Published : 01/02/2022 03:54 IST

అగ్గిపెట్టె ఇంటి నుంచి.. 130 కోట్ల టర్నోవర్‌ దాకా!

ఓ సంస్థకు సీఈఓ! వినడానికి ఎంత గొప్పగా ఉంటుంది? కానీ.. వినీతా సింగ్‌కి అదంతా సులువుగా ఏమీ రాలేదు. లక్షణమైన ఉద్యోగం కాదన్నందుకు ఇంట్లో వాళ్లతో విభేదాలు.. వర్షం పడితే మునిగిపోయే ఇంట్లో ఎన్నో కష్టాలు.. వరుస వైఫల్యాలు.. అయినా విజయాన్ని తరుముకుంటూ వెళ్లారు. ఓవైపు పిల్లల ఆలనాపాలనా, మరోవైపు వ్యాపారం.. అవలీలగా సాగిస్తూ.. ‘ఇది మాకు పెద్ద కష్టమేమీ కాదు’ అని నిరూపిస్తున్నారు. స్ఫూర్తిమంతమైన ఆమె ప్రయాణమిది!

బోలెడు కలలు.. ఆశయాలతో ముంబయిలో అడుగుపెట్టింది వినీతా సింగ్‌. పెద్ద వ్యాపారవేత్త అవ్వాలన్నది ఆమె లక్ష్యం. ‘నేను పుట్టి పెరిగిందంతా దిల్లీనే. నాకు అప్పుడు 17 ఏళ్లు. మా టీచర్‌ ఓసారి ‘నీలో వ్యాపారవేత్త అయ్యే లక్షణాలు బాగా ఉన్నాయి’ అన్నారు. అది నా మనసులో బాగా నాటుకుపోయింది. అప్పటి నుంచీ నా లక్ష్యం వ్యాపారవేత్త అవడమే’ అని చెబుతారు వినీత. దానికి తగ్గట్టుగానే కెరియర్‌ ప్లాన్‌ చేసుకున్నారు. పేరున్న విద్యాసంస్థలే లక్ష్యంగా సీట్లు సాధించారు. ఐఐటీ మద్రాస్‌ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఐఐఎం- అహ్మదాబాద్‌ నుంచి మేనేజ్‌మెంట్‌లో పీజీ పూర్తిచేశారు. పెద్ద సంస్థల్లో స్టూడెంట్‌ ప్రోగ్రామ్‌లూ చేశారు. దీంతో ప్రముఖ సంస్థల్లో రూ.కోటి వార్షిక వేతనంతో ఉద్యోగ ఆఫర్లు వచ్చాయి. ‘2006.. అతి పిన్న వయసులో రూ.కోటి వార్షిక వేతనం అంటూ పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు. ఇంట్లో వాళ్లందరూ చాలా సంతోషించారు. కానీ నేను తిరస్కరించా. ఒకరి కింద ఉద్యోగం నా లక్ష్యం కాదు మరి!’ అంటూ ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటారు వినీత. ఆమె నిర్ణయాన్ని ఇంట్లో వాళ్లు వ్యతిరేకించారు. ఒప్పించడానికి చాలా ప్రయత్నించారు. ‘బంగారం లాంటి ఉద్యోగాన్ని వదిలి.. ఏం నిరూపించాలనుకుంటున్నావ్‌?’ అని నిలదీశారు. అయినా తన లక్ష్యసాధనకు 23 ఏళ్ల వయసులో ఇల్లొదిలి ముంబయి చేరుకున్నారామె.

ఆలోచనలు, ఆచరణలకు ఎంత దూరముందో అర్థం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. తనలా ఎంతోమంది కలల్ని వెంబడిస్తూ ముంబయి వీధుల్లో తిరుగుతున్నారని అర్థమైంది. ‘చేతిలో డబ్బులన్నీ నిండుకున్నాయి. అగ్గిపెట్టెలాంటి ఇంట్లోకి మకాం మార్చాల్సి వచ్చింది. అది చిన్నపాటి వర్షానికీ నీటితో నిండిపోయేది. కానీ నాపై నాకున్న నమ్మకం ముందుకు నడిపేది. చిన్నగా వెంచర్‌ ప్రారంభించా. అది అనుకున్నట్లుగా సాగలేదు. తర్వాత వరుస వైఫల్యాలు. నేనూ మనిషినే కదా! నిరాశ మొదలైంది. ఒకానొక దశలో ‘ఉద్యోగమైతే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదేమో! తప్పు నిర్ణయం తీసుకున్నానా?’ అనిపించింది. ఇలా ఆలోచిస్తుంటే నా వైఫల్యానికి లొంగిపోయినట్లే. దీంతో బయటపడే మార్గం వెతుక్కున్నా’ అనే వినీత.. తనను తాను బలంగా మార్చుకోవడానికి పరుగు పందేలను ఎంచుకున్నారు. కనీసం 43 కి.మీ. ఉండే ఈ మారథాన్లలో గెలుపు ఆమెలో ఆత్మవిశ్వాసం నింపేది. అపజయాలే పాఠాలుగా ఫ్యాబ్‌బ్యాగ్‌ అనే బ్యూటీ సబ్‌స్క్రిప్షన్‌ సంస్థను భర్తతో కలిసి ప్రారంభించారు.

‘దీని ద్వారా మహిళలు నాణ్యమైన ఉత్పత్తుల కోసం ఎంతగా వెతుకుతున్నారో అర్థమైంది. అలా ‘షుగర్‌ కాస్మటిక్స్‌’ పుట్టింది. నా దగ్గరున్న ఆఖరి రూపాయినీ దీనిలో పెట్టుబడిగా పెట్టా. ఫండింగ్‌ కోసం ప్రయత్నించే క్రమంలోనూ ఎన్నో అవరోధాలు. ‘మగవాళ్లతోనే వ్యాపార విషయాలు మాట్లాడతా’మనేవారు. మగాళ్లకి తీసిపోను అని నిరూపించాలని ఆరు నెలల గర్భిణి అయ్యుండీ పురుషుల మారథాన్‌లో పాల్గొన్నా. నెమ్మదిగా ఇతరులకీ నాపై నమ్మకం పెరిగింది. దాన్ని నిలబెట్టుకోవాలనుకున్నా. ఓవైపు పసికందు, తన ఆలనాపాలనా చూసుకుంటూనే ఆఫీసు వ్యవహారాలు చూసుకునేదాన్ని. ఏనాడూ విసుగు చెందలేదు. ఎందుకంటే నేను కోరుకున్న జీవితమిది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూనే సంస్థ బాధ్యతల్నీ నిర్వర్తిస్తున్నా. చాలామంది ఎలా కుదురుతుంది అంటారు. అమ్మాయిలు మల్టీటాస్కింగ్‌ సులువుగా చేసేయగలరు. అందుకు నేనే ఉదాహరణ’ అని గర్వంగా చెబుతారు వినీత. ఇప్పుడు షుగర్‌ కాస్మటిక్స్‌కు 50 లక్షలకు పైగా వినియోగదారులున్నారు. సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ.130కోట్లకు పైనే! చిన్న చిన్న వైఫల్యాలకు భయపడే నేటి తరానికి ఆమె కథ స్ఫూర్తిదాయకమే కదూ!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని