నిద్ర మత్తు వదలాలంటే...!

పరీక్షల సమయంలో పిల్లలు రాత్రుళ్లూ చదివేస్తుంటారు. వాళ్లతోపాటే తల్లులూ ఉండాల్సిన పరిస్థితి. దీంతో మనమూ ఆలస్యంగా నిద్రపోయి, వేకువజామునే లేవాల్సి ఉంటుంది.

Published : 12 Mar 2024 01:26 IST

పరీక్షల సమయంలో పిల్లలు రాత్రుళ్లూ చదివేస్తుంటారు. వాళ్లతోపాటే తల్లులూ ఉండాల్సిన పరిస్థితి. దీంతో మనమూ ఆలస్యంగా నిద్రపోయి, వేకువజామునే లేవాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగినులైతే, మరుసటి రోజు ఆఫీసులో నిద్ర ముంచుకొస్తుంటుంది. దాన్ని తరిమికొట్టడానికని టీ, కాఫీలపై ఆధారపడుతుంటాం. మితిమీరితే అవీ అనారోగ్యమే కదా! అందుకే...వీటిని ప్రయత్నించి చూడండి.

  • టీ, కాఫీలు నిద్రను ఆపుతాయి అనుకుంటాం కానీ... అదీ తాత్కాలికమే. బదులుగా మంచినీళ్లు, న్యూట్రియంట్లు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోండి. శరీరానికి తగినంత నీరు అందకపోయినా మత్తుగా అనిపిస్తుంది. పండ్లు, కూరగాయలతో చేసిన సలాడ్‌, నట్స్‌, విత్తనాలు వంటివి తీసుకున్నా మంచిదే. మనసూ మళ్లుతుంది, నిద్రా దూరమవుతుంది. కావాల్సిన పోషకాలూ అందుతాయి.
  • తదేకంగా పనిచేసినా మెదడు అలసిపోయి, నిద్ర కమ్మేస్తుంది. అలాంటప్పుడు కాసేపు పక్కకు వెళ్లి, నాలుగడుగులు వేయండి. వీలుంటే తేలికపాటి స్ట్రెచింగ్‌లు చేసినా శరీరం ఉత్తేజితం అవుతుంది. అందుకోసం కుర్చీలో నిటారుగా కూర్చొని పొట్టపై రెండు చేతులనూ ఉంచాలి. ఇప్పుడు కొన్ని నిమిషాలపాటు ముక్కుతో దీర్ఘశ్వాస తీసుకుని నోటితో వదలాలి. ఇలాచేస్తే ఒత్తిడి, ఆందోళనలూ దూరమవడమే కాదు, శరీరమంతటికీ ఆక్సిజన్‌ సరఫరా అవుతుంది. తద్వారా శరీరంలో చురుకు పుట్టి, నిద్ర దూరమవుతుంది.
  • ఏవైనా జోకులు, హాస్య కథలు చదివినా మంచిదే. సరదా సంభాషణలు, ఆనందాన్నిచ్చే అంశాలూ మెదడుని చురుగ్గా చేస్తాయని పలు అధ్యయనాలూ చెబుతున్నాయి.
  • ఏదో ఒకసారి ఇలా అవ్వడం సహజమే. తరచూ జరుగుతోంటే మాత్రం ఆహారంపైనా దృష్టిపెట్టండి. డైట్‌ అంటూ తిండిని నిర్లక్ష్యం చేసేస్తుంటాం. దాంతో ఏర్పడే నిస్సత్తువ కూడా నిద్రలా తోస్తుంది. వేళకు తింటూ, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు అందేలా చూసుకుంటే సమస్య నుంచి బయటపడొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్