‘సీత’అనుకుని... కాళ్లకు మొక్కుతారు!

రఘురాముడి ప్రాణప్రతిష్ఠ వేళ.. అయోధ్యలోకి సీతాదేవి అడుగుపెట్టారు. ఈ సీత ఎవరో కాదు.. 80వ దశకంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు యావత్‌ దేశాన్ని భక్తి పారవశ్యంలో ముంచిన ‘రామాయణ్‌’ సీరియల్‌లోని సీత పాత్రధారి దీపికా చిఖలియా. రామానంద సాగర్‌ నిర్మించిన ఈ సీరియల్‌ దూరదర్శన్‌లో ప్రసారమై 37 ఏళ్లైనా..  దేశమంతా దీపికను సీతాదేవిగానే భావిస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు చేరుకున్న ఆమెకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

Updated : 22 Jan 2024 06:47 IST

రఘురాముడి ప్రాణప్రతిష్ఠ వేళ.. అయోధ్యలోకి సీతాదేవి అడుగుపెట్టారు. ఈ సీత ఎవరో కాదు.. 80వ దశకంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు యావత్‌ దేశాన్ని భక్తి పారవశ్యంలో ముంచిన ‘రామాయణ్‌’ సీరియల్‌లోని సీత పాత్రధారి దీపికా చిఖలియా. రామానంద సాగర్‌ నిర్మించిన ఈ సీరియల్‌ దూరదర్శన్‌లో ప్రసారమై 37 ఏళ్లైనా..  దేశమంతా దీపికను సీతాదేవిగానే భావిస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు చేరుకున్న ఆమెకు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ‘సీత పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతం’ అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ‘సీత’గా తన ప్రయాణం, అది తన జీవితాన్ని మార్చిన వైనాన్ని దీపిక చెప్పుకొచ్చారిలా...

రామానంద్‌ సాగర్‌తో రెండు సీరియళ్లు చేస్తున్నా. అందుకు సంబంధించిన షూటింగులు ఒక బంగళాలోనే జరుగుతున్నాయి. ఓరోజు చాలామంది చిన్నారులొచ్చారు. వారంతా రామాయణ్‌ అనే భారీ సీరియల్‌లో లవకుశ పాత్రల స్క్రీన్‌ టెస్టు కోసం వచ్చారని తెలిసింది. ఆశ్చర్యంగా కొన్నిరోజుల తర్వాత నాకు కూడా పిలుపొచ్చింది. స్క్రీన్‌ టెస్ట్‌కు వెళితే, అప్పటికే చాలామంది అమ్మాయిలు అక్కడ ఉన్నారు. వారిని చూసి నాకు అవకాశం వస్తుందో లేదోనని భయపడ్డా. ఒకటి, రెండు కాదు... ఐదు స్క్రీన్‌ టెస్టుల తర్వాత అంతిమంగా ఎంపికయ్యాను.

బ్రహ్మర్షి విశ్వామిత్రలోనూ నటించా

ముంబయిలో జన్మించా. చిన్నప్పట్నుంచీ నటి కావాలని కోరిక. తొమ్మిదో తరగతిలో ఉండగా ‘రాజశ్రీ ప్రొడక్షన్స్‌’ నుంచి హీరోయిన్‌ అవకాశం వచ్చింది. ఇందుకు నాన్న తొలుత ఒప్పుకోలేదు. చివరకు అంగీకరించారు. ఆ సినిమా పేరు ‘సున్‌ మేరీ లైలా’. తర్వాత బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రాజేశ్‌ ఖన్నాతోనూ మూడు సినిమాల్లో నటించా. ప్రాంతీయ భాషల్లోనూ అనేక పాత్రలు చేశాను. తెలుగులో ఎన్‌.టి.రామారావు తీసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో చంద్రమతి పాత్ర చేసే అవకాశం దక్కింది. కానీ... సీత పాత్ర నా జీవితాన్ని మార్చేసింది. దేశంలో ఎక్కడికి వెళ్లినా నన్ను సీతాదేవిగా భావించి పాదాలకు నమస్కరిస్తారు. కాళ్లపై పడుతుంటే మొదట్లో భయపడేదాన్ని. నా కంటే వయసులో పెద్దవారు కూడా దండం పెట్టేవారు. నన్ను నటిగా కాదు, సీతాదేవిగా చూస్తున్నారని అర్థమయ్యాక భయం పోయింది. రాముడి దయతోనే 1991లో రాజకీయాల్లోకి ప్రవేశించాను. భాజపా తరఫున పోటీ చేసి... బరోడా లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించాను. అలా నా ప్రతి అడుగులోనూ రాముడి ఆశీస్సులు ఉన్నాయి అనిపిస్తుంది. గత జులైలో నిర్మాణంలో ఉన్న అయోధ్య రామ మందిరానికి వెళితే, అక్కడి పూజారులూ నన్ను సీతాదేవిగానే భావించి ఆలయంలోకి తీసుకెళ్లి గౌరవించారు.

అప్పుడే పెళ్లైంది

రామాయణ్‌ సీరియల్‌ తర్వాత నాకు దమయంతి, పార్వతి లాంటి భక్తి పాత్రలే ఇవ్వడం ప్రారంభించారు. దాంతో సినిమాలు మానేశాను. రాజకీయాల్లోకి ప్రవేశించిన సమయంలోనే నా వివాహమైంది. నా భర్త పేరు హేమంత్‌. ఆయన శింగార్‌ బిందీ, టిప్స్‌ అండ్‌ టోస్‌ కాస్మెటిక్స్‌ అధినేత. నాకు ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం టీవీ ప్రొడ్యూసర్‌గా మారి, సీరియళ్లు నిర్మిస్తున్నాను.

ఆహ్వానం ఊహించలేదు

అయోధ్య ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం వస్తుందని ఊహించలేదు. దేశంలోని ఎంతో మంది దిగ్గజాలు, ప్రముఖులు ఉండగా... సీత పాత్రను చేసిన నన్ను గుర్తుంచుకుంటారని అనుకోలేదు. మనసులో మాత్రం పిలిస్తే బాగుణ్ణు అనుకున్నా. ఆ రాముడే నాపై కరుణ చూపాడేమో రమ్మంటూ ఫోన్‌ వచ్చింది. నన్ను ఎందుకు పిలుస్తున్నారన్నప్పుడు ‘రాముడి ప్రాణప్రతిష్ఠకు సీతాదేవి లేకపోతే ఎలా’ అని సమాధానం విని చాలా సంతోషమేసింది. భావోద్వేగానికి గురయ్యాను. ఇది ఆ రామయ్య ఆహ్వానంగానే భావిస్తున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్