Published : 30/09/2021 01:37 IST

వాళ్లలో ఐశ్వర్య కనిపిస్తోంది

బిడ్డ మరణాన్ని మించిన గుండెకోత ఉంటుందా ఏ తల్లికైనా! ఆ బాధని మరిచిపోవడానికే కాదు.. మరే తల్లికీ అలాంటి కష్టం రాకూడదనుకున్నారు చిత్రావిశ్వనాథన్‌. అందుకే తన కూతురు  ఐశ్వర్య పేరుతో ఒక ట్రస్టుని స్థాపించి లక్షలమంది చిన్నారులకి వైద్యం అందిస్తూ వాళ్ల గుండెచప్పుడు ఆగిపోకుండా చూస్తున్నారు.  తన సంకల్పం గురించీ... సేవా ప్రస్థానం గురించీ వసుంధరతో పంచుకున్నారిలా..

నేను పుట్టింది తంజావూరులోనే అయినా పెరిగింది దిల్లీలో. టెక్స్‌టైల్‌ డిజైనింగ్‌లో పీజీ చేశా. మావారు కార్పొరేట్‌ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఉద్యోగరీత్యా జర్మనీ, అమెరికా వంటి దేశాల్లోనూ ఉన్నా. చిన్నతనం నుంచీ కళలంటే ఇష్టం. తంజావూరు పెయింటింగ్‌ని నేర్చుకున్నా. విదేశాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించా. మొదట మాకో అమ్మాయి. ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ రెండో పాప ఐశ్వర్య పుట్టింది. కానీ ఆ సంబరం ఎంతో కాలం నిలవలేదు. పుట్టిన నెలకే తనకి గుండె జబ్బని తెలిసింది. తనకు రెండు శస్త్రచికిత్సలు చేయించాం. లండన్‌ తీసుకెళ్లాం. అన్నీ విఫలమయ్యాయి. మూడేళ్ల వయసులో ఐశ్వర్య మాకు దూరమైంది. ఆ బాధని తట్టుకోవడం నావల్ల కాలేదు. మా నాన్న నాగరాజన్‌ నా మనసు మళ్లించేందుకు పేదపిల్లలకి వైద్యం అందించేందుకు ఓ ట్రస్ట్‌ ప్రారంభించమని సలహా ఇచ్చారు.

మరెవ్వరికీ ఈ కష్టం రాకూడదని...

నా పాపలా ఏ చిన్నారి ప్రాణాలూ పోకూడదని ఆ రోజే నిర్ణయించుకున్నా. నాన్న, ఫోర్టిస్‌ మలర్‌ ఆసుపత్రికి చెందిన హృద్రోగ నిపుణులు డాక్టర్‌ బాలకృష్ణన్‌ల సాయంతో 2008లో చెన్నైలో కొద్దిమొత్తంతో ఐశ్వర్య ట్రస్ట్‌ని ప్రారంభించా. మొదట్లో ఫోర్టిస్‌ మలర్‌ ఆసుపత్రి డాక్టర్లు మాకు అండగా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్‌జీఎమ్‌ ఆసుపత్రి సాయంతో సేవలు అందిస్తున్నాం. అన్ని హృద్రోగ వ్యాధులకూ శస్త్రచికిత్స అవసరం లేదు. కొన్ని మందులతోనూ నయం అవుతాయి. అలాగని నిర్లక్ష్యం పనికిరాదు. కొన్ని గుండె జబ్బుల చికిత్సకు ప్రభుత్వ పథకాలూ ఉన్నాయి. వాటిని వాడుకుంటూ అవసరమైతే మా ట్రస్ట్‌ నుంచి సాయం అందిస్తూ చిన్నారులను కాపాడుతున్నాం. వారంలో రెండు రోజులు చెన్నై, చుట్టుపక్కల మా డాక్టర్ల బృందం పర్యటిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రులకూ వెళ్లి అక్కడి పిల్లలకు ఉచిత స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేస్తాం. సమస్య ఉన్న వారిని వెంటనే చెన్నైలోని ఎంజీఎమ్‌ ఆసుపత్రికి తీసుకొచ్చి తగ్గ చికిత్స అందిస్తాం. ఇప్పటి వరకు 2 లక్షల మందికి స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేశాం. 6 వేల మందికి పైగా పిల్లలకు శస్త్రచికిత్సలు చేసి కాపాడగలిగాం. ప్రభుత్వ బీమా ఉంటే సరే.. లేదంటే మొత్తం ఖర్చు మా ట్రస్టే భరిస్తుంది. తొలిమూడేళ్లూ డబ్బుకోసం చాలా ఇబ్బందులు పడ్డాం. అప్పుడు బంధువులే సాయం చేశారు. తర్వాత మా సేవల గురించి తెలుసుకుని కార్పొరేట్‌ సంస్థలు చేయూతనిస్తున్నాయి.

చిట్టి గుండెల మార్పిడి కూడా...

నాలుగేళ్లుగా గుండెమార్పిడి చికిత్సలూ చేయిస్తున్నాం.  శస్త్రచికిత్స తర్వాత రోగులకు మందుల బాధ్యతా మాదే. 106 మందికి హృదయ మార్పిడి శస్త్రచికిత్సలు చేశాం. తమిళనాడు నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమబంగ తదితర రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ వంటి దేశాల పేద పిల్లలకూ చేయూతనిస్తున్నాం. ఏడాదికి 600 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నాం. వాళ్లంతా కోలుకుని, చక్కగా చదువుకొని మంచి స్థాయికి రావాలనేదే నా లక్ష్యం. మా సాయంతో కొత్త జీవితాన్ని పొంది రోజాపువ్వుల్లా వికసిస్తున్న పిల్లల నవ్వుల్లో నా ఐశ్వర్యను చూసుకుంటున్నాను.

- పి. లక్ష్మిహరికృష్ణ, చెన్నై


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని