నారు కెరియర్‌ నిపుణులు..స్థాయి మారిందనే భావంతో కొత్తగా నేర్చుకోవాల్సింది ఏదీ లేదు, అన్నీ తెలుసు అని అపోహ పడకూడదు.

Published : 22 Aug 2022 00:35 IST

పదోన్నతితో బృందానికి నేతృత్వం వహించే స్థాయికి చేరుకున్నప్పుడు మరిన్ని నైపుణ్యాలను పెంచుకోవాలంటున్నారు కెరియర్‌ నిపుణులు..

స్థాయి మారిందనే భావంతో కొత్తగా నేర్చుకోవాల్సింది ఏదీ లేదు, అన్నీ తెలుసు అని అపోహ పడకూడదు. ఎప్పటికప్పుడు కొత్తపాఠాలు నేర్చుకుంటేనే ముందడుగువేయగలమనే నిజాన్ని గ్రహించాలి. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడి, మరెన్నో నైపుణ్యాలను ప్రదర్శించి ఉండొచ్చు. అయితే మరో అడుగు వేయడానికి మరికొన్ని నైపుణ్యాలను పెంచుకోవాల్సిన ఆవశ్యకత కెరియర్‌లో ఉంది.

స్పష్టత..

బృందానికి సమాచారం అందించడంలో స్పష్టత ఉండాలి. ప్రాజెక్ట్‌ వివరాలతోపాటు దాన్ని పూర్తి చేయడానికి నియమిత సమయాన్ని కేటాయించాలి. ఆలోపు పని పూర్తిచేసేలా వారిలో ఉత్సాహాన్ని నింపాలి. ఏ సమయంలోనైనా వారికి చేయూత అవసరమైతే అందించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ పని చేయడానికి వారికి పూర్తి సామర్థ్యం ఉందని ప్రోత్సహించాలి. వాళ్ల సందేహాలను తీర్చగలగాలి. అప్పుడే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఉదాహరణగా..

బృందానికి సూచనలిస్తున్నప్పుడు వాటిని ముందు మీరు పాటించాలి. నేతృత్వంవహించేటప్పుడు వారందరికీ ఓ ఉదాహరణగా మీరుండాలి. ఎదుటివారి నుంచి సమయపాలన, నిబద్ధత వంటివాటిని ఎదురుచూసేటప్పుడు మీరు కూడా వాటిని పాటించి అందరికీ మార్గదర్శిగా నిలబడాలి.

అందరిదీ..

ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తద్వారా వచ్చే ఫలితాలకు అందరూ అర్హులే అనే ఆలోచన మీలో ఉండాలి. ఆ విజయం మీ ఒక్కరిదే అనుకోకూడదు. దాని వెనుక బృందం కూడా ఉందని మరవకుండా ప్రతి ఒక్కరినీ ప్రశంసించాలి. అప్పటివరకు ఎటువంటి ఆశయాలపై మీరు నిలబడి ఉన్నారో, వాటినే అనుసరించడం మంచిది. మీకోసం మాత్రమే కాకుండా, మీతోపాటు ఉన్నవారిలోనూ నైపుణ్యాలను పెంచగలిగితేనే సమిష్టిగా మరిన్ని లక్ష్యాలను సాధించొచ్చు.


స్వాగతించి..

ప్రాజెక్ట్‌ను వివరించేటప్పుడు అందరికీ దాన్ని పూర్తిచేసే సామర్థ్యం ఉందో లేదో గుర్తించాలి. పూర్తి అవగాహన కలిగిస్తూనే, వారి నుంచి వచ్చే కొత్త ఆలోచనలను స్వాగతించాలి. మీరు చెప్పినట్లే వాళ్లు చేయాలని అనుకోవడం మంచిదే. అయితే వాటికి మించి మరొక మంచి ఆలోచన వారి నుంచి వచ్చినప్పుడు దాన్ని స్వీకరించడమే కాదు, ప్రశంసించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని